Karthika Somavara Vratha Katha (Telugu) | కార్తీక సోమవారం వ్రత కథ

Karthika Somavara Vratha Katha (Telugu), the story associated with Karthika Somavara Vratham is given here in Telugu…

యమునా నదీ తీరంలో పరమ పావనమైన ఒక దివ్య దేశమున్నది. ఆ దేశాన్ని చిత్ర వర్మ అనే రాజు పాలన చేసేవాడు. ఇది కృత యుగానికి సంబంధించిన కథగా చెప్పబడుతున్నది స్కాంద పురాణంలో. ఎందుకంటే ఇందులోని పాత్రలు దివ్యమైన ఇతిహాస పాత్రలు, పురాణ పాత్రలు. వారి కాలం పరిశీలిస్తే కృతయుగం నాటిది. చిత్రవర్మ అనే రాజుకి మొత్తం ఎనిమిది పుత్రులు కలిగారు. అటు తర్వాత చివరిగా ఒక పుత్రిక కలిగింది. ఒకే ఒక్క అమ్మాయి. పైగా అందరూ మగవాళ్ళే అయిన తర్వాత అమ్మాయి గానీ పుడితే ఎంతో ప్రీతి కలుగుతుంది, వాత్సల్యం ఏర్పడుతుంది. అతనికి అమ్మాయి పుట్టగానే ఎంత ఆనందం కలిగిందంటే పార్వతీ దేవిని కన్న హిమవంతుని వలె ఆనందించాడట. అయితే ఈ శైశవ దశలో ఉండగానే జ్యోతిష్య శాస్త్రవేత్తలను పిలిపించి జాతకం మొత్తం చూపించి ఈమె భవిష్యత్తు ఎలా ఉంటుంది? అని అడిగారు.

వారు చక్కగా పరిశీలించి ఈమె అన్ని సౌభాగ్యాలతోనూ భాసిల్లుతుంది కనుక ఈమెకు సీమంతిని అని పేరు పెట్టండి అని తీర్మానించారు. జ్యోతిష్య శాస్త్రవేత్తలందరూ ఆమెయొక్క జాతక ఫలాలని చెప్పారు. ఈమె గొప్ప స్త్రీ అవుతున్నది. సరస్వతి వలె అన్ని కళలలోనూ రాణిస్తున్నది. రతీదేవి వంటి సౌందర్యము ఉన్నది. దమయంతి వంటి పాతివ్రత్య శోభ ఉంటుంది. అరుంధతి వంటి తేజస్సు ఉంటుంది. ఇలా అనేక రకములు వివరించారు. లక్ష్మీ కళలతో తేజరిల్లుతుంది. ఈమె నిత్యమూ పాతివ్రత్యంతో, సౌభాగ్యంతో, కలకాలం కళకళలాడుతూ ఉంటుంది. ఈమె ఆయుష్షు గొప్పదే, సౌభాగ్యమూ గొప్పదే అని చెప్పారు.

