Importance of Datta Murthi (in Telugu)

Lord Dattatreya

Lord Dattatreya

Importance of Datta Murthi in Telugu explains us about the significance of Dattavatarams (incarnations of Lord Dattatreya) and the holy places associated with Datta Bhagavan…

దత్తమూర్తికి చాలా ప్రియమైన నది కృష్ణ. కృష్ణ బ్రహ్మవిష్ణుమహేశ్వరాత్మకమైన నది. బయలుదేరగానే బ్రహ్మనది కలుస్తుంది. తర్వాత వేణీ నది కలుస్తుంది. వేణి అంటే శివుడు. కృష్ణ అంటే విష్ణుమూర్తి. మూడు నదులున్నాయి కృష్ణలో. అందుకనే దత్తభక్తులు కృష్ణానదీ ప్రదక్షిణం చేస్తారు. దత్తాత్రేయ అవతారాలన్నీ కృష్ణలోనే అంతర్థానమైనాయి. శ్రీశైలంలో నరసింహ సరస్వతీ స్వామీ వారు – పాతాళగంగ; కురవపురంలో శ్రీపాద శ్రీవల్లభులు. మూడే అవతారాలు. ప్రసిద్ధమైన అవతారములు రెండు. ఆదియుగంనుంచీ శ్రీదత్తాత్రేయ గురుమూర్తి. ఆయనే మధ్యగా ఒకరూపం ధరించారు. సుమతి, అప్పలరాజులకు శ్రీపాదులుగా. నరసింహ సరస్వతీ స్వామిగా కరంజా నగరంలో మూడవ అవతారం ధరించారు.

నరసింహ స్వామి, రామకృష్ణులు, శ్రీరామమూర్తి, ఈ అన్ని అవతారాలలో దుష్ట శిక్షణ కూడా ఉంది. దుష్ట శిక్షణ లేని అవతారం దత్తాత్రేయ అవతారం. అలాగే వెంకటేశ్వర అవతారం. అది అర్చామూర్తి. ఇది యోగమూర్తి. శ్రీదత్తాత్రేయ అనుగ్రహమే తప్పితే ఆగ్రహం ఎక్కడా లేదు. అవధూత లక్షణం. ఏ భోగాన్ని అపేక్షించరు. ఏసేవా ఉండదు. దత్త క్షేత్రాలన్నింటిలో పల్లకీ సేవ తప్పితే రథోత్సవాలుండవు. కళ్యాణాలు లేవు. వారికి కూడా అనఘా ఉందనీ, కళ్యాణం అనీ అంటారు. అది అసంప్రదాయం. శాస్త్రములలో పురాణాలలో ఎక్కడా చెప్పబడలేదు. దత్తాత్రేయ మహాత్మ్యంలో ఖిల గ్రంథంలో ఒక చిన్న మాట ఉంది. భవిష్యత్తులో అనఘా అని ఒక ఆమె అవతరిస్తుంది. శ్రీదత్తాత్రేయ అనుగ్రహం పొందుతుంది అని. అది భవిష్యత్ కాలానికి సంబంధించింది కానీ ఇప్పుడు ఉన్న దత్తాత్రేయునికి సంబంధించింది కాదు.

శ్రీ దత్తాత్రేయ మూర్తి ఏకాంత స్వరూపం. జంభాసురుడు అనేవాడున్నాడు. వాడు పెద్ద పరివారంతో వచ్చి దేవేంద్రాదులను గెలిచాడు. ఇంద్రాది దేవతలు వచ్చి దత్తాత్రేయుల వారి కాళ్ళమీద పడ్డారు మాహూర్ లో. మాతాపూర్ అని పేరు దానికి. స్వామి నేను ఎవ్వరిని సంహరించే వాడిని కాను అని. మరి శంఖ చక్రాలెందుకు అన్నారు. శంఖం బోధ కోసం, చక్రం అరిషడ్వర్గ నాశనం కోసం. శూలం ప్రతిబంధక క్షయం కోసం. డమరు తత్త్వజ్ఞాన బోధ కోసం, ఇలా ఆరు ఆయుధాలలో ఆరు రూపాలు చెప్పారు స్వామి. మీరే నారాయణ స్వరూపులు, నేనెక్కడికి పోతాను, రక్షించాలి అన్నాడు. సరే అంత విశ్వాసంతో వచ్చావు, మా వెనక కూర్చోమన్నారుట. దేవతలంతా వెళ్ళి వెనక కూర్చున్నారు. జంభాసురుడొచ్చాడు ఆయుధాలు తీసుకొని. వచ్చేటప్పటికి తొడమీద ఒక స్త్రీని కూర్చోబెట్టుకొని ముద్దులాడుతున్నారు స్వామి. వాడు రాగానే ఈమెని చూశాడు. దేవతలు, యుద్ధం అనే మాట మర్చిపోయి ఈమెని పట్టుకెళ్ళాడు. తీసుకొని నెత్తిమీద పెట్టుకున్నాడు. లక్ష్మిట పదం దగ్గర బయలుదేరుతుంది మానవుడికి. వక్ష స్థలానికి వచ్చేటప్పుడు బాగా ప్రకాశిస్తుంది. నెత్తిమీదకి వస్తే కృష్ణార్పణం, వాడు ఆరిపోతాడు. ఎవడి శిరోభాగం దగ్గరికి లక్ష్మి వస్తుందో అక్కడ అతడు హతమైపోతాడు. అప్పుడు ఇంద్రుడిని పిలిచి వెళ్ళి కొట్టమన్నాడు. అప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తే నిమిషంలో చచ్చిపోయినాడు జంభాసురుడు. ఇది దత్తాత్రేయ మహాత్మ్యం లో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. ఆ స్త్రీ పేరు అనఘా అన్నారు. ఈమె భార్య కాదు, భక్తీ కాదు స్వామియొక్క శక్తి. “శక్తి శక్తిమతోరభేదః” – పరమాత్మ శక్తివంతుడు. శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం” నీలో ఉన్న శక్తి. నీకూ శక్తికీ భేదం ఉంటుందా? కనుక పరమాత్మయొక్క చిచ్చక్తే అమ్మవారిగా కనపడుతుంది. అమ్మా లేదు అయ్యా లేదు. కళ్యాణం చేసుకుంటున్నాం అంటే మనం భావించడానికి, భక్త సంతోషానికి, ఉపచారానికి చేసుకుంటున్నాం. కనుక పరమాత్మయొక్క శక్తి మంత్రశాస్త్రంలో కూడా శక్తిలేని మంత్రం పనిచేయదు. శక్తి లేని మంత్రానికి విలువ లేదు. అందుకనే చూడండి హనుమంతునికి సువర్చలను కల్పించారు. సుబ్రహ్మణ్య స్వామికి వల్లీ దేవసేన అన్నారు. విఘ్నేశ్వరుడికి సిద్ధి బుద్ధి ఏవో చాలా అన్నారు. ఇవన్నీ పెళ్ళాలు అనుకుంటారు. పొరపాటు. బీజములన్నమాట. ఇవి మంత్రాలకు సంపుటి. అలాగే శ్రీ దత్తాత్రేయ మూర్తికి మధుమతి సంపుటి. ఆ మధుమతి స్వరూపంగా ఎక్కడా లేదు. ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైన క్షేత్రం ఎత్తిపోతల – యతి తపోస్థలం. అక్కడ దత్తాత్రేయ మూర్తి చాలా స్ఫుటంగా కనపడతారు మనకు.

Write Your Comment