అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ – సెప్టెంబరు 2018

సెప్టెంబరు 2 నుండి 6వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ

తిరుపతి, 2018 ఆగస్టు 30: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ సెప్టెంబరు 2 నుండి 6వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సెప్టెంబరు 1వ తేదీ శనివారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటలకు మేదిని పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి గర్భాలయం, ద్వారపాలకులు గరుడాళ్వారు, ఆళ్వార్లు, ధ్వజస్తంభం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఆలయం, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయాలలో జీర్ణోద్ధరణ (ఆధునీకరణ పనులు) ఈ నెల 6వ తేదీ నుండి చేెపట్టిన విషయం విధితమే.

ఇందులో భాగంగా సెప్టెంబరు 2వ తేదీ ఉదయం 8.30 నుండి 11.00 గంటల వరకు పంచగవ్యప్రాశన, అకల్మషహోమం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు అగ్నిప్రణయనం, కళాపకర్షణము, శ్రీవారి పరివార దేవతలు యాగశాలకు వేంచేపు చేస్తారు. సెప్టెంబరు 3న ఉదయం 8.00 నుండి 11.30 గంటల వరకు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనము, అష్టబంధనము, సాయంత్రం 5.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

సెప్టెంబరు 4న ఉదయం 8.00 నుండి 11.30 గంటల వరకు క్షీరాధివాసం, జలాధివాసం, వివిధ హోమాలు, సెప్టెంబరు 5న ఉదయం వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు సర్వదేవతాహ్వానం, శయనాధివాసము జరుగనుంది. సెప్టెంబరు 6న ఉదయం 7.00 గంటలకు మహాపూర్ణాహుతి, మహాసంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.

అనంతరం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Write Your Comment