Nagula Chavithi Slokas in Telugu

Nagula Chavithi Slokas in Telugu, which stotras (mantras) are to be chanted on Nagula Chavithi are given here in Telugu..

నాగుల చవితి – కార్తీక మాసం – అంతరార్ధం- చదువుకోవల్సిన శ్లోకాలు

పాముని చూడగా బెదిరి పాకిన చోటన మంత్ర అక్షతల్
భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్ మరిం
పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే
కామిత సంతతిచ్చరయుగా అవి దేముడే ! కొల్వుడీ ప్రజల్

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని “నాగుల చవితి” పండుగ అని అంటారు.

ఈ పండుగలో ఉన్న ఆంతర్యము ఒక్కసారి పరిశీలీద్దాము.

ప్రకృతికి జీవికి మధ్య మనకు ఎంతో అవినావ భావ సంబంధము కనిపిస్తూ ఉంటుంది.
మనము నిశితంగా పరిశీలించగలిగితే ప్రకృతి నుండి మానవుడు తనకు కావలసింది పొందుతూ తిరిగి ఆ ప్రకృతిని సంరక్షించుకునే బాధ్యతను కూడా ఆటవిక స్థాయి నుండి , నేటి నాగరిక సమాజం వరకూ, ఆ ప్రకృతిని దైవ స్వరూపముగా మానవులు భావించి సంరక్షించుకుంటూ ఉన్నంతకాలం సమస్త మానవ కోటికి మరియు జీవ కోటికి మనుగడకు ముప్పు మాత్రం వాటిల్లదు.

ఆ ప్రకృతిని మానవుడు చేజేతులార నాశనం చేసుకుంటే, ఇటు మానవ కోటికి, అటు జీవ కోటికి తప్పక వినాశనానికి దారితీస్తుందను భావముతో నేడు ప్రకృతి – పర్యావరణ రక్షణ అంటూ పలు కార్యక్రమాలను చేపడుతోంది సమాజం.

అలాగ ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపముగా భావించి ఆనాటి నుండి నేటి వరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని – ఇలాగ సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపముగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు.

అదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత!

నిశితంగా మనం పరిశీలిస్తే..అందులో భాగంగానే “పాము”ను కుడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.

ఈ పాములు భూమి అంతర్భాగమునందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి “నీటిని” ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా “రైతు”కు పంట నష్టం కలగకుండా చేస్తాయి.
అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

పైన చెప్పిన విధంగా సర్పం పేరు చెపితేనే బెదిరిపోతూ ఉంటాము. కాని అంతకంటే భయంకరమైన మానవులు మనలోనే ఉన్నారు.

తల నుండు విషము ఫణికిని,
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోకయనక యుండు ఖలునకు
నిలువెల్ల విషము గదరా సుమతీ !

అని చెప్పినట్లు ….అలా మన చుట్టూ మానవరూపంలో ఉంటే మానవులు, సర్పజాతి మనసుకుంటే..నికృష్టమైన (అంటే ..అవి మనంవాటి జోలికి వెళ్ళితేనే ప్రమాదకరమవుతాయి).

కాని వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మనచుట్టూ తిరుగుతున్నా గమనించలేకపోతున్నాము
అని గ్రహించుకోవలసి ఉంది.

అలా మనకంటికి కనబడే విషనాగుపాము కంటే మానవ శరీరమనే పుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు.
ఈ మానవ శరీరము అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెమూకను “వెన్నుపాము” అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారమువలెనే వుంటుందని యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు ,కామ, క్రోధ, లోభ,మోహ,మద,మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో “సత్వ గుణ” సంపత్తిని హరించివేస్తూ ఉంటుంది.

అలా “నాగుల చవితి రోజున ప్రత్యక్షముగా విషసర్ప పుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే ..మానవునిలో ఉన్న “విషసర్పం కూడా శ్వేతత్వం పొంది,మన అందరి హృదయాలలో నివశించే “శ్రీ మహా విష్ణువు నకు” తెల్లని ఆదిశేషువుగా మారి “శేషపాన్పుగా” మారాలనికోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల ఆంతర్యమని చెప్తారు.

దీనినే జ్యోతిష్యపరంగా చూస్తే…కుజ,రాహు దోషాలున్న వారు, సాంసారిక బాధలు ఉన్నవారు, ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠీ ,చతుర్దశిలలో రోజంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరించాలి.

పాహి పాహి సర్ప రూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా!

అలా ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి ,అరటిపళ్ళు మొదలైనవి నివేదన చెయ్యాలి.

ఆ సందర్భముగా పుట్టవద్ద కొన్ని కాకరపువ్వొత్తులు చిన్నారులు ఎంతో సంతోషముగా కాలుస్తారు.

ఇలాగ స్త్రీలు ఆరాధిస్తే ఎంతో శుభప్రదమైన సుఖసంతానము కలుగుతారు.

అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునూ అని విశ్వాసము.

ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు. యుగాల నాటిది. సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్ప పూజ చేయుట అనేది లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి.

ఈ “నాగుల చవితి” నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం .

నాగేంద్రా ! మేము మా వంశములో వారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున “తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నా వాడు అనుకో! పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్మల్ని భయ పెట్టకు తండ్రి ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలని పెద్దలు అంటారు.

ఈ నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

“కర్కోటకస్య నాగస్య
దమయంత్యాః నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తనం కలినాశనం!!

ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు, మొదలైనవి ప్రీతికరమైనవి అని చెప్తారు.

సర్పారధనచేసే వారి వంశం “తామరతంపరగా” వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్ళల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే!

ఆయన అందరికి ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలమంది నాగరాజు, ఫణి,సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటు ఉంటారు.

నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉంది ! దాని సమీపంలో 6 నెలలు తెల్లని ఇసుక, 6 నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి పైకి వస్తుంది అని భక్తులు చెప్తూ ఉంటారు.

నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగు మోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇలాగ ప్రకృతిలో నాగు పాములకు ,మానవ మనుగడులకు అవినాభావ సంబంధం కలదని విదితమవుతోంది.

నాగరాజ దేవాయ నమో నమః !!

Write Your Comment

3 Comments

  1. veeresh says:

    Good evening…

  2. Subbu says:

    It’s a wonderful and energetic festival nagulachavithi