TTD Trust Board officials said that this year Managudi, programme will be observed in two Telugu states from August 9 to 15, 2019 (Andhra Pradesh & Telangana).
ఆగస్టు 9 నుండి 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ”మనగుడి” : టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
పూజాసామగ్రికి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
తిరుమల, 2019 ఆగస్టు 08: సనాతన ధర్మప్రచారంలో భాగంగా శ్రావణ మాసంలో ఆగస్టు 9 నుండి 15వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన 11,500 ఆలయాలలో 19వ విడత మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీవైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం మనగుడి పూజా సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుండి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ మనగుడి పూజాసామగ్రిని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయంలో శ్రీవారి పాదాల వద్ద మనగుడి సామగ్రిని ఉంచి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ధర్మప్రచారానికి ఆలయాలు వేదికలని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయా గ్రామాలు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయని వివరించారు. మనగుడి కార్యక్రమం కోసం అక్షింతలు, కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ తదితర పూజాసామగ్రిని శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశామన్నారు. అనంతరం పూజాసామగ్రిని ఆయా ఆలయాలకు పంపామన్నారు. ఆలయాల్లో ఆగస్టు 9న వరలక్ష్మీ వ్రతం విశిష్టతపై ధార్మిక ప్రసంగం, 10 నుండి 14వ తేదీ వరకు రామాయణ, మహాభారత, భాగవతాలపై ధార్మిక ప్రసంగం, 15న శ్రావణ పౌర్ణమి విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక భజన మండళ్ల సభ్యులు, శ్రీవారి సేవకులు కలిసి మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా. రమణప్రసాద్, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.