Kartika Purana 1st Chapter in Telugu explains the Karthika Masa Vratha, Karthika Masa Pooja Vidhanam.. This chapter explains how King Janaka questioned Shaunaka Muni and others about Karthika Masa Vrata Vidhi….
శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మండమండలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకుని పురాణాలు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను.
ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, “ఆర్యా! తమవలన అనేక పురాణేతిహాసములు, వేదవేదాంగముల రహస్యములు సంగ్రహముగ గ్రహించినారము. కార్తీకమాస మాహాత్త్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరు చుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది” అని కోరిరి.
అంత నా సూతమహర్షి “ఓ మునిపుంగవులారా! ఒకప్పుడు యిదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి – విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ, సాంబశివుడు పార్వతీదేవికీ తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక, యిహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపు” డని యిట్లు చెప్పెను.
పుర్వమొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించు చుండగా పార్వతీదేవి ” ప్రాణేశ్వరా సలలైశ్వర్యములు కలుగచేయునట్టిదీ, సకల మానవులూ వర్ణబేధములు లేక అచరించదగినదీ, శాస్త్ర సమ్మతమైనదీ, సూర్యచంద్రులున్నంత వరకూ నాచరింపబడెడిదీ యగు వ్రతమును వివరింపు” డని కోరెను. అంతట మహేశుడు మందహాస మొనరించి “దేవీ! నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడియున్నది. దాని నిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు మా మిథిలానగరమువైపు” అని మిథిలానగరపు దెసగా చూపించెను.
అట, మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్లు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని ‘మహాయోగీ! మునివర్యా! తమరాకవల్ల నేనూ, నా శరీరమూ, నా దేశమూ, నా ప్రజలూ పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నాదేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవొసంగుడని వేడుకొనెను.
అందులకు వశిష్ఠుడు – జనక మహారాజా! నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని. దానికి కావలసిన అర్థబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి యిటు వచ్చితిని – అని పలుకగా జనకుడు “మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరింపుడు. కాని, చిరకాలమునుండీ నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నా యదృష్టము కొలదీ యీ యవకాశము దొరికినది. గురురత్నా! సంవత్సరములో గల మాసములలో కార్తీకమాసమే యేల నంత పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమిటి? అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది. కావున తాము కర్తీక మాహాత్త్యమును గురించి వివరించవలసినది” యని ప్రార్థించెను.
వశిష్ఠమహాముని చిరునవ్వు నవ్వి, “రాజా! తప్పక నీ సంశయమును దీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులునూ ఆచరించదగినది సకల పాపహరమైనదీ అయి ఉన్నది. ఈ కార్తీకమాసము హరిహర స్వరూపము. ఈ మానమునందాచరించు వ్రతముయొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. వినుటకు గూడా నానందదాయకమైనది. అంతియే గాక వినినంతమాత్రముననే యెట్టి నరకబాధలను లేక యిహమందునూ, పరమందునూ సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు యీ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపు” మని యిట్లు చెప్పసాగెను.
వశిష్ఠుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట:
ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను యే వయస్సువాడైనను ‘ఉచ్చ – నీచ’ అనే భేదములేక కార్తీక మాసములో, సూర్యభగవానుడు తులారాశియందుండగా, వేకువ జామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మములును, దేవతాపూజలునూ చేసినచో – దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కర్తీకమాస ప్రారంభమునుండియు యిట్లు చేయుచూ, విష్ణు సహస్ర నామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి “ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము” అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించవలయును.
కార్తీక స్నానవిధానము
శ్లో!! ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతీ త్రయశ్శిఖాః
తస్మై తారాత్మనే మేథాదక్షిణామూర్తయే నమః !!