Telugu – Karyasiddhi Hanuman Mahatmyam

Here is Karyasiddhi Hanuman Mahatmyam in Telugu.

కార్యసిద్ధి హనుమంతుడు…

శ్రీమద్రామాయణంలో సుందరకాండ ఐదవది. సుందరకాండము పారాయణము చేసినవారికి అనుకొన్న పనులు నెరవేరి కార్యసిద్ధి కలుగుతుంది.

సుందరకాండంలో హనుమంతుడు శతయోజన విస్తీర్ణం గల సముద్రమును ఆధారంలేని ఆకాశమార్గంలో పయనించి, ఆటంకాలను ఎదుర్కొని లంకాపట్టణములో ఒంటరిగా ప్రవేశించాడు. లంకలో అన్నిచోట్ల సీతను అన్వేషించి, అశోకవానములో శింశుపావృక్షమూలమున దీనస్థితిలో ఉన్న సీతను కనుకొన్నాడు.

తల బలప్రాక్రమములను శత్రువులకు తెలియజేయుటకు వనములను, ఉద్యానవనములను, ప్రాసాదములను ధ్వంసం చేసాడు. అక్షకుమారుడులాంటి రాక్షస వీరులను ఎందరినో సంహరించాడు.

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమునకు కట్టుబడి రావణ సభకు వెళ్లాడు. రావణునికి హితము పలికాడు. రాక్షసులు తన తోకకు నిప్పు పెట్టగా ఆ మంటలతో లంకానగరాన్ని దహనం చేసాడు.

స్వామికార్యము, స్వకార్యము నెరవేర్చి కార్యమును సానుకూలము చేసుకొని, తిరిగి సముద్రాన్ని లంఘించి వానరులను కలుసకుకొని సీతావృత్తాంతం చెలియజేసాడు.

హనుమంతుడు తనకు అప్పగించిన పనిని విజయవంతంగా నెరవేర్చుటకు అతడు పడిన శ్రమ, శక్తియుక్తులు కార్యసాధకుడు ఎట్లు ఉండవలెనని సుందరకాండ వలన తెలుస్తున్నది.

కార్యము అనగా మంచిపని. ఒక కార్యము చేయునప్పుడు మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి. వాటిని ఓర్పుతోను, నేర్పుతోను, శక్తియుక్తులతోను అధిగమించాలి.

హనుమంతుడు సీతాన్వేషణముకై సముద్రమును వాయు మార్గంలో లఘించుచుండగా మొదట మైనాకుడు సముద్రములోనుంచి పైకి వచ్చి తనపై కొంతసేపు విశ్రాంతి తీసుకొని పొమ్మన్నాడు. తన ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థించాడు.

మైనాకుడు సత్యగున ఆటంకము. కావున కార్య సాధకుడు మధ్యలో ఆగరాదు. రాముని కార్యము నెరవేర్చుటకు వెళుతున్నానని మైనాకుని మృదువుగా స్పృశించి, ప్రియవచనములతో స్వస్థత పరచి ఓర్పుగాను, నేర్పుతోను ఆటంకమును అధికమించి ముందుకు సాగాడు.

కొంతదూరము పోయిన తరువాత, దేవతలు పంపగా వచ్చిన సురస అను నాగాస్త్రీ హనుమంతుని అడ్డం నిలిచింది. హనుమంతుడు ముక్తిక్తితో, ఉపాయముతోను ఆమె నోటి యందు ప్రవేశించి బయటకు వచ్చెను. ఇది రజోగుణ సంబంధిత ఆటంకము. దీనిని ముక్తితో దాటెను.

మరికొంత దూరం ప్రయాణించగా ఛాయా గ్రాహియైన సింహిక అను రాక్షసస్త్రీ హనుమంతుని ఛాయను పట్టుకొని క్రిందికి లాగినది. ఇది తమోగుణ ఆటంకము. హనుమంతుడు సూక్షరూపం ధరించి, సింహికనోటిలో ప్రవేశించి ఆమె అవయవములను తన గోళ్ళతో పెకిలించి హతమార్చాడు.

కార్యసాధకుడు తనకు ఎదురైన సత్త్య, రజస్తమో ఆటంకములను ఓర్పు, నేర్పు, ముక్తి, శక్తిని ఉపయోగించి అధికమించెను.

