Kartika Purana 23rd Chapter in Telugu | కార్తీక పురాణము 23వ అధ్యాయము

Kartika Purana 23rd Chapter in Telugu explains the significance of Srirangam Temple and how Puranjaya attained Moksha at Srirangam Punyakshetram.. It is recited on 23rd day of Karthika Masam..

కార్తీక పురాణము 23వ అధ్యాయము

శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట

అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి “ఓ ముని పుంగవా! విజయమందిన పురంజయుడు యేమి చేసెనో వివరింపు” మని యడుగగా అత్రి మహాముని యిట్లు చెప్పిరి – కుంభ సభవా! పురంజయుడు కార్తీకవ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్ని శేషము, శత్రు శేషము వుండకూడదని తెలిసి, తన శత్రు రాజుల నందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును యేలు చుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమ వంతుడు, పవిత్రుడు, సత్య దీక్షాతత్పరుడు, నిత్యాన్న దాత, భక్త ప్రియ వాది, తేజో వంతుడు, వేద వేదాంగ వేత్తయై యుండెను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖండ కీర్తిని ప్రసరింప చేసెను. శత్రువులకు సింహ స్వప్నమై, విష్ణు సేవా ధురంధరుడై, కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి, అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై యుండెను. ఇన్ని యేల ? అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో వుత్తముడై రాణించు చుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యే విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడ నగుదునా ? యని విచారించు చుండగా ఒకానొక నాడు అశరీర వాణి “పురంజయా! కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠ మని పిలిచెదరు. నీవచటకేగి శ్రీ రంగ నాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్ం నొందుదువు” అని పలికెను.

అంతట పురంజయుడు ఆ యశరీర వాణి వాక్యములు విని, రాజ్య భారమును మంత్రులకు అప్పగించి, సపరి వారముగా బయలు దేరి మార్గ మధ్యమున నున్న పుణ్య క్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్య నదులలో స్నానము చేయుచు, శ్రీరంగమును జేరు కొనెను. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించు చుండగా మధ్య నున్న శ్రీరంగ నాథాలయమున శేష శయ్య పై పవ్వళించి యున్న శ్రీరంగనాథుని గాంచి పరవశ మొంది, చేతులు జోడించి, “దామోదరా! గోవిందా! గోపాలా! హరే! క్రష్ణా! వాసుదేవా! అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణ పురుషా! హృషీకేశా! ద్రౌపదీ మాన సంరక్షకా! దీన జన భక్త పోషా! ప్రహ్లాద వరదా! గరుడ ధ్వజా! కరి వరదా! పాహిమాం!పాహిమాం! రక్షమాం! దాసోహం పరమాత్మా దాసోహం” యని విష్ణు స్తోత్రమును పఠించి, కార్తీక మాస మంతయు శ్రీ రంగము నందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీ రంగ నాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్య మందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.

అయోధ్యా నగరము ధృడ తర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించు చుండెను. అయోధ్యా నగర మందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజ నీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయ శీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగరమం దలి అంగనా మణులు హంస గజ గామినులూ, పద్మ పత్రాయుత లోచనులూనై విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము; సింహ కుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీల వంతులనియు, గుణవంతులనియు ఖ్యాతి కలిగి యుండిరి.

ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై, ప్రౌఢలై, వయో గుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహన హాసాలంకృత ముఖ శోభితలై యుండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూషా పరాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.

పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రత మాచరించి సతీ సమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళ వాద్య తూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతః పురమున ప్రవేశ పెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవ భక్తి పరాయణుడై రాజ్య పాలన మొనర్చుచు, కొంత కాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులు కొని, తన కుమారునికి రాజ్య భారము వప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమున కేగెను. అతడా వాన ప్రస్థాశ్రమము నందు కూడా యేటేటా విధి విధానముగ కార్తీక వ్రత మాచరించుచు క్రమ క్రమముగా శరీర ముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున, ఓ యగస్త్యా! కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మాహాత్మ్యము కలది. దానిని ప్రతి వారును ఆచరించ వలెను. ఈ కథ చదివిన వారికి, చదివినపుడు విను వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి త్రయోవింశోధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణము సమాప్తము.

Write Your Comment