Madhu Kaitabha Vadha (Sridevi Bhagavatham) (TELUGU)

Madhu Kaitabha Vadha (Devi Mahatmyam Chapter 1) (TELUGU)..

మధుకైట భుల వధ-శ్రీ దేవీ భాగవతం

విష్ణువుకు మధుకైటభులతో ఐదువేల సంవత్సరాల కాలం యుద్ధం జరిగిందని విన్న శౌనకాదులు, సూతునితో “మహాత్మా! ఆ సుదీర్ఘవైరం ఎలా అంతమైంది? అసలు ఆ మధుకైటభులు ఎవరు? ఆ వృత్తాంతమంతా సవిస్తరంగా వినిపించు” అని కోరారు.

“పురాణ శ్రవణం పట్ల మీ ఆదరం నన్ను ముగ్ధుడిని చేస్తోన్నది. మీరు ధన్యులై, పురాణ కథనం అనే పుణ్యం నాకు లభించేలా చేసి నందువల్ల నేనూ ధన్యుడినయ్యాను. ఇక వారి గాథ వినిపించనున్నాను.

పూర్వకాలంలో ప్రళయం ఆసన్నమయి – లోకాలన్నీ జలమయమై ఉన్న సమయంలో, శేషతల్ప సాయి అయిన శ్రీ విష్ణుదేవుని చెవుల్లోంచి ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారు తమ జన్మకారణాన్ని పరాదేవి అని ఎరిగి, హ్రీం మాతృబీజాక్షరాన్ని జపించసాగారు. పట్టుదలగా వారు చేస్తూన్న ఈ తపస్సుకు మెచ్చి దేవి ప్రత్యక్షమై, వరాన్ని కోరుకోమంది. తమకు స్వేచ్చామరణం ప్రసాదించమని కోరారు ఆ దానవులిద్దరూ. వారు అడిగిన వరం ఇచ్చి దేవి అంతర్హితురాలైంది.

ఎటుచూసినా నీరే ఉండడంతో, బలగర్వితులైన రాక్షసులు తమతో ఎవరు యుద్ధానికి వస్తారా? అని ఎదురుచూడసాగారు. ఇతర జీవరాశులేవీ లేవు. ఈలోగా వారికి పద్మం పైన సుఖాశీనుడైన బ్రహ్మ కనిపించాడు. పద్మం నీటి మునిగి లేదు. పైగా ఆసనం బాగా అమరి ఉంది. దానవులకు కయ్యానికి కాలు దువ్వడానికి మంచి అవకాశం లభించినట్లయింది. బ్రహ్మని గద్ధించి ఆ ఆసనం దిగిపొమ్మన్నారు. లేదా తమతో యుద్ధం చెయ్యమన్నారు.

ఈ రెండింటిలో ఏది చేద్దామన్నా బ్రహ్మకు అసాధ్యమే! వారి బలస్వరూప స్వభావాలు తనకు తెలియవు. సామదాన భేదోపాయాలేవీ పని చేయగలవన్న నమ్మకం లేదు. దండోపాయానికి దిగాలంటే వైరి పక్షం బల ప్రమాణమెంతో తెలియరాకున్నది. ఈ తరుణంలో హరిస్మరణ తప్ప తనకు మార్గం లేదని గ్రహించిన బ్రహ్మ, విష్ణుదేవుని మనసా శరణువేడి, ఆ సంకటం నుంచి తనను రక్షించమన్నాడు. ఎంతగా తాను దీనాలాపాలు గావిస్తున్నా, ఆదిశక్తి అధీనుడై నిద్రిస్తూన్న హరి మేల్కోవడం లేదు.

అప్పుడు బ్రహ్మకు, విష్ణువు కూడా పరాశక్తి ఆధీనుడేనని స్పృహ కలిగింది. హరియే ఇలా శక్తి వశంవదుడై నిద్రిస్తున్నాడూ అంటే, ఇక ఇతరుల సంగతి చెప్పాలా? కనుక ఆ యోగ నిద్రనే ఈ రీతిగా స్తోత్రం చేశాడు బ్రహ్మ –

“సమస్త వేదవాక్కుల సారంగా జగన్మాతవు నువ్వేనని తెలుసుకున్నాను. లోక పోషకుడైన పురుషోత్తముడే నీ ఆధీనంలో ఉన్నాడంటే, నీ మహత్తర శక్తి ఏమని పొగడను? ఆ మోహ లీల లన్నీ నీవే కదా! కనుక నన్ను నీలో చేర్చుకుని సాయుజ్యమే ప్రసాదిస్తావో, లేక మదగర్వంతో అకారణ కలహానికి సిద్ధమైన ఈ దానవులను పరిమారుస్తావో నీ ఇచ్చ” అని స్తుతించిన బ్రహ్మ పట్ల సంతసించిన తామసీ శక్తి విష్ణుశరీరాన్ని వీడి పక్కకు జరిగింది. దాంతో నిద్రావిముక్తుడై హరి లేచేసరికి, బ్రహ్మకు మహదానందమైంది.