లంకాపట్టణం చేరిన హనుమంతుడు తన స్వరూపమును చిన్నది చేసికొని సంచరించెను. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించాడు. సురస, సింహికలను అధిగమించునపుడు, లంకాపట్టణంలో సీతాన్వేషణ చేయునపుడు సూక్ష్మరూపాన్ని ధరించాడు. సముద్రము లంఘించునపుడో, అశోకవనమును ధ్వంసము చేయునపుడు, రాక్షసులతో యుద్ధము చేయునపుడు, లంకా దహనము చేయునపుడు శరీరాన్ని పెంచాడు. పరిస్థితులబట్టి ప్రవర్తించాడు.

కార్యము నేరవేరాలనేదే దేశకాల పరిస్థితులను బట్టి కార్యసాధకుడు ప్రవర్తించాలి.

“తతః శరీరం సంక్షిప్య” (సుం. 1-205)

రావణుని అంతః పురంలో వివిధ భంగిమలతో అర్థనగ్నముగాను, నగ్నముగాను ఉన్న సౌందర్యవంతులైన స్త్రీలను చూచాడు. ఎన్నోరకములైన సువాసనలతో కూడిన ఆహార పదార్థములు పరికించాడు. కాని, హనుమంతుని మనస్సు చలింపలేదు. సీతను గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన అతని మనస్సులో లేదు. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము కలిగిన జితేంద్రియుడు హనుమంతుడు.

కార్యసాధకుని మనస్సు వికారములకు లోనుకారాడు. మనోవికారము లేనప్పుడు, ఏది చూచినను దోషములేదు. ఆ కార్యసాధకుని కార్యం మీదనే దృష్టి ఉంటుంది.

శ్లో||మనోహిహేతుః సర్వేషామిన్ద్రి యాణాం ప్రవర్తెతే
శుభాశుభస్వవ్స్థాసు తచ్చమే సువ్యవస్థంమ్ (సుం. 11-41)

ప్రలోభములకు లొంగరాదు, విషయము లందు చలింపకూడదు.

హనుమంతుడు లంకలో అన్ని ప్రదేశములను సీతకై వెదకి ఆమె కనుపించక పోవుటచే దిగులు చెంది నిరుత్సాహ పడెను. తన శ్రమ వృథా అయినదని దైన్యము నొందెను.

కార్యసాధకునికి దైన్యము పనికిరాదు. నిరుత్సాహము చెందినను, దిగులు చెందినను కార్యము సిద్ధింపదు. కార్యనిర్వాహణకు దిగులు వదలి ధైర్యము వహించాలి. సర్వకార్యములు ఆ నిర్వేదము వలననే సానుకూలమగును.

శ్లో|| అనిర్వేదః శ్రియోమూలమనిర్వేదః పరంసుఖమ్
అనిర్వేదోహిసతతం సర్వార్దేషు ప్రవర్తకః (సుం. 12-10)

శక్తివంతుడైన హనుమంతుడు వెంటనే దైన్యమును విడచి, ధైర్యము తెచ్చుకొని సీత కనిపించునంతవరకు వెదకెదనని ధృడచిత్తుడయ్యెను. మనస్సును దిటవు చేసుకొన్నాడు. బ్రతికి ఉంటేనే ఏదైనా సాధించేది. చచ్చి సాధించేది ఏమున్నది? బ్రతికి ఉంటే సీతమ్మను కనుగొని రామయ్యకు చెప్పవచ్చు. మంచి కార్యములు చేయ వచ్చునని విరక్తిని వదలి సీతాన్వేషణకు ఉపక్రమించాడు.

శ్లో|| వినాశే బహావోదోషా జీవన్ భద్రాణిపశ్యంతి
తస్మాత్ర్వాణాన్ ధరిష్వామి ధ్రువో జీవిత సంగమః (సుం. 13-47)

ఇంతవరకు హనుమంతుడు తన శక్తియుక్తులను ఉపయోగించాడు. పురుషప్రయత్నం ఎంతచేసినా కార్యసాధకుడు దైవసహాయం కూడా కోరాలి. పురుష ప్రయత్నము, దైవానుకూలత ఉన్నప్పుడే కార్యసిద్ధి కలుగుతుంది.

