TTD is all set to observe Sri Thyagaraja Swamy Jayanthi festival on May 10 at Tirumala and in Kakarla, the native place of the saint musician.
On May 10, the 252 Tyagaraja Jayanthi Mahotsavam will be observed in Tirumala in big way with eminent artistes hailing from across the country and presenting Tyagaraja Sankeertans in Kalyana Vedika by 6pm.
While in Kakarla of Prakasam district, the celestial Srinivasa Kalyanam will be performed in TTD Dhyana Mandiram by 6pm.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 10న తిరుమల, కాకర్లలో శ్రీత్యాగరాజస్వామివారి 252వ జయంతి ఉత్సవాలు
మే 05, తిరుపతి, 2019: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తెలుగు వాగ్గేయకార చక్రవర్తి శ్రీత్యాగరాజస్వామివారి 252వ జయంతి ఉత్సవాలను టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మే 10వ తేదీన తిరుమలతోపాటు శ్రీ త్యాగరాజస్వామివారి జన్మస్థలమైన ప్రకాశం జిల్లా కాకర్లలో ఘనంగా నిర్వహించనున్నారు.
తిరుమలలో…
తిరుమలలోని పాపవినాశనం రోడ్డులో గల కల్యాణ వేదికపై సాయంత్రం 6.00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ధర్మప్రచారంలో భాగంగా ప్రముఖ వాగ్గేయకారుల జయంతి, వర్ధంతి మహోత్సవాలను తితిదే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఏడేళ్లుగా తిరుమలలో త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొని శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్న కృతులు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలను ఆలపిస్తారు. ప్రముఖ సంగీత విద్వాంసులతో పాటు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, కళాకారులు, భజన బృందాల సభ్యులు పాల్గొంటారు.
కాకర్లలో శ్రీనివాస కల్యాణం…
ప్రకాశం జిల్లా కాకర్లలోని టిటిడి ధ్యాన మందిరం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు మంగళధ్వనితో శ్రీ త్యాగరాజస్వామివారి జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు ప్రముఖ సంగీత విద్వాంసులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులతో శ్రీత్యాగరాజస్వామివారి ఘనరాగ పంచరత్న కీర్తనలు ఆలపిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీనివాస కల్యాణం వైభవంగా జరగనుంది.
శ్రీ త్యాగరాజస్వామివారు 1767వ సంవత్సరంలో జన్మించారు. వీరి వంశీయులు ప్రకాశం జిల్లా కాకర్ల గ్రామానికి చెందినవారు. యుక్త వయసులో త్యాగయ్య భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు సంతోషించిన నారద మహర్షి స్వయంగా స్వరార్ణవం అనే సంగీత గ్రంథాన్ని ఇచ్చి ఆశీర్వదించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. సంగీత జగద్గురువుగా వినుతికెక్కిన త్యాగయ్య దాదాపు 180 సంవత్సరాల క్రితం తిరువయ్యార్ నుంచి తిరుమల క్షేత్రానికి విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈయన భారత, భాగవత, రామాయణ కావ్య సారాంశాలను ఔపోసన పట్టి తన మధుర సంగీత, సాహిత్య రసాభావంతో తత్త్వ, భక్తి, వేదాంత, దార్శనిక, శాంతి విషయాలను సమగ్రంగా తన కృతుల ద్వారా లోకానికి తెలియజేశారు. అందుకే త్యాగయ్య కృతులను ”త్యాగ బ్రహ్మోపనిషత్తులు” అంటారు. ఈయన 1847వ సంవత్సరంలో పరమపదించారు. ఇంతటి గొప్ప చరిత్ర గల త్యాగయ్య వర్ధంతి ఆరాధనోత్సవాలను తిరువయ్యారులో ప్రతి ఏటా పుష్యబహుళ పంచమినాడు వైభవంగా నిర్వహిస్తారు. ఇదేతరహాలో త్యాగయ్య జయంతి ఉత్సవాలను టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.