దేవతలలో విష్ణువు సర్వగతుడు. సర్వపాలకుడు. ఈ విరాట్‌ స్వరూపమైన చరాచర ప్రపంచమంతా ఆయన ధరించి, భరిస్తున్నట్టిదే! అ మహా విరాడ్రూపధారిని వర్ణించడం మెవరి తరం? సూర్య భగవానుడిగా – నారాయణమూర్తిగా – శంకరునిగా ఎవరికేరీతి ఉపాసన కనుకూలమైతే, ఆరూపాల్లో అర్చించేదే విరాట్పురుషునే! అయినప్పటికీ నిశిత విమర్శన చేసి చూడగా, ఈ సర్వానికి ‘శక్తి’ యే ఆధారమని తేతుతోంది. అట్టి జ్ఞానం పొందిన బ్రహ్మ, దేవీస్తుతి ద్వారా విష్ణుదేవుని నిద్రమేల్కొల్ప గలిగాడు.

వనిద్రాశక్తి నుంచి వేర్పాటు పొందిన విష్ణువు, తన ఎదుట భయభ్రాంతుడై నిలచిన బ్రహ్మదేవుని వంక చూశాడు. ‘పద్మం నుంచి స్థాన భ్రంశం పొంది ఇక్కడ నిలుచున్నావేం? పైగా ఆ దీనవదనం దేనికి?’ అని అడిగాడు.

హరికి జగన్మాత ఉపదేశించిన ఉపాయం :

బ్రహ్మ దైర్యం వహించి “నారాయణ మూర్తీ! నీ కర్ణకమలాల నుంచి పుట్టిన రాక్షసులు మధుకైటభులు. ఘోర రూపులే కాదు. మహాబలులు కూడా! వాళ్లు నాపై యుద్ధం ప్రకటించారు. నిన్నాశ్రయించడానికే , వారి బారి నుంచి నన్ను రక్షించమని శరణు వేడటానికే నేనిక్కడికి వచ్చినిలబడ్డాను” అంటూ ఉండగానే, మధుకైటభులు అక్కడకు వచ్చారు.

హరిని కిందామీదా చూస్తూ “ఓహో! ఇతడేనా శ్రీహరి? ఈతని అండ చూసుకొనే కదా, నీవు మా ఆజ్ఞకు సమాధానం చెప్పకనే తాత్సరం చేస్తున్నావు. పద్మపీఠికను ఖాళీచేసి శాశ్వతంగా మాకు ఒప్పగించడమైనా గాని – మాతో యుద్ధం చేసి అయినా సరే నీ పీఠం నువ్వుదక్కించుకోవడం గాని కానిమ్మంటే, ఇటు పారిపోయి వచ్చావన్నమాట!” అని తిరిగి బ్రహ్మను వేధించసాగారు.

“ఓహో! నా పుత్రుని బెదిరించిన అసురద్వయం మీరేనా? మీరెక్కడ ఉండేదీ చూపవలసిందిగా, నేను ఇతడ్నే అడుగుదామనుకుంటూ ఉండగానే మీరే ఇక్కడకు రావడం వల్ల నాకు శ్రమ తగ్గించారు. యుద్ధోన్మత్తులై ఉన్న మీ ఇద్దర్నీ చంపి, ఇతనికి చిత్తశాంతి కలిగిస్తాను” అన్నాడు శ్రీహరి.

“ఒక్కడు ఇద్దరితో పారాడటం యుద్ధనీతి కాదు. అందులోను ద్వంద్వ యుద్ధంలో అది అసలే పొసగదు” అంటూ ముందుగా మధుడు అలుపొచ్చేవరకు హరితో పోరాటం చేశాడు. కొంతసేపు అతనికి విశ్రాంతి నివ్వడానికా అన్నట్లు – అతడ్ని పక్కకు తప్పించి, కైటభుడు హరితో పోరుకు సిద్ధమవుతూ వచ్చాడు. మళ్ళీ అలుపు తీరేంతవరకు కైటభుడు విశ్రమించినపుడు మధుడు హరిని ఢీకొనేవాడు. ఇక్కడ హరి ఒక్కడే అవిశ్రాంతంగా వారితో పోరాడవలసి వస్తున్నది. పోరులో గెలుపోటములకు తావులేని పరిస్థితి ఏర్పడుతోం్ి . ఎంతకు యుద్ధం తెగడం లేదు. ఈ రీతిన ఐదువేల ఏళ్ళు యుద్ధంతోనే గడిచాయి. ఇంత సుదీర్ఘ సంగ్రామం దేవతలెన్నడూ తిలకించలేదు. శ్రీ హరి శక్తి సామర్థ్యాలు వారికి బాగా విశదమయ్యాయి.

