Vijayawada Temple Sthala Puranam (Telugu)

Vijayawada Temple Sthala Puranam in Telugu, story of Vijayawada Kanakadurga Temple in Telugu..

విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలశిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి, పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో (గుహలో) నివశించమని అపార తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ దుర్గ కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభువుగా వెలసింది. స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి, శ్రీ కృష్ణ రూపిణి అయిన కృష్ణవేణీ నదిలో స్నానమాడి కనక దుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గ కీలాద్రిన నిలచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయంభువుడుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లికా కదంబ పుష్ఫాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు.

అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయడైనాడు. కనుక ఈ క్షేత్రానికి ఫల్గున క్షేత్రమని, విజయపురి అనే పేర్లు పురాణ ప్రసిద్ధాలైనాయి. దుర్గాదేవి శుంభ నిశుంభులను వధించి జయం పొందటం చేత జయవాడ అని పేరున్నదని ఒక ఇతిహాసమున్నది. ఆ కాలములోనే కనకవాడ అని కూడా పిలువబడేదని కూడా కొన్నిచోట్ల చెప్పబడినది.
పూర్వమెన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి హరీ! కలియుగమ్లో జనులు అనేక పాప చింతనలతో ధర్మమార్గం తప్పి చరిస్తారు. కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పుమని కోరాడు. బ్రహ్మ మాటను మన్నించి హరి తన అంశతో కృష్ణను సృజించాడు. ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురిగా ఇమ్మని అడిగాడు. కృష్ణను విష్ణువు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువ బడుతున్నది.

కొంతకాలనికి కలియుగం పాప భూయిష్టం కాగా ఆ పాప పరిహారార్ధం విష్ణువు మరల కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు. విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ వుంచాలని ఇంద్రాది దేవతలను హారి అడిగాడు. అప్పుడు వారు భూమినంతా పరిశీలించాడు. అప్పుడు శ్రీహరిని కోరి ఒకచోట పర్వత రూపంలో ఘోర తపస్సు చేస్తున్న సహ్యమునిని చూపించారు. దేవతలు వెంటనే సహ్యముని వద్దకు వెళ్ళి సహ్యమునీ నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విఘ్ణవే భూమిని ఉద్భవించటానికి విఘ్ణరూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు. కృష్ణ సకలాభీష్ట ప్రదాయిని అని చెప్పారు. పరమానందభరితుడైన సహ్యముని విఘ్ణవును విఘ్ణ స్వరూపిణి అయిన కృష్ణను షోఢశోపచారాలతో పూజించాడు. దేవతలారా! నేను శ్రీ మహా విఘ్ణవు కోరి తపస్సు చేస్తున్నాను. మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతోపాటుగా విష్ణువును ఇక్కడకు తీసుకొని వచ్చారు. నా జన్మతరించింది. నేను కృష్ణా నదీమ తల్లిని సేవించి నిశ్చల భక్తిని జ్జానాలను పొందుతాను. హే విష్ణూ! కృష్ణతో కూడి దయతో నా మీద నిలచి నన్ను కృతార్ధుడిని చేయమని వేడుకున్నాడు. అతని ఆత్మ నివేదనను కృష్ణ అనుగ్రహించింది. సహ్యమునీంద్రా నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివశిస్తాను. నీ తపస్సు ఫలించి లోకోపకారం అయింది. నీ ఉపకారం వల్ల లోకాలు పునీతం అవుతాయని పరమిచ్చింది. విష్ణువు కూడా సంప్రీతుడై పర్వత రూపంలో వున్న నీమీద (సహ్యాద్రి మీద) నిత్య నివాసం ఏర్పరచుకుంటానని ఇద్దరూ ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు. సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్ఫాలతోనూ అర్చించాడు.