అయితే అందరు పండితులు ఇదే అభిప్రాయం చెప్తే ఒక్కరు మాత్రం “వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనపడుతున్నది. అదేమిటంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చు” అని సూచన చూపించారు. ఈమాట వినగానే రాజు హతాశుడయ్యాడు. ఇది చాలా దుర్భరమైనటు వంటి మాట. కానీ అది మనసులోనే అట్టిపెట్టుకున్నాడు. మొత్తానికి పిల్ల ఎదుగుతూ ఉన్నది. అక్షరాభ్యాసము మొదలైనవి జరిగినవి. బహు శాస్త్ర గ్రంథములు పరిశీలించినది. గొప్ప విద్యా ప్రవీణురాలైంది. కృతయుగం నాటి కథ. అంటే అప్పటికే స్త్రీలు ఏవిధంగా పెరిగే వారు? ఎంత విద్యను పొందేవారు? ఎంత గౌరవంతో ఇంట్లో పూజింపబడే వారు అనేది తెలుస్తున్నది. అందుకు స్త్రీ సంతానం కలిగితే సంతోషించాలి. మహాలక్ష్మి అవతరించినట్లే భావించాలి. అలా ఈమె విద్యలో కూడా చాలా ఉన్నతురాలైంది. అయితే ఈమె దగ్గరున్న చెలికత్తెలలో ఒకామె ఒకరోజున మాట్లాడుతూ చెప్పింది – “చిన్నప్పుడు నీకు జాతకాలు చూపించినప్పుడు ఒక వార్త విన్నాం. నీకు తెలుసా? అన్నది” నాకు తెలియదు అన్నది. అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వలేదు తండ్రి. స్త్రీ చాపల్యం చేత ఆ చెలికత్తె చెప్పివేసింది. “వివాహమైన కొంత కాలానికే భర్త దూరమౌతాడట” అని. వెంటనే చాలా బాధపడింది. ఎందుకంటే వివాహం వయస్సు దగ్గరికి వస్తూ ఉన్నది. ఈ వార్త విన్నది. అంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది? ఎలా ఈ దుఃఖం నుంచి బయటపడాలా? అని ఆలోచిస్తున్నది. ఎందుకంటే మనకి సూచిస్తూ ఒక చెడు జరగబోతోంది అని కనపడుతున్నప్పటికీ భగవదారాధన వల్ల బయటపడవచ్చు. ఇది శాస్త్రం చెప్తున్నది. ఈ తల్లి ఆలోచన చేసి ఏవిధంగా బయటపడాలా అన్న యోచనలో ఉన్న సమయంలో ఆమెకొకటి స్ఫురించింది. గురువులను ఆశ్రయించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏ సమస్య వచ్చినా బెంబేలు పడకుండా ఎలా తరించాలో గురువును ఆశ్రయించి తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రము సమస్యలతో పాటు పరిష్కార మార్గములు చాలా చాలా చెప్పింది.

ఆమె వాళ్ళ యొక్క గురువైనటువంటి యాజ్ఞవల్క్య మహాముని భార్యను ఆశ్రయించింది. ఎందుకంటే ముత్తైదువగా, దీర్ఘ సుమంగళిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నది కనుక దీర్ఘ సుమంగళిగా ఉన్నటువంటి ఋషి పత్నిని ఆశ్రయించింది. అందునా యాజ్ఞావల్క్యుని భార్య మైత్రేయి సామాన్యురాలు కాదు. ఉపనిషత్తులలో ఈమె గురించి చెప్పబడుతున్నది. గొప్ప బ్రహ్మ జ్ఞాన సంపన్నురాలు. అలాంటి ఆ మైత్రేయి వద్దకు వెళ్ళింది. గొప్ప గొప్ప వ్రతములని, శ్రమతో నియమంతో చేసి శివుని మెప్పించినటువంటి ఆ పెద్ద ముత్తైదువ అయిన ఆ మైత్రేయిని ఆశ్రయించింది. అప్పుడు మైత్రేయి తల్లీ! ఏమిటి నీకోరిక? అంటే ఆమె పాదములకు నమస్కరించి అడుగుతున్నది. గురువును ఆశ్రయించేటప్పుడు ఎంత వినయంగా అడగాలో ఈ తల్లిదగ్గర నేర్చుకోవాలి.

ఏ సత్కర్మ చేయడం వల్ల చక్కని సౌభాగ్యం వర్దిల్లుతున్నదో దీర్ఘ సుమంగళీత్వము లభిస్తున్నదో ఆవిధమైన సత్కర్మను నాకు ఆనతివ్వు. ఎందుకంటే బహు శాస్త్రములు తెలిసిన దానవు. గురువు ద్వారా వచ్చిన ఉపాయాన్ని ఆచరించిన వారు ధన్యులవుతారు కనుక శరణ్యవైన నిన్ను శరణువేడి అడుగుతున్నాను. కరుణించి దీర్ఘ సుమంగళి యగునట్లు అనుగ్రహింపవలయు.”

