Kartika Purana 25th Chapter in Telugu | కార్తీక పురాణము 25వ అధ్యాయము

Kartika Purana 25th Chapter in Telugu explains the story of Durvasa Maharshi cursing Ambarisha. It is recited on 25th day of Karthika Masam..

కార్తీక పురాణము 25వ అధ్యాయము

దూర్వాసుడు అంబరీషుని శపించుట

“అంబరీషా! పూర్వ జన్మలో కించిత్‌ పాప విశేషము వలన నీకీ యనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము.” అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు “ఓ పండితోత్తములారా! నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్ర శాపము అధికమయినది కాదు.జల పానము చేయుట వలన బ్రాహ్మణుని అవమాన పరచుట గాది. ద్వాదశిని విడచుటయు గాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును ? నిందింపడు. నా తొల్లి పుణ్య ఫలము నశింపదు. గాన, జల పాన మొనరించి వూరకుందును” అని వారి యెదుటనే జల పానము నొనరించెను.

అంబరీషుడు జలపాన మొనరించిన మరు క్షణమునే దూర్వాసుడు స్నాన, జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ “ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి ? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము ?ఎంతటి ధర్మ పరిత్యాగివి ? అతిథికి అన్నము పెట్టెద నని ఆశ జూపి పెట్ట కుండా తాను తినిన వాడు మల భక్షకుడగును. అట్టి అథముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులుజ్ అల పానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించి నావు గాన, నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరి భక్తుడవెట్లు కాగలవు ? శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరి నిందా పరుడు మరియొకడు లేడు. నీవు మహా భక్తుడ వని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వము తోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమాన పరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. “అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజ కుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా ? అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు, ముని కోపమునకు గడ గడ వణకుచు, ముకిళిత హస్తములతో “మహానుభావా! నేను ధర్మ హీనుడను. నా యజ్ఞానముచే నేనీ కార్యమును చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు” డని అతని పాదములపై పడెను. దయా శూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమ కాలితో తన్ని “దోషికి శాపమీయకుండా వుండ రాదు. నీవు మొదటి జన్మలో చేప గాను, రెండవ జన్మలో తాబేలు గానూ, మూడవ జన్మలో పంది గానూ, నాలుగవ జన్మలో సింహము గానూ, యైదవ జన్మలో వామనుడు గానూ, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవు గానూ,యేడవ జన్మలో మూఢుద వైన రాజుగానూ, యెనిమిదవ జన్మలో రాజ్యము గానీ సింహాసనము గానీ లేనట్టి రాజు గానూ, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థుని గానూ, పదవ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుదవు గానూ పుట్టెదవు గాక” అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గ నందున మరల శపించుటకు ఉద్యుక్తుడగు చుండగా శ్రీ మహా విష్ణువు బ్రాహ్మణ శాపము వృథా కాకూడదని, తన భక్తునికి ఏఅపాయము కలుగకుండుటకు – అంబరీషుని హృదయము లో ప్రవేశించి “మునివర్యా! అటులనే మీ శాపమనుభవింతు” నని ప్రాధేయ పడెను. కాని దూర్వాసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వాసునిపై పడ బోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసి చేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటినుండి “బ్రతుకుజీవుడా” యని పరుగిడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుము చుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్నమహా మునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మ ల్కానికి వెళ్లి బ్రహ్మ దేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ యెంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడ లేక పోయిరి.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పంచ వింశోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము.

Write Your Comment