శ్రీ మహ విష్ణువు శ్వేతాశ్వత్ధ వృక్షంగా (తెల్ల రావి చెట్టుగా) సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు. ఆ రావిచెట్టు అంతర్భాగాన రెండు వైపుల ధవళాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది. పడమటి కనుమలలో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మ గిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావిచెట్టు రూపంలో ప్రత్యక్షం అయినాడు. తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల(ఉసిరి) చెట్టుగా ప్రత్యక్షం అయినాడు. శ్వేతాశ్వత్థ వృక్షం (నారాయణుడు) కృష్ణ గానూ ఆమలక వృక్షం (ఈశ్వరుడు) వేణి గానూ ఒకదానితో ఒకటి కలసి కృష్ణవేణి నదిగా ప్రభవించినట్లు విఘ్ణ పురాణంలో చెప్పబడినది. ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకూ గంగతో సమానమనీ, భగవత్ నిలయమైన శస్య శ్యామల క్షేత్రమని, ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలమనీ ప్రసిద్ధి చెందినది. అటువంటి క్షేత్రాలలో విజయవాడ ఎన్నదగినది.

సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఓషధాలను బీజాలను తన ప్రవాహములో తరలించుకొని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశము సస్యశ్యామలమైనది. సాగర సంగమాభిలాషతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణీ నది తనకు దారి ఇమ్మని కీలుని కోరినది. కీలుడు అంగీకరించలేదు. దేవతలు వచ్చి కీలునికి నచ్చ చెప్పగా సొరంగ మార్గం మాత్రం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క విరిగి ప్రవాహా వేగములో రెండు క్రోసుల దూరము కొట్టుకుపోయి నిలచినది. ఈ రెండు క్రోసులదూరమును ఫల్గున తీర్ధమనీ, ఆ కొండ ముక్కకు తేలుకొండ (తేలిన కొండ) అని పేర్లు అని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది. అది యనమలకుదురు అని విజయవాడకు ప్రక్క గ్రామము ఈ ఇంద్రకీలాద్రి పర్వతము మంగళాచలము (మంగళగిరి) వరకు వ్యాపించివున్నది.

దుర్గా దేవి కుడికన్ను సూర్యుడు. ఎడమ కన్ను చంద్రుడు. కనకవర్ణంతో ప్రకాశించే పొలము రాత్రింబవళ్ళకు నడిమీ సంధ్య. దుర్గాదేవి తన చూపులతో శత్రువులను క్షోభ పెట్టిన చోట్లన్నిటికీ ఒక్కొక్క దృష్టి. ఆయా నామాలతో నేటికి ప్రసిద్ధాలై ఉన్నవి. కార్వేటి వంశ పల్లవ కేతు భూపాల శాసనానుసారము దుర్గా మల్లేశ్వరుల మహాత్యము, అనుగ్రహము మనకు తెలుస్తున్నవి. విజయవాడ మాధవ శర్మ పాలనలో వున్నప్పటి ఒక ఉదంతం కనకదుర్గా మల్లేశ్వరుల అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడినది. మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెళ్ళుచుండగా ఆ రథము క్రింద చింత చిగురు అమ్ముకునే ఒక అభాగ్యురాలి కొడుకు పడి మరణించాడట. ధర్మ సంరక్షణా నిరతుడైన మాధవ వర్మ తన కుమారుని హత్యా నేరస్తునిగా ఉరిశిక్ష విధించినాడట. మాధవ శర్మ ధర్మ దీక్షకు కనకదుర్గా మల్లేశ్వరులు సంతసించి ఆ మరణించిన బాలురిద్దరి మీద కనక వర్షము కురిపించి ప్రాణదాన మొనరించగా కనకదుర్గా పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడించినది. అప్పుడు విజయవాడ వేంగ రాజుల పాలనలో ఉన్నది.

కనకదుర్గా మల్లేశ్వరుల పరభక్త శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీ పతి పండితయ్య. ఆయన తాను కాంశీపుర వాసిననీ అయిననూ విజయవాడ మల్లిఖార్జున పాదపద్మారాధకుడననీ చెప్పుకున్నావాడు. శివ తత్వసారమనే మహా గ్రంధకర్త. శివుడు గాక వేరు దైవము లేడను పరమ భక్తుడు. అందుచేత ఊరి ప్రజలు అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు. యజ్ఞయాగాది క్రతువులకు పిలవటం మానివేశారు. ఆయనకు ఊరిలో నిప్పు కూడా పుట్టకుండా కట్టడి చేశారు.

