Kartika Purana 19th Chapter in Telugu | కార్తీక పురాణము 19వ అధ్యాయము

Kartika Purana 19th Chapter in Telugu explains the significance of Chaturmasya Vratham. It is recited on 10th day in Karthika Masam..

కార్తీక పురాణము 19వ అధ్యాయము

చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ

ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట.. జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి “ఓ దీనబాంధవా! వేదవేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందనా! మాస్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా! మే మీ సంసారబంధము నుండి బయటపడ లేకుంటిమి. మమ్ముద్ధరింపుము. మానవుడెన్ని పురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనము బడయ జాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదువు. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! వృషీకేశా! నన్ను కాపాడుము” అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి “జ్ఞానసిద్ధా! నీ స్తోత్రవచనములకు నేనెంతయో సంతసించితిని. నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము” అని పలికెను. అంత జ్ఞానసిద్దుడు “ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరమునుండి విముక్తిడను కాలేక శ్లేష్మమున పడిన యీగవలె కొట్టుకొను చున్నాను. కనుక, నీపాద పద్మముల పై నా ధ్యానముండు నటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు” అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు “ఓ జ్ఞానసిద్ధుడా! నీకోరిక ప్రకాన మటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేకమంది దురాచారులై, బుద్ధిహినులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టివారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై అలకింపుము.

నేను అషాడ శుద్ధ దశమిరోఉన లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీకమాసమున శుద్ధద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈవ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి, నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యము లందు వ్రతములు చేయని వారు నరక కూపమున బడుదురు. ఇతరులచేత కూడ అచరింప చేయవలయును. దీని మాహాత్మ్యమును తెలిసి యుండియు, వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసిన వారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా అషాఢ శుద్ధ దశమి మొదలు శాకములును, శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, అశ్వయుజ శుద్ధదశమి మొదలు పప్పు దినుసులను విసర్జించ వలయును. నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రా వ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వొసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించినవారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు” అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవ్వశించెను.

వశిష్టుడు జనక మహారాజుతో “రాజా! ఈవిధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహాత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్రీ పురుష భేదము లేదు. అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చాత్రుమాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము పంతొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.

Write Your Comment