Kartika Purana 26th Chapter in Telugu | కార్తీక పురాణము 26వ అధ్యాయము

Kartika Purana 26th Chapter in Telugu explains the story of Durva worshipping Lord Vishnu.. It is recited on 26th day of Karthika Masam..

కార్తీక పురాణము 26వ అధ్యాయము

దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట – శ్రీహరి హితబోధ

ఈవిధముగా అత్రిమహాముని అగస్త్యునితో – దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిపి, మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.

ఆ విధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి, తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి, “వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తన్నినను సహించితివి. ఆ కాలిగురుతు నేటికీ నీ వక్షస్థలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరీ! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న” దని దూర్వాసుడు శ్రీ మన్నారాయణుని పరిపరివిధముల ప్రార్ధించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్థించుట చూచి – శ్రీహరి చిరునవ్వు నవ్వి “దూర్వాసా! నీమాటలు యదార్థములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రుడవు. నిన్ను జూచినవారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టిహింస కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీ వకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణిసమూహము నారూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథివై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి ఘడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి, నీరాకకై చూచి చూచి జలపానమును మాత్రమే జేసెను.అంతకంటే అతడు అపరాధము యేమి చేసెను! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ధ దినములందు కూడ జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని ని న్నవమానించుటకు చేయలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీవలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకొనే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్ఠుడు. నిరపరాధి. దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదెటులనిన

నీ శాపములలోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మ మెత్తి హిరణ్యాక్షుని వధింతును.నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూబారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకు డయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్ధుడుగను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రునియింట “కల్కి” యను పేరున జన్మించి, అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి షడ్వింశోధ్యాయము ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.

Write Your Comment