Nava Chakrangaya Namaha

‘Nava Chakrangaya Namaha’ is the 687th name in Shiva Sahasranama (1000 Names of Lord Shiva). Meaning and explanation of this name is given here in Telugu..

నవ చక్రాంగాయ నమః:

శివ సహస్రనామాలలో 687వ నామం ఇది. నవ+చక్ర+అంగ. ఇక్కడ నవచక్రము – చాలా గొప్ప విశేషమిది. నవ చక్రాంగము అంటే శ్రీచక్ర స్వరూపుడు. ఇది చాలా ప్రధానమైన అర్థమిది.విశ్వమూ నవ చక్రమే, శ్రీ చక్రమూ నవచక్రమే. నవ ఆవరణలతో కూడుకున్నటువంటి చక్రమే తన స్వరూపముగా కలిగినటువంటివాడు. పరమేశ్వరుని ప్రధాన స్వరూపము శ్రీచక్రము. అది వేదవేదాలలోనే భావించ బడుతున్నటువంటిది.

“దేవానాం పూరయోధ్యా ” ఇత్యాది మంత్రాలలో వేదమే శ్రీచక్రాన్ని మనకు అవగతం చేసింది. అలాగే విశ్వమంతా నవ చక్రమే. ప్రపంచమంతా తొమ్మిదింటితోనే నడుస్తున్నది. ఆ తొమ్మిది మూల ధాతువులు. అవి ప్రధానంగా పంచ భూత తత్త్వములు, అవ్యక్త, వ్యక్త, మహత్, అహంకారములు. కలిపితే తొమ్మది. ఈ తొమ్మిదింటితోనే ప్రపంచమంతా ఉన్నది. ప్రపంచం ఒక చక్రం వంటిది. చక్రమంటే నిరంతరం తిరుగుతూ, సంచరిస్తూ, ఆవృతులతో ఉన్నది. కనుక విశ్వమే ఒక నవ చక్రం. ఆ విశ్వ చక్రమే ఆయనయొక్క స్వరూపం. కనుక నవచక్రాత్మకమైన విశ్వమే తన స్వరూపముగా కలిగినటువంటి వాడు.

ఇంకొక అర్థాన్ని మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం. చక్రాంగము అనేటటువంటి పేరు హంసకి చెప్పబడుతున్నది. పక్షి విశేషము అది. పైగా హంసకి ఆ పేరు ఉన్నది. చక్రవాకాలకీ ఈ పేరు ఉన్నది. ఈ పక్షులకి విశేషమైన లక్షణం ఉంటుంది. అదేమిటంటే చక్రము వంటి ఆకారము ఉంటుంది. క్రింది భాగం చూస్తే గోళాకారంలో ఉంటాయిట. హంసకి చక్రాన్గము అని పేరు. నిత్యనూతనమైన హంసా స్వరూపంగా ఉన్నవాడు. హంసలు శివ స్వరూపంగా చెప్పబడుతున్నాయి. “హంసో నామ సదాశివః’ అనే మాట ఉన్నది. సదాశివుడే హంస స్వరూపం అని. “నమామి హంసం పరమాత్మ రూపం” అని కూడా ఆరాధనలో కనపడుతూ ఉన్నది మనకి. ఈ విధంగా పరమేశ్వరుని హంసగా చెప్పడంలో అంతరార్థం ఏమిటి?

ఒకప్పుడు సనక సనందనాదులు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి బ్రహ్మ విద్యా విషయములు ప్రస్తావన చేసినప్పుడు బ్రహ్మదేవుడు పరమేశ్వరుని స్మరించుకున్నాడని, అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ సత్యలోకంలో హంస రూపంతో సాక్షాత్కరించి బ్రహ్మవిద్యను బోధించాడు అని చెప్తారు. ఆవిధంగా యోగులకే యోగి అయిన పరమేశ్వరుడు హంసాకారంలో కనిపించడంలోనే ఒక శుద్ధమైన పరతత్త్వం తాను అని చెప్పబడుతున్నాడు. ఈవిధంగా పరతత్త్వానికి సంకేతంగా హంస స్వరూపం చెప్పబడుతున్నది.

Write Your Comment