Telugu – Hanamkonda Bhadrakali Temple Mahatmya

Here is the Hanamkonda Bhadrakali Temple Mahatmya in Telugu..

ఈ హనుమకొండ నే కాకతీయుల కాలంలో హనుమద్గిరి అని పిలిచేవారు.వరంగల్లు ప్రజలకు ఇలవేల్పువిరాజిల్లుతూ, పూజలందుకుంటున్నశ్రీ భద్రకాళీ మాత దేవాలయం కాకతీయుల కాలం నాటికే ప్రాభవ వైభవాలను సంతరించుకున్నట్లు చారిత్రక ఆథారాలున్నాయి. ప్రతాపరుద్ర చరిత్ర లోను(1వ పేజి) సిద్ధేశ్వరచరిత్రలోను( 158 వ పేజి ) భధ్రకాళీమాత ప్రస్తావన కనబడుతుంది. సిద్ధేశ్వర చరిత్రలో(24 వ పేజి ) భద్రేశ్వరి అని కూడ ప్రస్తావించబడింది.

హిడింబాశ్రమము( నేటి మెట్టగుట్ట) కు ఈశాన్యభాగం లో హనుమద్గిరి ఉన్నదని, దానికి పూర్వభాగం లో భద్రకాళీ దేవి కొలువు తీరి ఉన్నదని పై గ్రంథాల్లో చెప్పబడింది. ప్రతాపరుద్రచక్రవర్తి దిగ్విజయ యాత్రకు బయలుదేరబోయే ముందు తమకు అభిమాన దేవతయైన దుర్గాదేవిని పూజించి, హనుమద్గిరి వెలుపలనున్న తోటలో సైన్యాన్ని విడిది చేయించి నట్లు ప్రతాపరుద్రీయం లో వ్రాయబడింది. (ఆంధ్ర ప్రతాపరుద్ర యశో భూషణము ,237 వ పేజి )

శ్రీ భద్రకాళీ ఆలయం క్రీ.శ 625 నాటికే ఉన్నట్లు స్థానికులు కొందరు చెపుతారు. పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి వేంగీ చాళుక్యుల పైన విజయం సాథించడానికి ఈ ఆలయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించి, అర్థ సిద్ధి నందినట్లు జనశృతి. దీనికి ఆధారం గా శ్రీ భద్రకాళీ విగ్రహం ఏకాండ శిలమీద చెక్కబడి ఉండటాన్ని కారణం గా చూపిస్తున్నారు.

అయితే కొల్లేటి కోట లోని పెద్దింట్లమ్మ ను, భీమవరం మావుళ్లమ్మ ను చూసిన వారికి ఆ నిర్మాణ పోలికలు శ్రీ భద్రకాళీమాత విగ్రహం లో స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి. రెండు విగ్రహాలు 9X9 ఉంటాయి. రెండు ఏకాండశిలపై చెక్కినవే. అంతే కాకుండా రెండువిగ్రహాలు పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి కాలం నాటివి గానే భావించబడుతున్నాయి. ఇలా చెక్కడం చాళుక్య సంప్రదాయం గా చెప్పబడుతోంది. అంటే శ్రీ భద్రకాళీమాత చాళుక్యల కాలం నుండే పూజలందుకుంటున్నట్లు మనం అంగీకరించవచ్చు. ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్థంభాలు చతురస్రాకారంగా ఉండటం కూడ చాళుక్య నిర్మాణ శైలి గా తద్విజ్ఞులు వ్రాస్తున్నారు.
ఆం.ప్ర. పురాతత్త్వశాఖ వారు ప్రచురించిన వరంగల్లు జిల్లా శాసనాలలో 307 వ పేజి లో శ్రీ భధ్రకాళి గుడి లో అంతరాళ స్థంభాలపై ఉన్న రెండు శాసనాలను ప్రకటించారు.
“మహేశశ్చారు సంధత్తే మార్గణం కనకాచలే
మంత్రి విఠన ఎఱ్ఱస్తు మార్గణే కనకాచలే” !!
కొద్ది తేడాతో మరొక శ్లోకం వేరొకస్థంభం మీద కన్పిస్తోంది. వీటిని సమన్వయించి చూస్తే 10 వ శతాబ్దం నాటికే ఈ ఆలయనిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రతాపరుద్రుని కాలానికే శ్రీభద్రకాళీమాత భక్తులను అనుగ్రహించిన లీలలు కథలు,కథలు గా ప్రచారం లోఉన్నాయి.- అందులో ఒకటి. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు వందమంది విద్వాంసులు తనను అనుసరించు చుండగా అంబారీపై ఊరేగుతూ, ప్రతాప రుద్ర చక్రవర్తి ఆస్థానానికి వచ్చి, అచ్చటి విద్వాంసులను తనతో శాస్త్ర చర్చకు రావలసింది గా ఆహ్వానించాడట. కాని ప్రతాపరుద్రుని ఆస్థాన విద్వాంసులు అతనిని అవమానించి పంపించారట.

