Kartika Purana 17th Chapter in Telugu | కార్తీక పురాణము 17వ అధ్యాయము

Kartika Purana 17th Chapter in Telugu explains the story of Angirasa’s discourse to Dhanlobha. It is recited on 17th day of Karthika Masam.

కార్తీక పురాణము 17వ అధ్యాయము

అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము.

ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.

కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధమువలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ‘ఆత్మ’ యనగా యీ శరీరమున నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది – అని అంగీరసుడు చెప్పెగా

“ఓ మునీంద్రా! నేనింతవరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్థజ్ఞానము కారణమగుచుండును. కాన, ‘అహంబ్రాహ్మ’ యను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి” యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె – ఈదేహము అంతఃకరణవృత్తికి సాక్షియే. ‘నేను – నాది’ అని చెప్పబడు జీవత్మయే ‘అహం’ అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మ ‘నః’ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధిసాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలుగువాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే “ఆత్మ” యనబడును. ‘నేను’ అనునది శరీరేంద్రియాదులలో నొకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదుల నన్నింటిని యేది ప్రకాశింపజేయునో అదియే “నేను” అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతోనుండి నశించునవియేగాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరం బులను మూడింటియందునూ “నేను” “నాది” అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము.

ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటులు శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరిగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మవలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత ‘నేను సుఖనిద్రపోతిని, సుఖంగావుంది’ అనుకొనునదియే ఆత్మ.

దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును, ప్రకాశింపజేయునటులే ఆత్మకూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మపరమాత్మ స్వరూపమగుటవలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే ‘పరమాత్మ’ యని గ్రహింపుము. ‘తత్త్వమసి’ మొదలైన వాక్యములందలి ‘త్వం’ అను పదమునకు కించిత్‌జ్ఞత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం “తత్” అనుపదము నకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. “తత్త్వమసి” అనేది జీవాత్మపర్మాత్మల యేకత్వమును బోధించెను. ఈరీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదలివేయగా సచ్చిదానందరూపమొక్కటియే నిలుచును. ఆదియే ‘ఆత్మ దేహలక్షణము – లుండుట – జన్మించుట – పెరుగుట – క్షీణించుట – చచ్చుట మొదలగు ఆరుభాగములు శరీరానికేగాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడియున్నదో ఆదియే ‘ఆత్మ’. ఒక కుండనుజూచి అది మట్టితో చేసింస్దే యని యేవిధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.

‌జీవులచే కర్మఫల మనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మఫల మనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై గురుశుశ్రూషనొనర్చి సంసార సంబంధమగు అశలన్నీ విడిచి విముక్తి నొందవలయను. మంచిపనులు తలచిన చిత్తశుద్ధియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తిపొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయువలయును. మంచిపనులు చేసిన గాని ముక్తిలభించదు – అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

‌ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి సప్తదశాధ్యాయము పదిహేడు రోజు పారాయణము సమాప్తము.

Write Your Comment