అప్పుడు మైత్రేయి చెప్తున్నది కొంత సేపు ఆలోచించి, శాస్త్రములన్నింటినీ మననం చేసుకొని సరియైన ఉపాయాన్ని చెప్తున్నది –
“ఓ రాజకన్యా విను. శ్రీ గౌరిని శాంకరిని నీలకంఠయుతముగా ఆరాధింపుము. గౌరీదేవిని ఆరాధించాలి. ఎలాగు అంటే నీలకంటుడైన పరమేశ్వరునితో ఉన్న గౌరీదేవిని ఆరాధించాలి. అక్కడ పెద్ద ముత్తైదువ గౌరీదేవి. రుక్మిణీ దేవి కూడా భవ సమేతయైన భవానీ దేవిని ఆరాధించినట్లు భాగవతం చెప్తున్నది. ఆ విధంగా ఆ తల్లిని ఆరాధించితే ఆపదలు, భయాలూ తొలగిపోతాయి. పైగా శుభ్రమైన శుద్ధ వస్త్రాలను ధరించి, ప్రాతః కాల పూజ చేసి అటుపై పగలంతా నియమ బద్ధంగా శివ స్మరణ చేసుకుంటూ అంతరింద్రియ, బహిరింద్రియాలను నిగ్రహించుకోవాలి. వాక్కుని నిగ్రహించుకోవాలి. కోపం పనికిరాదు. అనవసరపు మాటలు కూడదు. నిందా వాక్యములు కూడదు. ఇవన్నీ కూడా నియమములు. శివసంబంధమైన శాస్త్రములు ఏమి చెప్పాయో తెలుసుకొని కపటములేని హృదయంతో ఆరాధన చేయాలి. ఈ ఆరాధన చేసినప్పుడు శివ అష్టోత్తర శతనామములు చేయాలి. గౌరీ అష్టోత్తర శతనామం కూడా చేయాలి. ఉభయులనూ కలిపి ఆరాధన చేయాలి.

పూజానంతరమున పవిత్ర జీవనం గడిపే వారికి భోజనం పెట్టి ముత్తైదువలకు పసుపు కుంకుమలు అందించి వస్త్రములిచ్చి ఆరాధించాలి. ఇలా చేస్తే ఇవి చేసేటప్పుడు ఏవైనా ఆపదలు రావచ్చు, ఏవైనా సమస్యలు రావచ్చు. అయినప్పటికీ చలించరాదు సుమా! ప్రారబ్ధం తప్పించుకోవాలని చేసే వ్రతములలో పరీక్షలు ఎక్కువ ఉంటాయి. వాటిని తట్టుకోవాలి. పట్టుదలతో ఆచరిస్తే శుభం కలుగుతుంది. ఇలా చేసినటువంటి వారికి భవానీ శంకరుల ప్రసాదం వల్ల ఆపదలనే సముద్రాన్ని సులభంగా దాటి పోతావు, ఇష్టం కానిదనేది ఏదీ జరుగదు నీకు. ఇది శివపూజా మహిమ సుమా! శివపూజ మహిమ వల్ల ఎలాంటి సంకటం నుంచైనా బయట పడతారు అని చెప్పగా తనకు ఉపదేశం చేసినటువంటి గురుస్వరూపిణియైన మైత్రేయికి పునః పునః ప్రణామాలు చేసి వ్రతాన్ని చేపట్టింది. అప్పటికి వివాహం కూడా నిశ్చయం కాలేదు. కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి వ్రతాచరణ చేయడం మొదలు పెట్టింది. నిత్యం సోమవార వ్రతం చేస్తున్నది. ఈలోపల తండ్రి చక్కని ఒక సంబంధాన్ని తీసుకువచ్చాడు. అది ఎటువంటి సంబంధం అంటే నలచక్రవర్తి వంశానికి చెందినటువంటి యువకుడు దొరికాడు వరుడిగా. ఇంతకంటే భాగ్యమేమున్నది? అందుకే ఇది కృతయుగం నాటి కథ. నల చక్రవర్తి అప్పటి రాజు. నలచక్రవర్తి యొక్క భార్య పేరు దమయంతి. ఆ పుణ్య దంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు. ఆ ఇంద్రసేనుడి తనయుడు చంద్రాంగదుడు. ఈ చంద్రాంగదుడే ఇప్పుడు వరునిగా వచ్చినటువంటి వాడు. అంటే నలచక్రవర్తికి మనుమడు, ఇంద్రసేనునికి పుత్రుడు ఈ చంద్రాంగదుడు. పైగా అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆ సంబంధం వచ్చింది, నిశ్చయమైనది, వివాహం జరిగింది.