అహం దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ విద్వాంసులను ఏదోవిథం గా ఓడించాలనే ఉద్దేశ్యం తో – “ఈ రోజు కృష్ణ చతుర్థశి.రేపు అమావాస్య .మీరు కాదంటారా”?.అని ప్రశ్నించాడట. ఆస్థాన విద్వాంసులు ఇరకాటం లో పడ్డారు. ఔనంటే సుదర్శనమిత్రుని వాదాన్ని అంగీకరించినట్లవుతుంది. కాదంటేనే అతన్ని ఓడించినట్లు అవుతుంది – అని నిర్ణయించి” రేపు పౌర్ణమి “అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సిఉంది. ఈ సంకటస్థితి నుండి తమను కాపాడమని మల్లిఖార్జునభట్టు ఆ రాత్రి భద్రకాళీ ఆలయానికి వెళ్లి ఆ అమ్మను పూజించి, పరిపరి విథాల ప్రార్థించి, పదకొండు శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై” నీమాటలనే నిలుపుతానని” వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండుపున్నమి లాగా వెలుగొందిన చంద్రుని చూచి, సుదర్శనగుప్తుడు విద్వాంసులను క్షమాపణ వేడుకున్నాడట. ఇది నిజంగా దైవీశక్తి గాని,మానుషశక్తి కాదని అంగీకరించి వెళ్లిపోయాడట.

ఈ వృత్తాంతంలో ప్రస్తావించబడిన శాఖవెల్లి మల్లిఖార్జునభట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడు. కాబట్టి ప్రతాపరుద్రుని కాలం నాటికే శ్రీ భద్రకాళీమాత ప్రసిద్ధమై ఉన్నట్లు, భక్తలపాలిట కల్పవల్లియై ఆదుకొంటున్నట్లు మనకు అర్థమౌతోంది.

శ్రీ భద్రకాళీ ఆలయం ఓరుగల్లు నగర ప్రధాన రహదారికి ఒక కిలోమీటరు దూరం లో జలాశయం ప్రక్కన, కొండల నడుమ ప్రశాంతమైన వాతావరణం లో అలరారుతోంది. భధ్రకాళీదేవి విగ్రహం సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు, తొమ్మిది అడుగుల వెడల్పు కలిగి భయద గంభీరం గా భక్తులను కటాక్షిస్తూ, కన్పిస్తుంది.
అమ్మవారు అష్టబాహువులతో,ప్రేతాసీనయై ఉంటుంది. కుడివైపున ఉన్ననాలుగు చేతులలో వరుసగా-ఖడ్గము,ఛురిక, జపమాల,డమరుకమును, ఎడమవైపున ఉన్న నాలుగుచేతులలో –ఘంట, త్రిశూలము, ఛిన్నమస్తకము,(నరికిన తల ) పానపాత్ర ఉన్నాయి.ఈ తల్లి పశ్చిమాభిముఖం గా ఉంటుంది.
ఆలయ ముఖమండపము ఆథునిక నిర్మాణము. దీనిలో ధ్వజస్థంభము, సింహవాహనము,బలిపీఠము, ఉంటాయి. ముఖమండపం లో ఆంజనేయ, సుబ్రమణ్యేశ్వర, నవగ్రహప్రతిష్టలున్నాయి. మహామండంపం లో దక్షిణవైపున భద్రేశ్వర ఆలయ మున్నది.ఇందులో లింగము వెనుక పార్వతీపరమేశ్వరుల ప్రతిమలు ఏకశిలపై చెక్కిఉండటాన్ని మనము గమనించవచ్చు. శ్రీ వల్లభ గణపతి ఆలయాన్ని పతిత్రపరిక్రమ ను నూతనం గా నిర్మించారు.

క్రీ. శ 1323 లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం కొంత,విజయనగర రాజ్య పతనానంతరం పూర్తిగాను, ఈ ఆలయప్రాభవం కోల్పోయినట్లు చరిత్ర చెపుతోంది. క్రీ.శ 1950 లో ఆలయాన్నితిరిగి పునరుద్ధరణ చేయడానికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేశ్ శాస్త్రి, శ్రీ వైష్ణవపండితులు శ్రీమాన్ ముడుంబై రామానుజా చార్యులవారు సంకల్పించి, అందుకు సహకరించవలసిందిగా నగరం లో ప్రముఖవ్యాపారిగా నున్న శ్రీ మగన్ లాల్ సమేజా వద్దకు మరునాడు ఉదయం వెళ్లాలని నిర్ణయించుకున్నారట. కాని అదే రోజు రాత్రి శ్రీ మగన్లాల్ సమేజా గారి కలలో శ్రీ అమ్మవారు కనిపించి,” రేపు నీదగ్గరకు ఇద్దరు వ్యక్తులు వస్తారు. వారితో పాటు నీవు నాఆలయానికివచ్చి నన్ను సేవించు” అని ఆదేశించిందట.
మరునాడు తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా నమ్మిన ఆ ప్రముఖుడు, వారి వెంట ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి, “నా కుమార్తె కు పడిపోయిన మాట తిరిగొస్తే ఆలయ పునరుద్ధరణకు సహకరిస్తానని” శ్రీ గణేశ శాస్త్రి తో అనడం, శ్రీ శాస్త్రి గారు నెలరోజులవాటు ప్రతిరోజు శ్రీ అమ్మవారి అభిషేక జలాన్ని, శ్రీ మగన్ లాల్ గారి కుమార్తె కు తీర్థం గా ఇవ్వడం, ఆమెకు మాట రావడం వెంట వెంటనే జరిగిపోయాయి. అమ్మవారి మహిమకు ముగ్థుడైన శ్రీ మగన్ లాల్ సమేజా ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నారు.
ఆ యనంతరం ఎందరో మహానుభావుల సహాయ సహకారాలతో 29.7 1950 న మహాసంప్రోక్షణ కార్యక్రమాలతో ఆలయం పునరుద్ధరించబడి, దిన దిన ప్రవర్థమాన మౌతోంది.