అయినా శ్రీపతి పండితయ్య ఏ మాత్రమూ చింతించలేదు. తన ముక్కంటి దొరను ( త్రినేత్రుడైన శివుని) ప్రార్థించి అగ్నిని తన ఉత్తరీయములో మూటకట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వ్రేలాడ కట్టి, నగరంలో అగ్నిహోత్రుడు వెలగరాదని శపించాడు. తాను మాత్రము నియమము తప్పక అగ్నికార్యమును కొనసాగించుకొంటూనే ఉన్నాడు. ఆ కాలంలో వేంగీ రాజు అనంతపాలుని పాలనలో ఉన్నది నగరం. అంతట ప్రజలు అందరూ ప్రభువును ముందుంచుకొని శ్రీపతి పండితయ్యను అగ్నికి విడువుమని ప్రార్థించాడు. పండితయ్య అనుగ్రహించాడు. ఈ నాటికీ జమ్మిదొడ్డిగా పిలువబడుతున్న ప్రాంతమే ఆ నాడు పండితయ్య నిప్పును వ్రేలాడదీసిన శమీ వృక్షమున్న చోటు ఈ శాసనము కూడా అక్కడే లభించినది.

వేప చెట్టు మహాలక్ష్మీ. రావి చెట్టు విఘ్ణవు. శమీ వృక్షం (జమ్మిచెట్టు) శివ శకైక్య స్వరూపం. ఆ శమీ వృక్షం ఆదిపారాశక్తి అంశ వనదుర్గ. ఆమే రూపుదాల్చిన కుండలీని శక్తి. వివిధ శాఖావృతమైన శమీవృక్ష శిరోభాగమే భయంకర భుజంగ (సర్ప)రూపము. అనంతంగా విస్తరించిన వృక్షాగ్రం పగటిని సైతం రాత్రిగా చేయగల కాల స్వరూపం. శమీ వృక్షం వనదేవత. శుభకర తరువు. సంతాన ప్రదాయిని. సర్వశత్రు వినాశిని.

పుత్రదం సర్వ పాపఘ్నం సర్వ శత్రు వినాశకం అని శమీ వృక్షం చెప్పబడినది. బ్రహ్మ విఘ్ణవు మొదలైన దేవతల చేత ఆవరించబడి, ఢాకినీ మొదలైన భూత గణాలచే రక్షించబడుతూ ఉంటుంది. వనదుర్గ స్థలదుర్గ జలదుర్గ అని దేవికి పేర్లు. అన్నింటిలోకి వనదుర్గ సుఖప్రద. వనదుర్గా రూపంలో ప్రభవించి ప్రకాశించే శమీవృక్షం అనేక దేవతా నిలయం మహా మాయా సంపద కలది. అందుకే పాండవాగ్రజుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను శమీ వృక్షం మీద దాచిపెట్టి వనదేవతారూపిణి అయిన వనదుర్గనిలా ప్రార్థించాడు. విషస్ఫురిత భుజంగ భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను కనుపింప చేయమని కోరాడు.

చిత్త క్షోభం కలిగించే దీని ఆకృతి దేవీ స్వరూప స్వభావాలకు ప్రతీక. సమస్త ప్రాణులలోనూ వ్యాపించి చిత్త వికారాలను కలిగించే భ్రమరాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైలపీఠశక్తి. శాకినీ, ఢాకినీ మొదలైన యోగినీ గణాలతో ఆవృతమై అరణ్య మధ్యంలో నెలకొన్న వనదుర్గా రూపమీ శమీ తరువు. కనుకనే ధర్మరాజు అజ్ఞాత వాసంలో భీముని ఆ గ్రహ ప్రవృత్తిని నిగ్రహించుకొనే విధంగా శాశించు తల్లీ అని వన దేవతా రూపిణి అయిన శమీ వృక్షాన్ని ప్రార్థించి తగిన నివేదనలు సమర్పించాడు. శత్రువులు ఎవరూ ఆ శమీ వృక్షాన్ని దాటి రాకుండా చూడుమని అర్థించాడు. శమీ వృక్షం శివ శకైక స్వరూపం కనుకనే మహా దేవ శక్తి పాశు పతాస్త్రాన్ని ధరించి భరించింది.