శ్లో|| కచ్చి త్పురుష కారంచదైవంచ ప్రతిపద్యతే (సుం. 36-19)

సీత కనబడునట్లు అనుగ్రహించుమని, హనుమంతుడికిఉ వసు, రుద్ర, ఆదిత్య, అశ్వనీదేవతలను ప్రార్థించాడు. లక్ష్మణ సహితుడైన రాముని, జనకాత్మజ సీతను, యమ, వాయువులను కార్యసిద్ధికోరకు స్మరించి అశోకవనములోనికి ప్రవేశించి దీనముగా ఉన్న సీతాన్వేషణఉ శింశుపావృక్షము మూలమున కూర్చొనియుండుట చూచినాడు. హనుమంతుని ప్రయత్నం, దైవానుకూలత వలెనే తను కనుగొనగలిగినాడు. అంతా దైవ నిర్ణయం వలన జరుగుతుంది.

శ్లో|| వసూన్ రుద్రాం స్తథాదిత్య నశ్వినౌ మరుతోపిచ
నమస్కృత్యా గమిష్యామి రక్షసాం శోకవర్ధన (సు. 13-56)

శ్లో|| నమోస్తు రామాయ స లక్ష్మణామ
దేవ్వైచ తస్త్య జనకాత్మజాయ
నమోస్తు రుద్రేంద్ర యమానితేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః (13-59)

సీతను చూచినా హనుమంతునికి ఈమె సీతయేనా? అను సందేహము వచ్చెను. పండితుడు కావున యుక్తి యుక్తములైన హేతువులతో ఆమె సీతయే అని నిర్థారణ చేసికొనెను. రావణుడు సీతను అపహరించి లంకకు తీసికొని వస్తున్నపుడు సీత కొన్ని ఆభరణములను తన చీరను చింపి ఆ ఉత్తరీయములో మూటగట్టి ఋష్యమూక పర్వతముపై ఉన్న వానరుల మధ్య జారవిదచినది. ఆమె వదలిన ఆభరణములు ఇప్పుడు ఆమె శరీరముపై లేవు.

రాముడు సీతవద్ద ఏ ఆభరణములు ఉన్నాయని చెప్పెనో అవన్నియు సీత శరీరముపై ఉన్నవి.

నగలను మూటగట్టి ఋష్యమూకముపై విడచినది. ఆ ఉత్తరీయము రంగు ఇప్పుడు ఈమె ధరించిన చీర రంగు ఒకటిగానే ఉన్నవి.

ఈమె రూపము రాముని రూపమునకు తగినట్లు ఉన్నది.

రావణుడు ప్రాతఃకాలమున సీతతో మాట్లాడిన విధానము గమనించిన హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ణయించుకొనెను.

కార్యసాధకుడు యుక్తాయుక్తముగా, హేతుబద్ధముగా విచారించి తన కార్యము సానుకూలమయ్యేట్లు చూసుకోవాలి. కార్యసాధనకు కోపము, అహంకారము, దురభిమానము పనికి రాదు. ఇవి కలిగియున్నవారి కార్యము నెరవేరదు. తనకేమి తెలియకున్నను తెలిసిన వానివలె నటిస్తే కార్యము చెడుతుంది.

శ్లో|| ఘాత యంతి హి కార్యాణి దూతాః పండితమానినః (సుం. 30-38)

వివేకము కలిగి ఉండాలి. ఓర్పు ఉండాలి. కోపము పనికిరాదు. కోపచేసెదరు. ము వలన విచక్షణా జ్ఞానము కోల్పోయి చేయరాని పనులు చేసెదరు. తన కోపము వానన తనకే కాక తన ఆప్తులకు కూడా ఆపద సంభవిస్తుంది.

శ్లో|| వాచ్యావాచ్యం ప్రకుపితోనవిజానాతి కర్హిచిత్
నాకార్యమస్తి క్రుద్దస్య నావాచ్యం విద్యతే కృచిత్ (సుం.55-6)

రావణుని ఆజ్ఞానుసారము రాక్షస భటులు హనుమంతుని తోకకు నిప్పు అంటించారు. రావణుని మీద కోపముతో హనుమంతుడు లంకాపట్టణము దహనం చేశాడు. కోపంలో సీత లంకలో ఉన్నదన్న విషయాన్ని మరిచాడు. లంకా దహనమైన తరువాత సీత కూడా మంటలలో తగులబడినదేమో అని విచారిస్తాడు. ఆకాశ మార్గంలో సంచరిస్తున్న చారిణుల వలన సీత క్షేమంగా ఉందని తెలిసికొని సంతోషిస్తాడు. కార్య సాధకునికి నిగ్రహం కావాలి. కోపంతో తొందర పడితే కార్యము చెడిపోతుంది.

