Kartika Purana 29th Chapter in Telugu | కార్తీక పురాణము 29వ అధ్యాయము

Kartika Purana 29th Chapter in Telugu explains how Ambarisha worshipped Durvasa and the significance of Dwadashi Vratha Parana. It is recited on 29th day of Karthika Masam.

కార్తీక పురాణము 29వ అధ్యాయము

అంబరీషుడు దూర్వాసుని పూజించుట – ద్వాదశీ పారణము

అత్రి మహాముని అగస్త్యులవారితో యీవిధముగా – సుదర్శనచక్రము అంబరీషునకభయమిచ్చి వుభయులను రక్షించి, భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్థానమైన వైనము చెప్పి – తిరిగి యిట్లు నుడువనారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, “ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్యగృహస్తుడను. నాశక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును, ద్వాదశీ వ్రతము జేసుకొనుచు ప్రజలకు యెట్టి కీడు రాకూండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నావలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీయెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా ఆతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్ధుని చేయుడు. మీరు దయార్ధ్ర హృదయులు, ప్రధమకోపముతో నన్ను శపించినను మరల నాగృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచుభాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.

మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నానోట పలుకులు రాకున్నవి. నాకండ్ల వెంటవచ్చు అనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నరజన్మ రాకూండా వుండేటట్లును, సదా మీబోటి మునిశ్రేష్టుల యందును – ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు” డని ప్రార్థించి, సహపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను.

ఈ విధముగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి “రాజా! ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, యెవరు శత్రువులకైనను శక్తికొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి. నీవు నాకు యుష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.

నేను నీకు నమస్కరించినచో నాకంటె చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిన యీ స్వల్పకోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశీ వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక మరొకటి యగునా?” అని దూర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసింcచి,అంబరీషుని దీవించి, సెలవుపొంది తన ఆశ్రమమునకు వెళ్లెను.

ఈ వృత్తాంతమంతయు కార్తీకశుద్ధ ద్వాదశీదినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రతప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజునకంతటి శ్రేష్టతయు, మహిమయు గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరినామ సంకీర్తనచే గడిపి అ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణచేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలదీ శ్రీమన్నారాయణుని ప్రీతికొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టివాని సర్వపాపములు యీవ్రత ప్రభావము వలన పటాపంచలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశిఘడియలు తక్కువగా యున్నను, ఆ ఘడియలు దాటకుండగనే భుజింపవలెను.

ఎవరికైతే వైకుంఠములో స్థిరనివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టివారు ఏకాదశీ వ్రతము, ద్వాదశీ వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీకశుద్ధ ద్వాదశి అన్నివిధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱిచెట్టు విత్తనము చాలా చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీకమాసములో నియమానుసారముగ జేసిన యే కొంచెము పుణ్యమైనను, అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలేగాక సమస్తమానవులూ తరించిరి.

ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును – అని అత్రిమహాముని అగస్త్యునకు బోధించిరి.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయము ఇరవై తొమ్మొదో రోజు పారాయణము సమాప్తము.

Write Your Comment