Kartika Purana 22nd Chapter in Telugu | కార్తీక పురాణము 22వ అధ్యాయము

Kartika Purana 22nd Chapter in Telugu explains how Puranyaja observed Karthika Pournami Vratham. It is recited on 22nd day of Karthika Masam.

కార్తీక పురాణము 22వ అధ్యాయము

పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట

మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను
పురంజయుడు వశిష్ఠులవారు చెప్పిన ప్రకారము కార్తీకపౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానము చేసి, సాష్టాంగ నమస్క్రారము చేసి, సూర్యోదయముకాగానే నదికిపోయి, స్నానమాచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు – మెడనిండా తులసీ మాలలు ధరించి పురంజయుని సమీపించి “రాజా! విచారింపకుము. నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీసైన్యమును కూడదీసుకొని, యుద్ధసన్నద్ధుడై నీ శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును” అని దీవించి అదృశ్యుడయ్యెను. “ఈతడెవడో మహానుభావునివలె నున్నాడు, అని అవృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో వున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేక పోయినవి. అదియును గాక, శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్నివిధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా!

ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి “పురంజయా రక్షింపుము రక్షింపు” మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా! విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా “శ్రీహరీ” అని ప్రార్ధంచి త్రాగగా అమృతమైనది గదా! శ్రీహరి కటాక్షము వలన సూర్య చంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా!

హరినామస్మరణ చేసినవారికి శతృవు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేనివారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మాసమంతయు నదీస్నాన మొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులును పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించువారికి యే జాతివారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవ భక్తి కలవాడై కార్తీక వ్రతానుష్టాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును. సంసార సాగర ముత్తరించుటకు దైవ భక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహా ఋఉషులు మరెందరో రాజాధి రాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్త వత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్ప వలె కాపాడు చుండును. ఎవరి కైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి యైనను మరియొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించ వచ్చును. శ్రీహరి – భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందు వలన లోక పోషకుడు, భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదల నొసంగి కాపాడు చుండును.

శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గల వాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షి యందుంచుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో యెవరు చేయుదురో వారి యింట శ్రీ మహా విష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయ గలడు. ఆ యిల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృఉ దేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికీ నిజము.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ద్వివింశోధ్యాయము
ఇరవై రెండో రోజు పారాయణము సమాప్తము.

Write Your Comment