Sri Sarangaya Namaha

‘Sri Sarangaya Namaha’ is one of the Shiva Sahasranama (1000 Names of Lord Shiva). Meaning and importance of Sri Sarangaya Namaha is given here in Telugu..

శ్రీ సారంగాయ నమః

సారంగము అనేటటువంటిది ఒక పక్షి విశేషం. పక్షులలో సారంగం అనే పక్షి ఉంది. అలాగే జంతువులలో సారంగము అంటే లేడి అని కూడా చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ సారంగము అనే మాటకి రెండు ప్రధానమైన అర్థాలు – మనం వృక్షాలలో ఎలాగైతే విశేషార్ధాలను చూసుకున్నామో అలా పక్షులలో ఇక్కడ విశేషం చూపిస్తున్నారు. పక్షులు, వృక్షాలు, నదులు – ఇవన్నీ కూడా శివ స్వరూపంగా చూడడం ఆంతర్యం శివ సహస్ర నామాలలో ఉన్నది. విభూతి స్వరూప దర్శనం అంటారు దీనిని. విశ్వాన్ని విశ్వేశ్వరుని విభూతిగా చూడాలి. అప్పడు విశ్వమంతా విశ్వేశ్వరుని విభూతి స్వరూపము అనేది ఒక పెద్ద ఉపాసన. అలా మనం చేయగలిగితే చిట్టచివరికి విశ్వమే విశ్వేశ్వరుడు అనే ఎరుక కలుగుతుంది.

అదే మోక్షం అంటే మరేమిటో కాదు. గొప్ప గొప్ప వస్తువులలో పరమాత్మను చూడడం ఒకటి; ప్రతి వస్తువులో గొప్పతనాన్ని పరమాత్మగా చూడడం ఒకటి; రెండున్నాయి ఇక్కడ. సారంగం పక్షి విశేషం అంటారు నీలకంఠీయంలో. సారమైన గొప్ప అవయవములు కలవాడు. అంటే శ్రేష్ఠములైన అవయవములు కలవాడు అని అర్థం శాస్త్రపరంగా చెప్పబడుతున్నది. శ్రేష్ఠము అంటే సృష్టిలో ఉన్న ఏ వికారములూ లేవు అందులో. పుట్టడం, పెరగడం, నశించడం ఇలాంటి ప్రాకృతిక వికారములు లేని గొప్ప స్వరూపము స్వామివారిది. ఆయన లీలగా ధరించినటువంటి ఆకృతి ఏదైతే ఉందో అది శ్రేష్ఠమైన అవయవాలతో శోభిల్లుతూ ఉన్నది అని రెండవ అర్థాన్ని చెప్తున్నారు.

“సారం గమయతీతి సారంగః” – సారమును పొందించువాడు అని అర్థం. ప్రపంచానికి సార వస్తువు ఒకటి ఉంది. అదేమిటి అంటే పరమాత్మ. అందుకే ‘ప్రపంచ సారం’ అని స్వామికి పేరున్నది. “సంసార సారం భుజగేంద్ర హారం” అని స్వామి స్తుతిలోనే మనకు కనపడుతున్నది. సంసారానికి సార వస్తువు పరమేశ్వరుడే. ఆ సార వస్తువైన పరమేశ్వరుని పొందడమే జీవుడికి లక్ష్యం. పరమేశ్వరుడు కూడా తనను చేరాలని తపనపడే జీవులని తనలోకి చేర్చుకుంటున్నాడు. అందుకు చేరవలసిన గమ్యమూ అతడే, చేర్చేటటువంటి శక్తి కూడా అతడే. సారమును పొందించు వాడు అని అర్థం. అంటే ప్రపంచానికి అవసరమైన పరమేశ్వర తత్త్వాన్ని మనకు లభింపజేయువాడు, మోక్షాన్నిచ్చు వాడు అని అర్థం.

Write Your Comment