చూడడానికి ఇదంతా బాగానే వుంది గాని, ‘వీళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటూ ఇలాగే యుద్ధం చేస్తూ పోతే, దీనికి అంతమెక్కడ? నాకు అలసట కలుగుతోంది…’ అనుకోసాగాడు హరి.

ఆలోచనామగ్నుడైన హరిని ఉద్దేశించి, మధుకైటభు లిద్దరూ చెలరేగిన సమరోత్సాహంతో “వీరుడా! చిరకాల యుద్ధంతో ఒంటరివై – అలసిపోయి వుంటావు. ఇంతకాలం పోరాటం కొనసాగించినందు వల్ల నీ వీరత్వం ప్రశంసించదగినదే! దీటైనవానితో పోరాడగలిగామన్న సంతృప్తి మాకుంది. ఇక దాసోహం అన్నావనుకో! అంజలి ఘటించావనుకో! నిన్ను వదిలేస్తాం! అలా కాక, ఇంకా పోరు కొనసాగిస్తానంటే మాత్రం, నిన్ను సంహరించాకనే ఈ పరమేష్ఠి పని పడతాం!” అంటూ తమ యుద్ధోన్మాదం ప్రకటించారు.

అంత సుదీర్ఘ పోరు జరిపినప్పటికీ, హరి క్రోధావేశాలు చెందక, శాంత వచస్కుడై “మధుకైటభులారా! యుద్ధ ధర్మము మీకు తెలీనిది కాదు, అలసినపుడు, పడిపోయినపుడు, భయముతో కంపించి వున్నప్పుడు, ఇట్టివే మరికొన్ని యుద్ధ ధర్మానికి కట్టుబడినవి….అట్టిపరిస్థితులలో వైరికి ఒకింత విరామం ఇవ్వడం సనాతన ధర్మం! కొద్ది విశ్రాంతితో తిరిగి శక్తి పుంజుకొని మీతో యుద్ధం చేస్తాను” అంటూ హరి ధర్మ వచనాలు పలికాడు. న్యాయమార్గం ఎరిగి వున్న దనుజవీరులు సరే – కానిమ్మన్నారు. హరికి విశ్రాంతి కల్పించడానికి దూరంగా జరిగారు.

ఇక్కడ హరి శక్తి పుంజుకుంటాననడంలో అంతర్యం ఒక్కటే! అది ఆదిపరాశక్తి ధ్యానం. రాక్షసులటు జరగ్గానే, శ్రీహరి జగన్మాతృధ్యానాసక్తుడైనాడు. కామేశ్వరీ ప్రసన్నం లేనిదే, ఈ పోరు సమసిపోవడం అసాధ్యం అని గ్రహించుకున్నాడు. “మహామాయా స్వరూపిణీ! అంబా! సృష్టి స్థితి సంహారకారిణీ! సదాలంబా! నీకివేనా శతకోటి నమస్సులు! నీ వరప్రభావ గర్వితులై ఉత్సహించి వున్న ఈ అసురద్వయాన్ని అణగింప నాయత్నం సఫలం కాకుండా ఉంది. నాకు సహాయ పడవలసిందిగా అంజలి ఘటించి అభ్యర్థిస్తున్నాను” అంటూ వేడుకున్నాడు.

అప్పుడా మాయా స్వరూపిణి “హరీ! వీరిని నేను మహా మోహంలో ముంచెత్తగలను. అప్పుడు వీరిని సంహరించ వచ్చును” అని తరుణోపాయం సెలవిచ్చింది.

ఊరడిల్లిన మనస్సుతో – విశ్రాంతి పొందిన తనువుతో తిరిగి యద్ధరంగాన చేరిన హరిని చూసి, తిరిగి ఆ సోదర ద్వయం ఒకరివెంట ఒకరుగా హరిని ఎదుర్కొన్నారు. ఇంతలో దేవి వారికి ఆకాశమున ఒక మదవతి రూపుకట్టి, ఒక వక్రరేఖా సంచార దృష్టిని వారిపైకి వదలింది. భ్రమలో – మోహంలో పడి, ఆమె పరాశక్తి అని తెలియలేక కామోద్దిప్త అయిన కామిని తమపై క్రీగంటి చూపులు రువ్వుతున్నదనుకొని ఆ సోదరులిద్దరూ కామపీడితులయ్యారు. ఆ విశ్వ మోహిని వంక మాటిమాటికి చూస్తూ యుద్ధం మీద మనసు నిలపలేకపోయారు.

