Tirupati Govindaraja Temple Festivals January 2019.. The TTD sub shrine of Sri Govindaraja Temple at Tirupati will host several special events in 2019.
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరిలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– జనవరి 4న శుక్రవారం సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారు సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.
– జనవరి 5వ తేదీ రామచంద్ర తీర్ధకట్ట ఉత్సవం సందర్భంగా సాయంత్రం 4.00 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు రామచంద్ర తీర్ధకట్టకు ఊరేగింపుగా చేరుకుంటారు.
– జనవరి 6 నుండి 29వ తేదీ వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 16వ తేదీ చిన్న శాత్తుమొర, జనవరి 26న పెద్ద శాత్తుమొర నిర్వహించనున్నారు.
– జనవరి 7 నుండి 13వ తేదీ వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారికి నీరాటోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని రామచంద్ర తీర్ధకట్టకు ఊరేగింపుగా తీసుకు వెళ్లి, సాయంత్రం 4.00 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
– జనవరి 14న భోగి పండుగను పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటకు శ్రీ ఆండాళ్ అమ్మవారు సమేత శ్రీకృష్ణస్వామివారు భోగి తేరుపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
– జనవరి 15న మకరసంక్రాంతిని పురస్కరించుకుని ఉదయం 7.00 గంటలకు శ్రీ చక్రత్తాళ్వార్ కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థానం నిర్వహిస్తారు. ఆనంతరం ఆలయానికి చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
– జనవరి 16న కనుమ పండుగ సందర్భంగా గోదాపరిణయంను పురస్కరించుకుని ఉదయం 6.00 గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారిని కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థానం నిర్వహిస్తారు. అక్కడి నుండి పి.ఆర్.గార్డన్స్‌కు చేరుకుంటారు. ఆనంతరం సాయంత్రం 4.30 గంటలకు ఊరేగింపుగా ఆలయానికి విచ్చేస్తారు.
– జనవరి 17న కనుమ పార్వేటి ఉత్సవం సందర్భంగా సాయంత్రం 3.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండళ్ అమ్మవారు రేణిగుంట రోడ్డులోని మండపంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, అక్కడి నుండి ఆలయానికి చేరుకుంటారు.
– జనవరి 18న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారథిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
– జనవరి 22న ప్రణయ కలహోత్సవం సందర్భంగా సాయంత్రం 4.00 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
– జనవరి 25న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.