Ketumaline Namaha

‘Sri Ketumaline Namaha’ is the 688th name in Shiva Sahasranama (1000 Names of Lord Shiva).. Meaning and explanation of this name is given here in Telugu…

కేతుమాలినే నమః:

శివ సహస్ర నామములలో 688వ నామం కేతుమాలి. ఇది నమస్కారంలో కేతుమాలినే నమః అని చెప్పబడుతున్నది. ఇది కూడా పక్షి పరంగా అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్షి పరమైనటువంటి నామాల వరుసలో చెప్పబడుతున్న కారణంగా. పరమేశ్వరుని ఉత్కృష్టమైన విభూతుల రూపంలో చెప్పేటప్పుడు హంస, మయూరము ఇత్యాది రూపములతో ప్రస్తావన ఉన్నది. పైగా మన ఉపాసనా శాస్త్రములందు వివిధములైన పక్షులు చెప్పబడుతూ ఉన్నాయి. గరుత్మంతుడు, హంస, మయూరము, కుక్కుటము ఇలాంటి పక్షులను కూడా మనం ఉపాసనలో చెప్పుకున్నాం. ఈశ్వర విభూతులను మనం ఉపాసించాలి.

ఉపాసన అనేది విభూతి రూపంగా చెప్పబడుతున్నది. విభూతులు అంటే ఐశ్వర్యము అని అర్థం. ఈశ్వరునియొక్క ఉత్కృష్టమైన రూపములను ఐశ్వర్యములు అని అంటాం. వాటిని ఉపాసన చేసిన వారు ఈశ్వర తత్త్వాన్ని తెలుసుకోగలరు. అలా వివిధములైన విభూతులను మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలియజేశారు. అలా ఉపాసనా పరంగా పురాణాలలో ఉత్కృష్టమైన పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, వృక్షముల రూపంలో భగవంతుడిని ఆరాధించడం ఉన్నది. వివిధ సందర్భాలలో మయూరము – సుబ్రహ్మణ్యుని వాహనం; మయూరం అగ్ని స్వరూపంగా చెప్పబడుతున్నది. కుక్కుటము – కోడి కూడా అగ్ని స్వరూపమైన తత్త్వంగా ప్రస్తావన చేయబడుతున్నది.

కేతు మాలి అంటే మయూర, కుక్కుట రూపములతో ఉన్నటువంటి వాడు. పక్షి రూపుడు అనే అర్థాన్ని తెలియజేశారు.
కేతు అంటే జెండా అని అర్థం. మాల అనగా అలంకారము. జెండాని అలంకారముగా కలిగినటువంటి వాడు. స్వామియొక్క ధ్వజము వృషభ ధ్వజము. ఆ వృషభ ధ్వజంతో శోభిల్లువాడు కనుక కేతుమాలి అంటే వృషభ ధ్వజంతో విరాజిల్లు వాడు.

ఇక మూడవ అర్థం సూర్యపరమైన అర్థాన్ని మనకి చెప్తున్నది. కేతువులు అంటే కిరణములు అని అర్థం. ఎలాగైతే రెపరెపలాడే జెండాలుంటాయో అలాగే సూర్య నారాయణుని కిరణ సమూహం కూడా ప్రకాశమానంగా వ్యాపించి ఉంటుంది. అందుకే ‘కేతవః’ అంటూ బహువచన పూర్వకంగా కేతు శబ్దము కిరణముల పరంగా వేదాలలోనే మనకు కనపడుతున్నది. కనుక కేతువులు అంటే కిరణములు. కిరణముల సమూహముతో కలవాడు కేతుమాలి అనగా సూర్యభగవానుడు. సూర్య రూపుడైన పరమేశ్వరుడు అని అర్థం.

Write Your Comment