అదను కనిపెట్టి హరి “దానవ శూరులారా! మీ వంటి గొప్ప యుద్ధ నైపుణ్యం గలవారితో నాకు ఇంతవరకు సమరం సంఘటిల్లలేదు. మీకేదైనా వరం ప్రసాదించాలను కుంటున్నాను. మీకు కావల్సిందేదో కోరుకోండి” అన్నాడు. దానికా దనుజులిద్దరూ పకపకనవ్వి “ఏమిటేమిటి? నువ్వు మాకు వరమిచ్చేంత వాడివా? మేమే దాతలం! నీవే యాచకుడివి కావలి. నీతోపోరాడి సంతసించినందుగ్గాను, ఏ వరం కోరుకుంటావో కోరుకో!” అంటూ మాయామోహిని ఎదుట తమ ఉద్ధతిని ప్రదర్శించాలని భావించారు.

“అడిగిన వెనుక మీరు వెనుకంజ వేయుదురేమో” అని అపనమ్మకం నటిస్తూ అన్నాడు హరి. “ఆడిన మాట తప్పేవాళ్లం కాము. ఓడినా – ప్రాణాలొడ్డినా సరే! ఎంతటి కోరరానిదైనా సరే! ఒకసారి వాగ్దత్తమయ్యాక, అది మానోటి నుంచి బైటికొచ్చాక కోరినవారి కోరిక చెల్లించడం మావిధి” అన్నారు గంభీరంగా. ఇదంతా విశ్వమాయ ఎదుట తమ గొప్పదనం ఉగ్గడించుకోగల అవకాశంగా భావించినందున, గర్వంగానే వరం ఇవ్వడానికి సిద్దపడ్డారు.

“అంతగా మీరు వాగ్దానం చేసినందున – ఏదో తుచ్చమయిన – అల్పమయిన కోరిక ఏదీ నాకు లేదు. నాచేత మీరు మరణించాలన్నదే నా వాంచితం” అన్నాడు హరి. కపటోపాయం అవలంబించ వలసిందిగా అంబికయే ఆనతిచ్చింది మరి!

హరి కోరిక విన్నాక, అసురులిద్దరూ, తమ ఉసురులను కోరిన నారాయణు నుద్దేశించి గుడ్లప్పగించి చూశారు – ఆశ్చర్యంతో.

అంతవరకు మాయా మోహినిగా తమను అలరించిన ఆ మెరుపుతీగ ఎక్కడా అని అంతటా పరికించారు ఆ ఇద్దరూ. ఇంకెక్కడి కామిని? తమ ప్రయోజనం నిమిత్తం ఆ రూపాన కంపట్టిన మానిని, వరం పొందిన మాధవుని అజ్ఞాతంగా దీవించి అంతర్థానమైపోయింది.

ఇక చేసేది లేక – “సరే నయ్యా శ్రీహరీ! మేం ఆడిన మాటతప్పి చరిత్రహీనులుగా నిలిచిపోవడం మాకు ఇష్టం లేదు. ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. అలా కాకుండా నీరు లేని చోట మమ్మల్ని వధించవలసింది” అన్నారు. ఆ చివరి క్షణాల్లో కూడ శ్రీహరిని ఇరుకున పెట్టడానికే చూశారు ఆ దానవులు. ఏ విధంగా? తమదేహాలను విపరీతంగా పెంచుకుంటూపోయారు. మాయావులైన ఆ రాక్షసులను మించిన మహా మేధావి దామోదరుడు గనుక, అంతకంటే విపులరీతిన తన ఊరుభాగాన్ని పెంచి, వారిని ఆ తొడలపైకి రప్పించి, సుదర్శన చక్రాన్ని సంభావించి చక్రాయుధంతోనే హరి శిరస్సులను చేదించేశాడు.

ఆ మధుకైటభులు శిరస్సు నుంచి, వారి మేధస్సు సాగరంపై ఎంతమేర వ్యాపించిందో, అదంతా ‘మేదిని’ అని పిలువబడిందా నాటి నుంచి. అదే మట్టి భాగంతో నిండిన భూమి. ఇది రాక్షసుల మెదడుతో ఏర్పడినట్టిది. కనుకనే మృత్‌ధాతు జనితం. మట్టిని తినరాదంటారు విజ్ఞులు. భూమికి పర్యాయపదమైన మేదిని, మరేదో కాదు – మధుకైటభుల వధ వల్ల సముద్ర మధ్యాన ఏర్పడిన ఒక మహాదిబ్బ మాత్రమే!” అని మధుకైటభ వథను సవిస్తరంగా వినంపించాడు రోమహర్షణుడు.

Write Your Comment