ఆ సమయం లోనే వ్రేలాడతున్న నాలుక తో రౌద్రరూపిణి గా ఉన్న శ్రీ అమ్మవారి నాలుక పై అమృత బీజాలను వ్రాసి,యంత్రాన్ని ప్రతిష్టించి, భీకరం గా ఉన్న ముఖాన్ని ప్రసన్నంగా మార్చారని, దక్షిణాచార సంప్రదాయం లో పూజించబడే మూర్తి శాంతరూపిణి గా ఉండాలనేది శాస్త్రవిథి యని స్థల పురాణం లో వ్రాయబడింది. అంతేకాక అమ్మవారి ఆలయం లో చండీ యంత్రాన్ని ప్రతిష్టించి, ప్రతిసంవత్సరము శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులను నిర్వహిస్తూ, నిత్యధూప దీప నైవేద్యాలను ఆచరిస్తున్నారు. జంతుబలులను పూర్తిగా నిషేధించారు.
శ్రీ భద్రకాళీ అమ్మవారికి ఆశ్వయుజ మాసం లో శరన్నవరాత్రులు, చైత్రమాసం లో వసంత రాత్రులు వైభవం గా నిర్వహిస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజున శ్రీ అమ్మవారిని శాకంభరీదేవి గా అలంకరిస్తారు.
(పూర్వకాలం లో హిరణ్యాక్షుని వంశం లో దుర్గముడనే వాడు,పుట్టి తపస్సుతో బ్రహ్మను మెప్పించి, బ్రాహ్మణుల వద్ద నున్న వేదాలు, మంత్రాలు తనకు కావాలని, దేవతలు అపజయం కలగాలని , వరం కోరుకున్నాడు. బ్రహ్మ సరేనన్నాడు. దానితో బ్రాహ్మణులు వేదాథ్యయనము,జపహోమాదులు వదిలివేశారు. దానివలన దేవతలకు అందవలసిన హవిర్భాగము లందక వారు శక్తిహీనులయ్యారు. యజ్ఞాలు జపతపాలు లేక ప్కృతి లో ధర్మం నశించింది. అనావృష్టి వలన మనుష్యులు, పశుపక్ష్యాదులు పెద్దఎత్తున మరణించసాగారు. భూమండలమంతా మృతకళేబరాలతో నిండిపోయింది. ఆసమయం లో బ్రాహ్మణుల హిమాలయాలకు వెళ్లి పరాశక్తి ని ప్రార్థించారు. అమ్మవారు కటాక్షించి తొలకరి మబ్బువంటి శరీరఛాయ, నూరు కన్నులు,కోటిసూర్యుల తేజస్సు తో లోకోత్తర లావణ్య రూపిణియై ఆవిర్భవించింది. ఆ తల్లి చేతులలో మథుర రస భరితములైన పండ్లు,ఫలాలు, రకరకాల భక్ష్యభోజ్య పదార్థాలను ధరించి ఉంది. ఆమె నేత్రాలు పూర్ణకుంభాల్లాగ నిండుగా ఉన్నాయి. ఆ కండ్లనుండి తొమ్మిది రోజులపాటు ఏకథాటిగా కారిన నీటితో ఓషథులన్నీ జీవకళతో ప్రకాశించాయి. నదీనదాలు,చెఱువులు జలసమృధ్ధి తో కళకళలాడి జగత్తు చల్లబడింది. ఆమె శరీరమునుండి ఫలశాక సమూహాలు, అన్నపాన అమృతాలు అవిర్భవించి లోకంలోని కరువు రూపు మాపబడింది. కావున ఆమె శాకంభరి అయ్యింది. – శ్రీదేవీభాగవతం – సప్తమ స్కంథము )
శ్రీకృష్ణాష్టమి రోజు రాత్రి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపం లో అలంకరించబడి సేవించబడుతోంది. వైశాఖ శుద్ధ పంచమి “శంకరజయంతి” రోజున శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణోత్సవాలు(బ్రహ్మోత్సవాలు) కన్నుల పండువు గా జరుగుతాయి.

Write Your Comment