వివాహం జరిగిన కొద్ది రోజులకే యమునలో విహరించాలని కోరిక పుట్టిందిట. దానికి తగ్గ ఏర్పాటు చేశారు మామగారు. దానితో యమునా నదీతీరమునందున్న తోటలంతా విహరించి యమునలో నౌకా విహారం చేశాడట. తన పరివార సమూహంతో సహా ప్రీతిగా వెళుతున్నాడు. అప్పుడు యమున మంచి పొంగు మీద ఉన్నది. నిండుగా ఉన్నది. కొంత దూరం వెళ్ళేసరికి యమున పొంగు ఉద్ధృతమై పడవ కొట్టుకుపోయింది. వెంటనే ఆ వార్త తెలిసింది. ఆ మామ చాలా బాధపడి యమునా నదీ తీరానికి వచ్చి విలపించాడు. మొత్తం పుర ప్రజలందరూ కూడా బాధపడ్డారట. అందరి మృత దేహాలు వచ్చాయి కానీ ఈ చంద్రాంగదుని మృతదేహం మాత్రం రాలేదు. అంటే మృతదేహం కూడా దొరకనంతగా కొట్టుకు పోయాడు అని భావించారు వీళ్ళందరూ. దుఃఖితులయ్యారు. కూతురికి ఎలా చెప్పాలా? అని చూస్తున్నారు. మృతదేహమా కనిపించలేదు. కానీ మరణించాడు అనడానికి సంపూర్ణమైన ఆధారాలు కనపడుతున్నాయి. ఈ మాట చెప్పలేక చెప్పినప్పటికీ గురువాక్యముల యందు విశ్వాసం చేత భగవంతుని యందు శ్రద్ధ చేత ఇది ఒక కష్టము; కష్టం వచ్చినప్పుడు కూడా చలించకూడదు అని చెప్పినది కనుక గురు వాక్యాన్ని ఆధారం చేసుకొని శివారాధన కొనసాగిస్తూన్నది. ఈ వార్త తెలిసిన ఇంద్రసేన మహారాజు చాలా దుఃఖితుడయ్యాడు. అతని బాధ చెప్పలేనంత. ఎందుకంటే కన్నతండ్రి కదా! ఆ బాధతో అతడు రాచకార్యములను కూడా విస్మరించిన దశను గమనించి దాయాదులు అతనిని బంధించి చెరసాలలో పెట్టి రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. ఈమె మాత్రం చెక్కు చెదరకుండా శివారాధన చేస్తూన్నది. అలా మూడేళ్ళు గడిచాయి.

