Kartika Purana 3rd Chapter in Telugu | కార్తీక పురాణము 3వ అధ్యాయము

Kartika Purana 3rd Chapter in Telugu.. 3rd chapter of Kartika Purana explains about the significance of Kartik Snan (Kartika Snana Mahima)…

కార్తీక పురాణము 3వ అధ్యాయము (కార్తీకమాస స్నాన మహిమ)జనక మహారాజా! కార్తీకమాసమున యే ఒక్క చిన్నదానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక, కార్తీకస్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు.

అధమము కార్తీకమాస శుక్లపౌర్ణమి రోజు నయిననూ స్నానదాన జపతపాదులు చేయకపోవుటవలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము.

బ్ర్హహ్మరాక్షసులకు ముక్తి కలుగుట: ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు ‘తత్వనిష్ఠు’డను బ్రాహ్మణుడొక డుండెను. ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థసమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ, దీర్ఘకేశములతోనూ, బలిష్టంబులైన కోరలతోనూ, నల్లని బాన పొట్టలతోనూ, చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ, ఆ దారినబోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము జేయుచుండిరి. తీర్థ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరీ పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణకుచు యేమియు తోచక నారాయణస్తోత్రము బిగ్గరగా పఠించుచు “ప్రభో!ఆర్తత్రాణపరాయణా! అనాధ రక్షకా! ఆపదలోనున్న గజేంద్రుని, నిండుసభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదినీ, బాలుడగు ప్రహ్లాదునీ రక్షించిన విధముగానే – యీ పిశాచాల బారినుండి నన్ను రక్షించు తండ్రీ!” యని వేడుకొనగా, ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి “మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది. మమ్ము రక్షింపుడు” యని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని “ఓయీ! మీరెవరు? ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు” యని పలుకగా వారు “విప్రపుంగవా! మీరు పూజ్యులు. ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శనభాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇకనుండి మీకు మా వలన యే ఆపదా కలుగదు” అని అభయమిచ్చి, అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును యీ విధముగా చెప్పసాగెను.

“నాది ద్రావిడదేశం. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వముగల వాడనై యుంటిని. న్యాయాన్యాయవిచక్షణలు మాని పశువువలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థులవద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు, దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరచుచు, లుబ్ధుడనై లోకకంటకుడిగా నుంటిని.

ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీకమాస వ్రతమును యథావిథిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్ధసంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మాయింటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకుని యింటినుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపమొచ్చి, ‘ఓరి నీచుడా! అన్యాక్రాంతముగా డబ్బుకూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తుసామాగ్రిని దోచుకొంటివి గాన, నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక’ యని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణశాపమును తప్పించలేము గదా! కాన నాయపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందుల కాతడు దయదలచి ‘ఓయీ! గోదావరి క్షేత్రమందొక వటవృక్షము గలదు. నీవందు నివసించుచూ యే బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువుగాక’ యని వెడలిపోయెను. ఆనాటినుండి నేనీ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్నూ నా కుటుంబము వారినీ రక్షింపు”డని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

ఒక రెండవ రాక్షసుడు – “ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను బాధించి వారికి తిండిపెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా యను నటులచేసి, వారి యెదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడను. నేను యెట్టి దానధర్మములు చేసి యెరుగను, నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి రాక్షసునివలె ప్రవర్తించితిని. కాన, నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాపపంకిలమునుండి ఉద్ధరింపుము” అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను.

మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియజేసెను. “మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైననూ చేయక, కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను నర్పించక, భక్తులు గొనంతెచ్చిన సంభారములను నా వుంపుడుగత్తెకు అందజేయుచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము యీ రూపమును ధరించితిని, కావున నన్ను కూడా పాపవిముక్తుని కావింపు” మని ప్రార్థించెను.

ఓ జనక మహారాజా! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపము లాలకించి ‘ఓ బ్రహ్మరాక్షసులారా! భయపడకుడు. మీరు పూర్వజన్మలలో చేసిన ఘోరకృత్యంబులవల్ల మీకీరూపములు కలిగెను. నావెంట రండు. మీకు విముక్తిని కలిగింతును ‘యని వారినోదార్చి తనతో గొనిపోయి ఆమువ్వురి యాతనావిముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారివారి రాక్షసరూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమునకేగిరి. కార్తీకమాసములో గోదావరీ స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన, ఎంత ప్రయత్నించయినాసరే కార్తీకస్నానాలనాచరించాలి.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి మూడవ యధ్యాయము మాడవ రోజు పారాయణము సమాప్తము.

 

Write Your Comment