Magha Puranam 13th Chapter (Telugu)

Magha Puranam 13th Chapter (Telugu) is explained here. The 13th chapter of Magha Purana describes the ‘story of Lord Shiva explaining the Magha Masa Mahatmya to Goddess Parvati’..

మాఘపురాణం – 13వ అధ్యాయం

శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట

వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీపునకు మరల యిట్లు ప్రశ్నించెను.
“మహామునీ! ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది. గాన సెలవిండ”ని ప్రార్థించగా వశిష్ఠుడు యిట్లు చెప్పసాగెను.

మున్ను పార్వతీ దేవిని శివుడును, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్మ్యం గురించి చెప్పియున్నారు. గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాధి సేవితంబును, నానారత్న విభూషితంబునాగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని వున్నా సమయమున జగజ్జనని యగు పార్వతీదేవి వచ్చి, భర్త పాదములకు నకస్కరించి “స్వామీ! మీవలనననేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని. కానీ ప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలెననెడి కోరిక వున్నది. గాన ఈ ఏకాంత సమయమందాక్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దాన!”నని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను.
దేవీ! నీ యభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము. సూర్యుడు మకరరాశియందు వుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే గాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందు వుండగా, ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియే గాదు, జీవనది వున్నాను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు వున్నచోట గాని తటాకమందు గాని, మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయే గాక సమస్తపాపములు విచ్చిపోవును. రెండవరోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణుదర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మమనునది వుండదు.

దేవీ! మాఘ మాస స్నాన ఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసంనందు భాస్కరుడు మకరరాశియందు ఉండగా ఏది అందుబాటులో వున్న అనగా – నదిగానీ, చెరువుగానీ, నుయ్యి గానీ, కాలువ గానీ, లేక పాదము మునుగునంత నీరున్నచోట గానీ ప్రాతఃకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివలాయమున గాని విష్ణ్వాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింతగాదు.
ఏ మానవునకైననూ తన శరీరంలో శక్తిలేక, నడువలేనటువంటి వాడు, గోవుపాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటియందైనను కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ వాని కష్టములు మేఘమువలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నాన మాచరించిన యెడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియును గాక మాఘమాసమంతట ప్రాతఃకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలఘోరపాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె తానూ బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీస్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తినొందుట శ్రేయస్కరం గదా! ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం గాన ఓ పార్వతీ! ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టి వాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను. సావధానురాలవై ఆలకింపుము.

నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున జపముగానీ, విష్ణుపూజ గానీ, యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టి వాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును. రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును. సలసల కాగు తైలములో పడవేయబడును. భయంకర యమకింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువ ఝాముననే లేచి కాలకృత్యంబులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి, తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామలకు సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీకి అయిదవతనం వర్ధిల్లి, ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములూ అనుభవించును. ఇది ముమ్మాటికీ నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో, అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క జన్మమెత్తి హీనస్థితి నొందును.

మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైనను, జవ్వనియైనను, మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయక మైనది. “ పార్వతీ! దుష్టులలో స్నానం చేసినవారు బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము దొంగిలించిన వారు, గురు భార్యతో సంభోగించు వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన యెడల అట్టివారి సమస్త పాపములు నశించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును, ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును, అసత్యమాడి పొద్దు గడుపు వాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించు వాడును, సదా వ్యభిచార గృహములో తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించు వాడును, రాజ ద్రోహి, గురుద్రోహియు, దేశభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వం కలవాడు, తాను గొప్ప వాడనను అహంభావంతో దైవకార్యాలను, ధర్మకార్యాలను, చెడగొట్టుచూ దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీయు వాడును, ఇండ్లను తగులబెట్టువాడునూ, చెడు పనులకు ప్రేరేపించు వాడునూ, ఈవిధమైన పాప కర్మలు చేయువారలు, ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపకనే మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన యెడల వారందరూ పవిత్రులగుదురు.

“దేవీ! ఇంకనూ దాని మహాత్యంబును వివరించెదను. వినుము. తెలిసియుండియూ పాపములు చేయు వాడునూ, క్రూర కర్మలు ఆచరించు వాడునూ, సిగ్గు విడిచి తిరుగు వాడనూ, బ్రాహ్మణ దూషకుడూ, మొదలగు వారు మాఘ మాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. ఆలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏమానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటినుండి ఆఖరు పర్యంతమూ స్నానమును చేసెదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములూ లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేర అర్హుడు అగును.

శాంభవీ! పండ్రెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్ఠమైనదగుటచే ఆమాసమునందు ఆచరించే ఏ స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా వున్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లేయగును. వృద్ధులు, జబ్బుగా వున్నవారు, చలిలో చన్నీళ్ళలో స్నానం చేయలేరు. కాన అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించినయెడల ఆస్నాన ఫలం పొందగలరు. అదియునూ గాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్ని దేవునికి సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచియై ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసినయెడల మంచి ఫలితము కలుగును.

ఈవిధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైననూ అపహాస్యంగా చూచిననూ లేక అడ్డు తగిలిననూ మహాపాపములు సంప్రాప్తించును. మాఘ మాసం ప్రారంభం కాగానే వృద్ధులగు తండ్రినీ, తల్లినీ, తన భార్యనూ లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించునటుల ఏమానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆవిధంగానే బ్రాహ్మణునిగానీ, వైశ్యుని గానీ, క్షత్రియుని గానీ శూద్రుని గానీ, మాఘ మాసస్నానం చేయమని చెప్పినయెడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులూ ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి గానీ, వారిని ప్రోత్సహించు వాళ్ళను చూసి గానీ ఆక్షేపించి పరిహాసములాడు వానికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుఃక్షీణం, వంశక్షీణం కలిగి దరిద్రుడగును.
నడుచుటకు ఓపిక లేని వారలు, మాఘమాసంలో కాళ్ళూ, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్ళు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి గానీ, వినుట గానీ చేసిన యెడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు, దరిద్రము, నశింప వలయునన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదియును లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘ మాస స్నానము అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృ హత్య మహాపాపములు చేసిన మనుజుడైననూ మాఘమాసమంతయూ కడునిష్ఠతో నున్నఎడల రౌరవాది నరకములనుండి విముక్తుడగును.

కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని. కావున నే చెప్పిన రీతిని ఆచరించుము.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading