బొడ్డెమ్మ పండగ ప్రాదాన్యత

బొడ్డెమ్మ పండగ అంటే ఏంటి వాటి ప్రాదాన్యత ఏంటి?
తెలంగాణకే పరిమితమైన రెండు పండుగలు ‘బతుకమ్మ’, ‘బొడ్డెమ్మ’. ఈ రెండింటిలో బతుకమ్మ పెద్దల పండుగైతే, బొడ్డెమ్మ పిల్లల పండుగ. బతుకమ్మపండుగకు సరిగ్గా తొమ్మిది రోజుల ముందు అంటే భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ) ముందు ప్రారంబమై ఈ తొమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజించి, ఆడి పాడి తొమ్మిదవ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తరు. మహాలయ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు బతుకమ్మను జరుపుకుంటరు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో బొడ్డెమ్మను నాలుగు రకాలుగా తయారుచేస్తరు.
‘బొడ్డెమ్మ’ అనే పేరుకు ‘బొట్టె’, బొడిప’, పొట్టి అనే పర్యాయ పదాలు ఉన్నాయి. ‘బొడ్డ’ అనే పదానికి ‘అత్తిచెట్టు’ అనే మరో అర్థం కూడా ఉంది. దీన్నే మేడిచెట్టు, ఉదంబర చెట్టు అనీ పిలుస్తారు. సాధారణంగా సంతానం కల్గాలని, వివాహం కుదరాలని ఉదంబరాన్ని పూజిస్తుంటారు. ఆపరంగా ప్రకృతిని కూర్చి ఈ ఉదంబర/మేడి పూజనే ‘బొడ్డపూజ’ గా మారి ప్రచారం పొందిందని అనుకోవచ్చు.
బొడ్డెమ్మ ఆటపాటలను ‘గర్భో’ నృత్యంతో పోల్చవచ్చు. ‘గర్భో’ అంటే ‘గొబ్బి’ అని ఒక అభివూపాయం. గొబ్బిరీతిలో బొడ్డెమ్మ కూడా కన్నెపిల్లలు, పిల్లలతో పూజలందుకుంటుంది. అంతేకాదు, గిరిజనులు నిర్వహించే పండగలలో ‘కన్నెపిల్లలు, బాలికలు ఎంతో సంబురంగా తమ పెళ్లి ఘనంగా, మంచిగా జరగాలని కొలిచే పండగ ‘థీజ్ పండగ’. ఈ పండగను కూడా 9 రోజులు (ఇంచుమించు) కన్నెలు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు సాయంకాలం ఆడి పాడుతుంటారు. థీజ్ పండగకు బొడ్డెమ్మ, బతుకమ్మ పండగలకు కూడా పోలిక ఉందని చెప్పవచ్చు.

బొడ్డెమ్మను తయారు చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా చెప్పుకుంటారు.
అవి

