Kartika Purana 11th Chapter in Telugu | కార్తీక పురాణము 11వ అధ్యాయము

Kartika Purana 11th Chapter in Telugu explains the Purana Mahima of Mandhara… 11th Chapter of Karthika Purana is recited on 11th day of Karthika Masam..

కార్తీక పురాణము 11వ అధ్యాయము

మంథరుడు – పురాణమహిమ

ఓ జనక మహారాజా! యీ కార్తీకమాసవ్రతము యొక్క మాహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనినిగురించి యెంత చెప్పినను తనివితీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించినయెడల చాంద్రాయణ వ్రతముచేసినంత ఫలము కలుగును. విష్ణ్యార్చనానంతరం పురాణపఠనం చేసినా, చేయించినా,వినినా, వినిపించినా అటువంటివారు తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్ధగా ఆలకింపుము – అని వశిష్ఠులవారు ఈ విధముగా చెప్పదొడంగరి.

పూర్వము కళింగదేశమున మంధరుడను విప్రుడు గలదు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడినే భుజించుచు, మద్యమాంసాది పానీయములు సేవించిచూ తక్కువజాతి వారి సాంగత్యము వలన స్నానజప, దీపారాధనాదికములను ఆచారములను పాటించక దురాచారుడై మెలగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్తయెంత దుర్మార్గుడయిననూ, పతినే దైవముగానెంచి విసుగుచెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను.

మంధరుడు ఇతరుల యిండ్లలో వంటవాడుగా పనిచేయుచున్ననూ ఇల్లు గడవక చిన్నవర్తకము కూడా చేయసాగెను. అఖరికి దానివలన కూడ పొట్టగడవకపోవుటచే దొంగతనములు చేయుచూ, దారికాచి బాటసారులను బాధించి వారివద్దనున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడి పోవుచుండ నతనిని భయపెట్టి కొట్ట ధనమపహరించు చుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమిపమందున్న ఒక గుహనుండి వ్యాఘ్ర మొకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై బడెను. కిరాతకుడు దానినికూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాటకుని కొట్టి యుండుట వలన అ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకేకాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడ యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి.

మంధరుడు చనిపోయిననాటినుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేయుచు సదాచారవర్తినియై భర్తను తలచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె యింటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆవచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులచే పూజించి “స్వామీ! నేను దీనురాలను, నాకు భర్తగాని, సంతతిగాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను, కాన నాకు మొక్షమార్గము ప్రసాదించు” మని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు , ఆచారములకు అ ఋషి సంతసించి “అమ్మా! ఈ దినము కార్తీకపౌర్ణమి. చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడుచేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకొనవచ్చెదను. నీవు ప్రమిదను,వత్తిని తీసుకొని రావలయును.

దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలము నీవందుకొనుము” అని చెప్పినతోడనే అందుకామె సంతసించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రముచేసి గోమయముచే ఆలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిచేసి రెండువత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించినవారినెల్ల “ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు ర” మ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రియంతయు పురాణమును వినెను. ఆనాటినుండి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు దీసికొనిపోయిరి. కాని – ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుటచేత మార్గమధ్యమున యమలోకమునకు దీసికొనిపోయిరి. అచట నరకమందు మరిముగ్గురితో బాధపడుచున్న తన భర్తను జూచి “విష్ణుదూతలారా! నాభర్తా, మరిముగ్గురునూ యీ నరకబాధపడుచున్నారు. కాన, నాయందు దయయుంచి వానిని వుద్దరింపు”డని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు “అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నానసంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవవాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడవవాడు వ్యాఘ్రము. నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురూ నరకబాధలు పడుచున్నారు” అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకామె చాలా విచారించి ” ఓ పుణ్యాత్ములారా! నా భర్తతోపాటు మిగిలిన ముగ్గురునూ కూడ ఉద్ధరింపు”డని ప్రార్థించగా, అందులకా దూతలు “అమ్మా! కర్తీక శుద్ధపౌర్ణమినాడు నీవు వత్తిచేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదె్ ఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కల్గిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగు”నని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను. ఆ నలుగురును ఆమె కడకువచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తీకమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టిఫలము కలిగెనో వింటివా? అని వశిష్ఠులవారు నుడివిరి.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము.

Write Your Comment