Significance of Ashada Masam (in Telugu)

Here is the Significance of Ashada Masam in Telugu. Ashada Masam Vishishtatha, Mahatmya, visheshalu are explained here in Telugu…

ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక వారానికి, ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ/వ్రతం/పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు.

ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.

తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే.

సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.

అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే.

వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.

ఆషాఢ మాసంలో అత్తా అల్లుళ్ళు ఎదురుపడోద్దు అని ఒక ఆచారం ఉంది

”ఆషాఢ మాసం కాదిది, నవవధూవరుల సరస శృంగారాల, సురభిళ సింగారాల, ప్రవిమల ప్రణయాల, వియోగాల విరహాల, అరూడ మాసం” అన్నడో కవి.

ఆషాడం లో అత్తా అల్లుళ్ళు ఎదురుపడోద్దు అని ఒక ఆచారం ఉంది. దీని వెనక ఒక అర్థం చెబుతారు.

పూర్వం వ్యవసాయమే జీవనాధారం .సంపాదన ఎలా ఉన్నా, తినడానికి కొన్ని గింజలు ఉండాలని, క్రొత్త వలపు మోజులో తినడానికి ఆధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అనీ ఈ నిబంధన పెట్టారు.

మరో అర్థం ఏమిటంటే – ఈ మాసంలోని వాతావరణం చాలా మార్పులు ఉంటాయి. ఇప్పుడు కొన్ని అంటువ్యాధులు బాగా ప్రబలుతాయి. పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉండొద్దని కూడా అంటారు. ( పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యమైనదని – ఆ సమయములోనే అవయవాలు ఏర్పడుతాయనే ఈ మధ్యనే సైంటిస్టులు తెలియచేశారు.) పుట్టింటికి పోయిన వధువు ఇంట్లోనే ఉంటుంది. ఆమెకి తోడుగా ఆమె అమ్మ కూడా ఉంటుంది.

ఇంకో కారణం ఆషాడం తరవాత శ్రావణం లో అన్నీ పూజలూ, పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. అందులో దాదాపుగా అన్నీ మంచి రోజులూ ఉంటాయి. ఆ శుభరోజులలో గర్భధారణ జరిగితే – మంచిది అని ఆలోచన. పైన చెప్పానుగా జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలములో అనుకున్నారు. ఇప్పుడు అలా అయితే చాలా బాగుంటుంది అని వారి ఆలోచన. ఇప్పుడు గర్భము ధరిస్తే తొమ్మిది నెలలకి అంటే (శ్రావణం, భాద్రపదం.. అలా చూస్తే చైత్రం వస్తుంది. అంటే ఉగాది పండగ దగ్గరలో..) నిండు వేసవిలో – ప్రసవం జరుగుతుంది. పుట్టిన పిల్లలకి కాస్త తల్లిపాల వల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. తద్వారా పిల్లలు వానాకాలములో వచ్చే వ్యాధులని తట్టుకుంటారు అని కూడా కావచ్చును.వేసవి కాలంలో ప్రసవం అటు తల్లికీ … ఇటు బిడ్డకి కూడా అంత మంచిదికాదు కాబట్టి పెద్దలు ఈ ఆచారాన్ని వెలుగులోకి తెచ్చారని చెప్పుకోవచ్చు.

ఇంకోకారణం ఒక నెల వియోగం తరవాత కలుసుకున్నాక వారు ఎంతో అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా.

ఆషాఢమాసంలో గోరింటాకు

ఆషాఢమాసంలో అతివల అరచేతిలకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటే ఐదోతనమని ముత్తైదువుల నమ్మకం. కొత్తగా పెళ్ళయిన యువతులు ఈనెలలో గోరింటాకు పెట్టుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శుభసూచకమని వివాహాలు, వివిధ శుభకార్యాలయాలకు అరచేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటారు. పాదాలకు పారాణీ, అరచేతులకు అలంకరణగా గోరింటాకు సుపరిచితమే. తొలకరి ఆరంభం ఆషాఢమాసం కావడంతో గోరింటాకు చిగురిస్తుంది. లేతగోరింటాకు కోసి మెత్తగా రుబ్బి పెట్టుకుంటే బాగా పండుతుంది. పెళ్ళికాని అమ్మాయిలకు ఎర్రగా పండితే మంచిమొగుడొస్తాడని నానుడు. ఈ గోరింటాకు ఎర్రగా పండి శరీర ఛాయల నుంచి కళ్ళకు ఇంపుగా కనిపిస్తాయి. ఆషాఢమాసంలో దొరికే గోరింటాకు లేలేతగా ఉండి శరీరంలో రసం త్వరగా ఇంకి చేతులు, కాళ్ళు ఎర్రగా పండుతాయి.

