Kartika Purana 9th Chapter in Telugu | కార్తీక పురాణము 9వ అధ్యాయము

Kartika Purana 9th Chapter in Telugu explains the war between Vishnu Parshada and Yamadoota.

కార్తీక పురాణము 9వ అధ్యాయము-కార్తీక పురాణము

విష్ణు పార్షద, యమదూతల వివాదము

“ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. వైకుంఠము నించి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్ములను పంపెను” యని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు “విష్ణుదూతలారా! మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు, రాత్రింబవళ్లు సంధ్యాకాలం సాక్షులుగా వుండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులవారీ కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసానకాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు.

వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించువారును, గోహత్య, బ్రాహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారును, పరాన్న భక్షులు, తల్లిదండ్రులను – గురువులను – బంధువులను – కులవృత్తిని తిట్టి హింసించు వారున్నూ, జీవహింస చేయువారున్నూ దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగువారును, యితరుల ఆస్తిని స్వాహాచేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్నవానిని కూడా వదలకుండా బాధించు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలేవారునూ పాపాత్ములు. వారు మరణించగనే తనకడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజుగారి యాజ్ఞ. అది అటులుండగా ఈ ఆజామీళుడు బ్రాహ్మణుడై పుట్టీ దురాచారములకులోనై కులభ్రష్టుడై జీవహింసలుచేసి, కామాంధుడై వావివరసలు లేక, సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు యెట్లు తీసొకొనిపోవుదురు?” అని యడుగగా విష్ణుదూతలు “ఓ యమకింకరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మము లెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును – అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాధప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలమందు ‘నారాయణ’ యని శ్రీహరిని గాని, ‘శివా’ అని శివునిగాని స్మరించువారును,తెలిసిగాని తెలియకగాని మరే రూపమునగాని హరినామస్మరణ చెవినిబడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజామీళుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున ‘నారాయణా!’ అని స్మరించుచూ చనిపోయెను గాన, మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము” అని పలికిరి.

అజామీళుడు విష్ణుదూతల, యమదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది “ఓ విష్ణుదూతలారా! పుట్టిననాటినుండి నేటివరకూ శ్రీ మన్నారాయణ పూజగాని, వ్రతములుగాని, ధర్మములు గాని చేసి యెరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచే ‘నారాయణా!’ యనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నాతల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది” అని పలుకుచు సంతోషముగ విమానమెక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికినీ నిజము.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.

 

Write Your Comment