1. పీట బొడ్డెమ్మ

2. గుంట బొడ్డెమ్మ

3. పందిరి బొడ్డెమ్మ

4. బాయ బొడ్డెమ్మ

చెక్కపీటపై పుట్టమన్నును ఐదు దొంతర్లుగా వేస్తూ పైన కలశాన్ని పెట్టడం ‘పీట బొడ్డెమ్మ’ ప్రత్యేకత.
పందిరి బొడ్డెమ్మ
పుట్టమన్నుతో బొడ్డెమ్మను చేస్తరు. ఇంటి ముందు చిన్న పందిరి వేసి దాన్ని సీతాఫలం ఆకులతో కప్పుతరు. ఆ పందిరి క్రింద పేడతో అలికి ముగ్గులు వేస్తరు. పందిరి మధ్య నుండి ఒక సీతాఫలాన్ని, ఒక మొక్కజొన్న కంకిని దారాలతో కట్టి కిందికి వేలాడదీస్తరు. వాటి కింద ముగ్గుల మధ్య బొడ్డెమ్మను అలంకరించి పెడతరు. కొన్ని పూలు చల్లి పసుపు గౌరమ్మను బొడ్డెమ్మ పక్కన అమర్చుతరు. ఆ విధంగా పందిరి కింద నిల్పడం వల్ల దీన్ని ‘పందిరి బొడ్డెమ్మ’ అని పిలుస్తరు. ఈ పందిరి బొడ్డెమ్మను పూజించి, ఆడి పాడి తొమ్మిదవ రోజున నిమజ్జనం చేస్తరు.
బాయి బొడ్డెమ్మ
బావిలాగా గొయ్యి తయారు చేసే బొడ్డెమ్మను ‘బాయి బొడ్డెమ్మ’ అని అంటరు. బావిలాగా ఒక చిన్న గొయ్యిని తవ్వి మట్టిని తీసి, అదే మట్టితో ముద్దలు చేస్తరు. నాలుగు ముద్దల చొప్పున బావికి నాలుగు వైపుల పెడతరు. ఆ బావి మధ్య ఒక వెంపలి చెట్టు నాటుతరు. చుట్టూ ఉన్న గద్దెలపై పువ్వులు వేసి పూజిస్తరు. చివరిరోజు ఈ పూలన్నింటినీ నీటిలో నిమజ్జనం చేస్తరు.
పీట బొడ్డెమ్మ
పీట బొడ్డెమ్మను చెక్కపీటపై పుట్టమన్నుతో చేస్తరు. పుట్టమన్నుతో ఐదు దొంతరులుగా గుండ్రంగా ఒకదానిపై ఒకటి వేస్తరు. దొంతర్లలో అడుగున ఉన్నది పెద్దదిగా, మిగిలినవి చిన్నవిగా వరుసక్షికమంలో ఉంటయి. దీని చుట్టూ మళ్ళీ ఐదు పెడుతరు. గిన్నెలో బియ్యం పోసి పసుపు ముద్ద గౌరమ్మను అందులో పెట్టి పసుపు కుంకుమ అలంకరిస్తరు. ఆ గిన్నెను బొడ్డెమ్మ శిఖరభాగాన ఉంచుతరు. ఈ విధంగా చేసిన బొడ్డెమ్మ చుట్టు తిరుగుతూ సాయంకాలం వేళ ఆట ఆడి దేవుని ముందు పెడతారు. చివరిరోజు పీట మీద నుండి బొడ్డెమ్మను తొలగించి నీటిలో నిమజ్జనం చేస్తరు.
గుంట బొడ్డెమ్మ
గుంటల రూపంలో ఉండే బొడ్డెమ్మను ‘గుంట బొడ్డెమ్మ’ అంటరు. మనిషి అడుగు పడని చోట ఒక గుంటను తవ్వి, దాని చుట్టూరా ఐదు చిన్న గుంతలను తవ్వుతరు. ఈ గుంతలన్నింటినీ పూలతో అలంకరిస్తరు. ప్రతి మధ్య గుంటలోని పూలను తీయకుండా చిన్న గుంటల్లోని పూలను మాత్రం తీసి ఒక పాత్రలో పెట్టి నీటిలో వేస్తరు. దీనినే ‘అంపుట’ అంటరు.

బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో
నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో నిచ్చమల్లె చెట్టెసె ఉయ్యాలో
చెట్టుకు చెంబెడు ఉయ్యాలో నీళ్లయినా పోసె ఉయ్యాలో
కాయలు పిందెలు ఉయ్యాలో గనమై ఎగిసె ఉయ్యాలో
-బొడ్డెమ్మ బిడ్డ నీలగౌరు మల్లె చెట్టును నాటిందట. దానికి కాయలు పిందెలు కాసాయట. ఈ పాటను ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రీతుల్లో పాడుతుంటారు. శివుని భార్యయైన గౌరమ్మను తమ ఆడ బిడ్డగా భావిస్తూ, ఆమె శివుని సన్నిధికి చేరినట్లుగా పాడుకుంటారు. తమకు వివాహం కావాలని గౌరిని ప్రార్థించినట్లు.

Write Your Comment