గోరింటాకులో సౌందర్య సాధనంగానే కాక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. కాళ్ళు, చేతులు అధికంగా నీటిలో నానడం వల్ల పుండ్లు పడుతుంటాయి. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడడం తగ్గుతుంది. ఆయుర్వేదంలో గోరింటాకును చర్మరోగాలకు, కాలేయ రోగాలకు, నోటిపూతకు, గనేరియా వంటి రోగాలకు వాడతారు. కీళ్ళనొప్పులు, వాపు ఉన్నవారు గోరింటాకు నూనె పైపూతగా వాడితే మంచిగుణం కనబడుతుంది.
గోరింట చెట్టు ఆకును రుబ్బి దానిని కాలిగోళ్లు, చేతిగోళ్ల చుట్టూ పెట్టుకొని రెండు, మూడు గంటలు నాని ఆరిన తరువాత తీసివేస్తే అది ఎర్రగా పండుతుంది. ఆ విధంగా ఆ ఆకును గోళ్లకు పెట్టుకోవడం వల్ల ఆకురసం గోళ్లు పుచ్చి పోకుండా, పాడై పోకుండా, గోళ్లకు, వేళ్లకు ఏ విధమైన అంటు వ్యాధులు సోకుండా రక్షిస్తుంది. (గోర్ల అంతట) గోర్ల చుట్టూ పెట్టుకునే ఆకు కాబట్టి దానిని గోరంటాకు, గోరింటాకు అన్నారు. అందుకే మన జీవన విధానంలో దానిని ఒక ఆచారంగా సంప్రదాయంగా ప్రవేశపెట్టి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేలా చేశారు. ఈ పద్ధతి కూడా ప్రకృతి కనుగుణంగా వాతావరణ పరిస్థితుల కనుగుణంగా ప్రవేశపెట్టడంలోనే హిందువుల వైజ్ఞానిక దృక్పథం తేట తెలమౌతుంది.

శ్రావణ భాద్రపద మాసాలు వర్షబుుతువులు వర్షాలు బాగా కురవడం వల్ల స్త్రీలు తమ తమ పనులన్నిటినీ ఆ నీళ్లల్లో నానుతూ చేసుకోవలసి వస్తుంది. అంతేగాక నిత్యమూ ఇంటి పనులు, వంట పనులు, పాత్రలు తోమడం, బట్టలుతకడం, ఇల్లలకడం వంటి పనులన్నీ నీళ్లలోనే చేసుకుంటూ ఉండడం వల్ల కాలిగోళ్లు, చేతిగోళ్లు పుచ్చిపోయి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వాటి నుండి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తగా గోరింటాకు పెట్టుకునే ఆచారం ప్రవేశపెట్టారు. వర్ష బుుతువుకు ముందు వచ్చే ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకుంటే గోళ్లు పుచ్చిపోయి పిప్పిగోళ్లు అయ్యే ప్రమాద ముండదు.

తరువాత భాద్రపద బహుళ తదియ, ఉండ్రాళ్ల తద్ది పండుగ-ఆశ్వీయుజ బహుళ తదియ అట్లతద్ది పండుగ. ఈ పండుగ రోజులలో తప్పనిసరిగా ముఖ్యంగా స్త్రీలు గోరింటాకు పెట్టుకోవాలని నియమం ఏర్పాటు చేశారు. ఒకసారి వర్ష బుుతువు ముందు, మరోసారి వర్షబుుతువు మధ్యలో ఇంకోసారి వర్ష బుుతువు అనంతరం ఇలా మూడు పర్యాయాలు ఈ గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యకరమని చెప్పారు. హిందువుల ఆచారాలు ఎంత వైజ్ఞానికంగా ఆరోగ్య ప్రధంగా ఉన్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మూడు పర్యాయాలే పెట్టుకోవాలనే నియమం లేదు. అవకాశం ఉన్నప్పుడు అవసరం అయినప్పుడు దీనిని పెట్టుకుంటూ ఉండవచ్చు.

క్రిముల బారి నుండి గోళ్లను రక్షించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమైనప్పటికీ ఎర్రగా పండి అత్యంత ఆకర్షణీయంగా అందంగా ఉండడం వల్ల కూడ ఒక సౌందర్య సాధనంగా కనిపిస్తుంది.

తెల్లని జుట్టును కూడా నల్లబరిచే ఔషదగుణం గోరిం టాకులో ఉన్నదని ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. గోరింటాకు పొడిని నూనెలో కలిసి వడకట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే తెల్లజుట్టు కూడా నల్లబడుతుంది. కళ్ల మంటలు తగ్గుతాయి. ఒక టీ స్పూను గోరింటాకు పొడిని నిమ్మరసంతో కలిపి ప్రతి రోజూ త్రాగితే రక్తం శుభ్రపడి చర్మంలో మెరుగు వస్తుంది. కాళ్ల పగుళ్లను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. కృత్రిమ గోరిటాకు పొడిని వాడటం కంటే సహజమైన గోరింటాకును వాడటం ఎంతైనా మేలు.

ఈనాడు” పెళ్లిళ్లలో పండుగల్లో అన్నిటా ఈ గోరింటాకు చిత్ర విచిత్ర రూపాల్లో అలంకరించుకుంటున్నారు. ఇలా అలంకరించడం ఒక వృత్తిగా కూడా మారింది. ఈనాడు బ్యూటిపార్లల్లో మనం కోరిన విధంగా రకరకాల డిజైన్లలో గోరింటాకును డిజైను చేస్తున్నారు.

అది సహజమైన చెట్ల నుండి తీసిన పొడిగా మనం చూసుకోవాలి. కృత్రిమంగా రసాయన పదార్థాలతో తయారు చేసిన గోరింటాకు అది అంత మంచిది కాదేమో నని ఆలోచించుకోవాలి. ఎప్పటికైనా గోరింటాకు గోరింటాకే మరి. మీరు గోరింటాకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.

Write Your Comment

2 Comments

  1. Laxman V says:

    Please share me the side effects of aadika ashada maasam to newly married couples. I got married last month itself, so do I need to send my wife to her parental home during aadika ashada masam?. If not what care should I take?

  2. nagendra says:

    HI There no negative shades as per my knowledge. Why this ashadamasam and GAP clearly mention reasons is right. You know simple one reason one super senior saradaga shadamasam kalavakudadura ante adi andaru nammutaru.Karanam seniority ala cheppina oka mata …konni years venatane vachindi….So nammakam manaki undali nothing is happen ani.