సీతాన్వేషణము చేసి తిరిగి సముద్రమును లఘించి వానరశ్రేష్ఠుల వద్దకు వచ్చి తను సీతను ఎలా కనుగొనినది వివరంగా చెప్పాడు. ఇంత కార్యము సాధించిననూ హనుమంతునిలో అహంకారము లేదు. ఈ కార్యము నా వలన జరిగినదని చెప్పలేదు. మీ ఆశీస్సుల వలన రాముని దయ వలన సీతను చూడగలిగినానని పలికాడు.

మహాత్ములు తమ శక్తి సామర్థ్యములతో కార్యము నెరవేర్చిననూ గర్వపడరు. అహంకారపూరితులు గారు. దైవసహాయము వలన జరిగినదని భావిస్తారు.

శ్లో|| రాఘవస్య ప్రభావేన భవ తాం చైవ తేజసా
సుగ్రీవస్యచ కార్యార్థం మయా సర్వమనుష్టితమ్ (సు 58-165)

సుందరకాండములో కార్యసిద్ధికి ఏమీ ఉండాలో, ఎట్లా ఉండాలో హనుమంతుని ద్వారా తెలిసికొని, దానిని ఆచరణలో ఉంచిన కార్యసిద్ధి కలుగుతుంది అనే దానిలో అంతరార్థము ఇదే.

కార్యసాధకునికి ఓర్పు, నేర్పు, శక్తియుక్తులు, ధైర్యము వినయము, వివేకము, యుక్తాయుక్త పరిజ్ఞానము ఉండాలి.

దైన్యము, కోపము, అహంకారము, దురభిమానము, గర్వము పనికిరాదు.

కేవలము మన ప్రయత్నముపైనే ఆధారపడక దైవ సహాయం కూడా అర్థించాలి. పురుష ప్రయత్నం దైవానుకూలత రెండూ ఉన్నప్పుడే కార్యసిద్ధి జరుగుతుంది. ఇది హనుమంతుని ద్వారా సుందరకాండములో చెప్పబడి యున్నది. సుందరకాండము పారాయణ చేసి విషయములను అర్థం చేసుకొని నిజజీవితంలో ఆచరిస్తే కార్యసిద్ధి కలుగుతుంది.

భక్తికి, శక్తికి, యుక్తికి హనుమంతుడే ఆదర్శము. అతని స్మరణవలన అన్నీ కార్యములు నిర్విఘ్నముగా నెరవేరుతాయి.

ఆంజనేయుడు మనం మధ్యనే ఉన్నాడు. ఎందరో భక్తులు ఆయనను పూజించి ఆయన సాక్షాత్కారాన్ని పొందగలిగారు. హనుమంతుడు మహాతత్త్వ పండితుడని ఉపనిషత్తుల సారాంశం. రామ మంత్ర రహస్యాన్ని పురాణకాలపు ఋషులందరు ఆంజనేయుని నుంచే గ్రహించారని తెలుస్తోంది. సమస్త పురాణాలలో ఆంజనేయుని ప్రస్తావన ఉంటుంది. నిరంతర రామనామ స్మరణంతో భక్తిలో మునిగిపోయే హనుమంతుడు తన భక్తులకు ఎటువంటి ఆపదలు కలుగనీయడు. కార్య సాధకుడు కాబట్టి తన భక్తుల కార్యములను నిర్విఘ్నంగా ముందుకు సాగెట్లు చూసుకుంటాడు. ఆంజనేయ భక్తులకు అపజయం అనేది లేదు.

శ్లో|| బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా
అజాడ్యం వాక్పటుత్యంచ హనుమ త్మ్సరణాద్భవేత్

సర్వేజనాః సుఖినో భవంతు

Write Your Comment

1 Comments

  1. K v srinivas says:

    Good simple gas ardhamayyetattu baagundi.