Karthikam – Harihara Priyam (Telugu)

Karthikam – Harihara Priyam.. This article explains Karthika Masam and its significance for Shiva Puja and Vishnu Puja in Telugu….

హరిహరులకు ఇష్టం కార్తీకం

కార్తీకమాసం అత్యంత విశేషవంతమైనది. శివకేశవులిద్దరికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలకన్నా విశిష్టమైన ఈ కార్తీకమాసం అధికఫలదాయకమైంది. కృత్తికల్లో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక ఇది శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఈ కార్తీక మాస విశిష్టతను గూర్చి, వేద వ్యాసమహర్షి తన శిష్యుడైన సూతునికి, సూతముని శౌనకాది ఋషులకు తెల్పాడు.

పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి, అవసరమైన ద్రవ్యానికై వశిష్ఠమహర్షి, జనకమహారాజును అర్థించగా, జనకమహారాజు అందుకు అంగీకరించి, సంవత్సరంలోని సర్వమాసాల కంటే కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతుంటారు కదా! అయితే ఆ సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని తెలియజేయమంటాడు. అప్పుడు వశిష్ఠుడు విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందు చేరుతుంది. ఇట్టి జలాశయాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు కనుక కార్తీకస్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవికాదు. హపీకూప, నదీస్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన ఆశ్వమేధ ఫలాన్ని పొందుతారని వివరిస్తాడు.

స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీకమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలనీ, కార్తీకమాసపు సాయంకాలం శివాలయాలలోగానీ, వైష్ణ్యాలయంలోగానీ యధాశక్తి దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభించడమే గాక, శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ, శివలింగసన్నిధినిగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించి పోతాయని కార్తీకంలో శివాలయంలో ఆవునేతితోగాని, నువ్వులనూనెతో గాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని, నెల పొడుగునా చేసినవాళ్లు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పది, పదకొండు అధ్యాయాలను పారాయణ చేస్తారో, వారి పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారని, తులసీదళాలతో, తెలుపు లేక నలుపు గన్నేరుపూలతోగాని శ్రీమహావిష్ణు పూజను చేస్తారో, వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలననుభవిస్తారని, కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, పద్దెనిమిది పురాణాలలో ఏదైనా సరే ప్రవచించితే సర్వకర్మబంధ విముక్తులవుతారని వశిష్ఠ వచనం. వేదశాస్త్ర పురాణాలన్నీ మనకు అనేక ధర్మసూక్ష్మాలను అందిస్తున్నాయి. ఈ ధర్మసూత్రాల వలన మనకు కొన్ని సమయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగానూ, స్వల్ప పుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తుంటాయి.

పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీకవ్రతం వలన హరించుకుపోతాయి. కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్రదర్శనానంతరం భోజనం చేస్తూ – ఆ రోజంతా భగద్ద్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారని సూత ఉవాచ. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తభోజనం చేస్తారు. అయితే నక్తం ఉండలేనివారు ఒక కార్తీకపౌర్ణమినాడైనా నక్తములున్నా పుణ్యమే. కార్తీకమాసమంతా తెల్లవారు ఝాముననే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీకస్నానం.

కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ కార్తీకమాస వ్రతాన్ని తులాసంక్రమణదాదిగా గాని, శుద్ధపాఢ్యమి నుండి ప్రారంభించాలి. ఈ మాసంలో వస్త్రదానం, హిరణ్యదానం, సువర్ణదానం, కన్యాదానం, భూదానం చేస్తే విశేష ఫలితాలు పొందడమే కాకుండా, తేజస్సు , యశస్సు, కార్యసిద్ధి, జ్ఞానలబ్ధి సౌభాగ్యాలు కలుగుతాయి.

ఈ మాసంలో ఉదయం, సాయంత్రంవేళల్లో ఆవు నేతితో గాని, నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసి, అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్చనలు చేయడం వలన మహా పుణ్యం లభిస్తుంది.

ఈ కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. యజ్ఞయాగాదులకన్నా కార్తీకవ్రతం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. తీర్థయాత్రల వల్ల కలుగునటువంటి ఫలం, ఈ కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణుని ఎక్కడైతే పూజిస్తారో, అక్కడ భూత, పిశాచ, గ్రహ గణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడుపూలతో పూజించితే దీర్ఘాయులై, మోక్షాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశినాడు శివునికి మారేడు దళాలతో, జిల్లేడుపూలతో, విష్ణువుకు తులసీ దళాలతో, జాజిపూలతో పూజ అత్యంత శ్రేష్టదాయకం.

జలంధరుని భార్యయైన బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తలసి వృక్షాలు అవిర్భవించాయి. సరస్వతి – ఉసిరి రూపము, లక్ష్మీ – మాలతి రూపము, గౌరి – తులసిరూపంగా వెలసినారు.

కార్తీకమాసం ద్వాదశి రోజున ‘తులసి’ వృక్షసన్నిధిలో దీపప్రజ్వలనం చేసి, “నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వపాపేభ్యస్సద్వ సంపత్ప్రదాయినీ” అంటూ ధ్యానం చేస్తూ శక్తి శ్రద్ధలతో తులసిదేవిని పూజించాలి. “ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరీ విద్యాం, పుత్ర పౌత్రాం, ఆయురారోగ్యం, సర్వసంపదాం మమదేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే – ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీమ్‌ నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురుసర్వదా” అనే స్త్రోత్రం చేస్తూ ఉసిరి (ధాత్రీ) చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి, ఉసిరి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణులు చేస్తే, అఖండమైన అష్టైశ్వర్యప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది.

ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఉసిరి ఔషధీ గుణము కలది కనుక, వనభోజనాళ వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరిపూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని, కార్తీకమాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి, ఉసిరి పూజల వలన, ధన, ఫల, భూదానాల వలన పుణ్యఫలం లభిస్తుందని, కార్తీక మహాత్మ్యాన్ని వినినా – పారాయణ చేసినా, సకల పాపాలు నశించిపోతాయని శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీకమహాత్మ్యం ద్వారా తెలుస్తుంది. ఈ కార్తీకమాసంలో భక్తిశ్రద్దలతో హరిహరులను ఆరాధిస్త్రే సమస్తశుభాలు కలుగుతాయి.

Write Your Comment