Kartika Purana 4th Chapter in Telugu | కార్తీక పురాణము 4వ అధ్యాయము

Kartika Purana 4th Chapter in Telugu. This chapter of Kartika Purana explains Deeparadhana Mahima (importance of Deeparadhana)..

కార్తీక పురాణము 4వ అధ్యాయము (దీపారాధనా మహిమ)

ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతముయొక్క మహిమవల్ల బ్రహ్మరాక్షస జన్మనుండి కూడా విముక్తినొందెదరని చెప్పుచుండగా జనకుడు ‘మాహాతపస్వీ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలదీ తనివితీరకున్నది. కార్తీకమాసములో ముఖ్యముగా యేమేమి చేయవలయునో, యెవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు’ అని కోరగా వశిష్ఠులవారు యిట్లు చెప్పదొడగిరి.

జనకా! కార్తీక మాసమందు సర్వసత్కార్యములునూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము, శివాలయమునగాని విష్ణ్యాలయమునందుగాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబునందుగాని దీపముంచినవారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరినూనెతోగాని, అవిసె నూనెతో గాని, విప్పనూనెతో గాని, యేదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యాత్ములుగాను, భక్తిపరులుగాను నగుటయేగాక అష్టయిశ్వర్యములూ కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందు కొకకథ గలదు, వినుము.

శతృజిత్కథ:

పూర్వము పాంచాలదేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి, తుదకు విసుగుజెంది గోదావరీ తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, “పాంచాల రాజా! నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీకోరికయేమి?” యని ప్రశ్నించగా, “ఋషిపుంగవా! నాకు అష్టయిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక, కృంగి కృశించి యీ తీర్థస్థానమున తపమాచరించు చున్నాను” అని చెప్పెను. అంత మునిపుంగవుడు “ఓయీ! కార్తీకమాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతికొరకు దీపారాధనము చేసినయడల నీ కోరిక నెరవేరగలదు” యని చెప్పి వెడలిపోయెను.

వెంటనే పాంచాల రాజు తనదేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెలరోజులూ దీపరాధన చేయించి, దానధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన నారాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొకకుమారుని గనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మములుచేసి, ఆ బాలునకు ‘శత్రుజి’ యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందు వలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థమానుడగుచు సకలశాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాబముచేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను.

తల్లిదండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచీ చూడనట్లు – వినీవిననట్లు వుండిరి. శతృజి ఆరాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పువారలను నరుకుదునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొకదినమున నొక బ్రాహ్మణపడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మథునకైననూ శక్యముగాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలె నిశ్చేష్టుడై కామవికారములో నామెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యిపట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగముల ననుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతిదినము నర్థరాత్రివేళ ఒక అజ్ఞాతస్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, భార్యనూ, రాజకుమారునీ ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.

ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, యెవరికివారు రహస్యమార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున “చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా,” యని రాకుమారుడనగా, ఆమె తన పైటచెంగును చించి అక్కడనున్న ఆముదపుప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురునూ మహానందముతో రతిక్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదునుగా నామెభర్త తన మొలనున్న కత్తితీసి ఒక్క వ్రేటుతో తన భార్యనూ, ఆ రాజకుమారునీ ఖండించి తానుకూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలదీ ఆరోజు కార్తీక సుద్ధ పౌర్ణమి, సోమవారమగుటవలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుటవలననూ శివదూతలు ప్రేమికులిరువురినీ తీసుకొనిపోవుటకునూ – యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకునూ అక్కడకు వచ్చిరి. అంత యా దూతలను చూచి బ్రాహ్మణుడు “ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్లుటకు మీరేల వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారులకొరకు శివదూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే!” అని ప్రశ్నించెను. అంత యమకింకరులు “ఓ బాపడా! వారెంతటి నీచులైననూ, యీ పవిత్రదినమున, అనగా కార్తీకపౌర్ణమీ సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుటవలన అప్పటివరకూ వారు చేసిన పాపముల్న్నియును నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు” అని చెప్పగా – యీ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు “అలా యెన్నటికినీ జరుగనివ్వను. తప్పొప్పులు యేలాగున్నప్పటికినీ మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మాయందరికీ వర్తించవలసినదే” అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివసాన్నిధ్యమునకు జేర్చిరి.

వింటివా రాజా! శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక, కైలాసప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచినవారు జన్మరాహిత్యమొందుదురు.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి నాలుగో యధ్యాయము నాల్గవ రోజు పారాయణము సమాప్తము.

Write Your Comment