నాటికీ, నేటికీ శమీ పూజ పార్వేట వాడ వాడలా నవరాత్ర ఉత్సవాల ముగింపుగా జరుగుతూనే వున్నది. ఎందుకనగా గ్రామ దేవతా మూర్తులు లేని మరుమూల గ్రామాలలో కూడా రావి, వేప, శమీ వంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతాయి అనే ప్రగాఢ విశ్వాసమే యుగయుగాలుగా చాటిన సత్యం.

దేవీ దుర్గ మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మా నీవు లోకాలను రక్షించే తల్లివి. ఇంతటి మహోగ్రరూపం మహిషాసురుని వంటి రాక్షస వధకే గాని మేమెట్లు భరించగలం? మూల ప్రకృతినైన నిన్నెట్లు సమీపించగలం? తల్లీ నీవు శాంతి రూపిణివై లోకాలను కపాడుమని వేడుకున్నారు. ఆ తల్లి కరుణారస సంపూర్ణ అయిన రాజ రాజేశ్వరిగా అవతరించింది. కాలాంతములో జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు మహోగ్ర శక్తులను శ్రీ చక్రము నందు నిక్షిప్తం చేసి, శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీ చక్రరాజమును స్థాపన చేయటమైనది.

ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు దుర్గోత్సవం అను పేరుతో దేవీ శరన్నవరాత్రోత్సవములను, సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాఢ్యమినుండి నవమి వరకు వసంత నవరాత్రోత్సవములను పేరుతో నన్ను ఆరాధించినా నా చరిత్రను వినినా ఇహలోకాన ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో, పుత్ర పౌత్రాభి వృద్ధితో సమస్త సుఖశాంతులు పొందగలరని వరమిచ్చింది.

నాటి నుండి దుర్గమ్మ రాజరాజేశ్వరిగా లోకాలను పాలిస్తూ, బాలా త్రిపురసుందరిగా కోరికలీడేరుస్తూ, అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ, లలితగా లాలిస్తూ, సరస్వతిగా సకల విద్యలూ ప్రసాదిస్తూ అనేక అంశలతో అర్భామూర్తిగా ఆరాధించబడుతూ వున్నది. ‘ద’ కారం దైత్యనాశకం. ‘ఉ’ కారం విఘ్న నాశకం. ‘ర్’ కారం రోగ నాశకం. ‘గ’ కారం పాప నాశకం. ఆ భయనాశక వాచకం. కనుకనే అమ్మవారికి పర్యయపదమైన దుర్గా నామమును ఉచ్చరించినా, స్మరించినా పాపాలూ నశిస్తాయని సాక్షాత్తూ పరమ శివుడు చెప్పిన మాట అని సకల లోక పితామహుడు సృష్టి కర్త అయిన బ్రహ్మ మార్కెండేయ మహర్షికి చెప్పిన ప్రమణమున్నది.

ఈ విధంగా మహిషాసుర మర్థినీ బ్రహ్మ తేజస్విని శుద్ధ స్పటిక రూపిణి అయిన కనకదుర్గ కృష్ణా తీరాన వెలసి తూర్పున ఐంద్రి, పడమర వారుణి, ఉత్తరాన కౌమారి, దక్షిణ దిక్కున శ్రేష్ఠ ధర్మ దేవతా స్వరూపిణి అయిన హంసవాహినిగా లోకాలను కాపాడుతూ ఉన్నది. కొలచిన వారికి కొంగు బంగారము, సర్వర్థ ధాత్రి, మూల ప్రకృతి, సౌకుమార్య సౌందర్యలహరి, మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్ట మహిషి అయిన చల్లని తల్లి అయిన దుర్గమ్మ. దూర దూరాల నుండి వచ్చే నీ బిడ్డలు అయిన భక్తుల మీద కరుణాంతరంగవై సుభశాంతులను వర్షించుచూ, జ్ఞానా సిద్ధిని ప్రసాదించుమని నిత్యము సేవించుకుందాము.

“ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే”

Write Your Comment