యమునా నదిలో మునిగిపోయిన చంద్రాంగదుడు చిత్రంగా ఆ నదియొక్క లోతులోకి వెళ్ళి పోతూండగా కొందరు నాగకన్యకలు అక్కడికి వచ్చారు. ఆ దివ్యమైన యమునానదీ లోపలి భాగాలలో మునిగిపోతూంటే చూసి పట్టుకొన్నారుట. వాళ్ళు ఇతడి తేజస్సు చూసి మనస్సుకి ఏమనిపించిందో కానీ క్షేమంగా నాగలోకానికి తీసుకువెళ్ళి ఉచితమైన ఉపచారములు చేసి విశ్రాంతినివ్వగా అక్కడికి నాగరాజ్యాన్ని పాలించే దివ్య సార్వభౌములలో ఒకడైన తక్షకుడు వచ్చాడట. అతడు వచ్చి ఇతని చరిత్ర అంతా తెలుసుకొని అతిథిగా వచ్చిన ఈయనకి అన్నివిధములైన సౌకర్యములు, ఆతిధ్యములు, సమర్పణ చేసి అటు తర్వాత కూర్చొని కబుర్లాడుతూ నువ్వు ఈ విధంగా క్షేమంగా ఇక్కడికి రావడం ఉన్నదే అది నీయొక్క సౌభాగ్యం అందులో సందేహం లేదు. నువ్వు ఇలా బయట పడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉన్నది. నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావు? అది చెప్పు అని అడిగాడట.

అప్పుడు ఒక్కసారి తన ఇష్ట దైవాన్ని తలంచుకొని చంద్రాంగదుడు చెప్తున్నాడు. “సర్వ ప్రపంచానికీ, దేవతలకు కూడా ఎవరైతే దేవుడో ఎవడు ఈశ్వరుడో ఆ విశ్వేశ్వరుడు ఆ సర్వేశ్వరుడు ఆ సాంబ సదాశివుడు నాకు ఇష్ట దైవము. ఏ దేవుడిని దేవతలలో మహాదేవుడు అని అంటారో మహాదేవ శబ్దమే చెప్తున్నది ఆయన సర్వదేవతా శ్రేష్ఠుడు అని అట్టి ఉమాపతిని ఇష్ట దైవమ్గా కొలుచుకుంటున్నాను అన్నాడు చంద్రాంగదుడు. అదివిన్న తక్షకుడు సంతోషించి శివ భక్తులను పూజించడం శివుడిని పూజించడమే. అందుకు నీకు తృప్తి కలిగేలా నీకు అన్ని ఆతిధ్యములు అందించి ఇక్కడే నిన్ను ఉండమని కోరుకుంటున్నాం. అంటే అప్పుడు చంద్రాంగదుడు చెప్తున్నాడు – ఎన్ని ఉన్నప్పటికీ నాకిది విదేశమే. నా దేశానికి వెళ్ళే ఏర్పాటు చేయమని ప్రార్థించాడు. అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేసాడు. అంతేకాదు దివ్యమైన తనయొక్క పరివారాన్ని ఇచ్చి పంపించాడట. ఒక గుర్రాన్ని ఇచ్చాడట. ఆ గుర్రం కానీ ఎక్కితే ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్ళగలరు. అలాంటి కామయానమైన తురగాన్ని ఇచ్చాడు. ఆ తురగాన్ని స్వీకరించి తన దేశానికి తిరిగి క్షేమంగా చేరుకున్నాడు. తిరిగి వచ్చిన భర్తను చూసి ఆనందించింది. అది కూడా ఎలాగూ అంటే ఆరోజు సోమవార వ్రతం చేసి ఆ శివునియొక్క పార్థివ లింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళుతూ ఉంటే ఆ నదిలోంచి గుర్రంతో వస్తూ కనపడ్డాడట భర్త. శివ పూజ వృధా కాలేదు అన్నది. ఈవిధంగా తిరిగి భర్తను పొందింది. విషయం తెలిసి తండ్రి సంతోషించాడు. తాను తండ్రిని బంధించిన శత్రువులను ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. ఇలా ఆదుకున్న పరమేశ్వరుని ఉద్దేశించి అఖండమైన రుద్రాభిషేకములు చేశాడట చంద్రాన్గదుని తండ్రి యైన ఇంద్రసేనుడు. ఇక చిత్రవర్మ ఆనందానికి అంతు లేదు. ఇలా వీరందరూ కలిసి శివారాధన చేసి ధన్యులయ్యారని సోమవార వ్రత మహిమని బ్రహ్మోత్తర ఖండం చెప్తున్నది.

Write Your Comment