Karthika Pournami Pooja in Telugu

Karthika Pournami Pooja in Telugu explains which Pooja rituals to be performed on Karthika Pournami day. How to observe Shiva Pooja on Karthika Pournami, Bhakteshwara Vratham vidhanam, etc.. are explained here in Telugu..

ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి కార్తిక పూర్ణిమ. దీనికి శాస్త్రములయందు విశేషమైన మహా వ్రత దినంగా పేర్కొన్నారు. ముఖ్యమైన పర్వాలలో ఇది ఒకటి. సాధారణంగా పూర్ణిమకే పర్వకాలము అని పేరు. పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి, చతుర్దశి – ఈ నాలుగు తిథులు కూడా పర్వములు. ఇవి కాకుండా అష్టమి వంటి తిథులకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా పూర్ణిమ, అమావాస్య పూర్ణ తిథులు కనుక ఈరోజున యే పూర్ణిమ అయినా యే అమావాస్య అయినా కూడా ఈరోజున చేసిన ధ్యానాదులకు అద్భుతమైన విశేష ఫలం వస్తుంది అని సర్వ శాస్త్రములూ చెప్తున్నాయి. పైగా మనకు వేదకాలం నుంచి దర్శ పూర్ణ మాసేష్టులు మొదలైనవి అన్నీ కూడా పూర్ణిమ నాడు చేసే యజ్ఞ యాగాదులకు ఉన్న ఫలితం గురించి చాలా వివరించాయి. పూర్ణిమ నాటి సాధనలు మన మనస్థితిని కూడా ఒక పరిణతిలోకి తీసుకు వెళ్తాయి. అందునా కార్తిక పూర్ణిమ. అందుకే దీనిని మహాకార్తికి అని అంటారు.

సంవత్సరంలో వచ్చే కార్తిక మాసమే వ్రతాల మాసం. భగవంతుడు గొప్ప కాలాన్ని మనకు ఇచ్చాడు. ఆ కాలాన్ని కొద్దిపాటి సాధనతో సద్వినియోగం చేసుకుంటే ఇహమూ బాగుంటుంది, పరమూ బాగుంటుంది, పరమార్థమూ లభిస్తుంది. అందుకు ఈ కార్తికంలో ఏ వ్రతం కొద్దిపాటి చేసినప్పటికీ కూడా విశేష ఫలాన్నిస్తున్నది.

కార్తిక వ్రతములు చాలా ఉన్నాయి. ముఖ్యముగా ఉపవాస వ్రతములు, నక్త వ్రతములు చెప్పబడుతున్నాయి. పగలంతా ఉపవసించి సంధ్యా సమయంలో భగవదారాధన చేసి అటు తర్వాత రాత్రియొక్క ప్రారంభ దశలో ఆహారాన్ని తీసుకుంటే నక్త వ్రతం అని అంటారు. అది పాటించలేనప్పుడు కార్తికంలో స్నానం చేయడం, దీపం పెట్టడం, ఆలయ దర్శనం, ఏదో ఒక పారాయణం, ఏదో ఒక నియమం పెట్టుకోవాలి కార్తిక మాసంలో. అదేవిధంగా ముఖ్య తిథులు కొన్ని ఉన్నాయి పంచ పర్వములు అని చెప్పబడుతూ ఉంటాయి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. కార్తికంలో ఈ అయిదింటినీ పంచ మహా పర్వములు అని కూడా అంటారు. దీనికి పంచక వ్రతము అని కూడా పేరు. ఈ అయిదు రోజులూ నియమబద్ధంగా భగవదారాధన చేయడం, అభిషేకాదులు చేయడం చాలా విశేష ఫలితాలను ఇస్తాయి. అందులో చివరి రోజు పూర్ణిమ. ఈ అయిదూ చేయలేనప్పుడు పూర్ణిమ వ్రతమైనా చేయాలి. నెలరోజులూ వీలు కానప్పుడు అయిదు రోజులు, అయిదు రోజులూ వీలు కానప్పుడు పూర్ణిమ. అంత ప్రాధాన్యమున్నది. పైగా ఈ సమయంలో దీప దానం చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. వీలైనన్ని దీపాలు వెలిగించి భగవదారాధన చేయాలి. అవి కూడా ఉత్తమమైన ఇంధనములు అందులో వాడాలి. ఆవునెయ్యి, నువ్వులనూనె మొదలైనవి మాత్రమే. మాఘమాసం స్నానానికి, వైశాఖ మాసం దానానికి, కార్తిక మాసం దీపానికీ ప్రాధాన్యమిచ్చినది. ఒక్క దీపం భగవంతుని ఉద్దేశించి వెలిగించినట్లయితే అది మనకున్న అజ్ఞాన దారిద్ర్యాలను బాధలను తొలగిస్తుందని శాస్త్ర వచనం. పూర్ణిమ నాడు ఏ చిన్నపాటి సాధన చేసినప్పటికీ మహా యజ్ఞ ఫలితం వస్తుంది. అందుకే సంవత్సరంలో ఈ రోజును మాత్రం వృధా చేసుకోరాదు. ఈరోజున ఉపవాసము/ఆహార నియమము పాటిస్తూ స్నానము, దీపము, దానము, ధ్యానము ఇత్యాదులు చేయాలి. ఈరోజున చేసేది ఏదైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. దీపం వెలిగించడంతో పాటు ఒక పీటపై స్వస్తిక్ చిహ్నాన్ని, పద్మాన్ని, శంఖము, చక్రము, శ్రీకారము కూడా లిఖించి వాటిని పూజ చేస్తే ఒక విశేషం అన్నారు. స్వస్తిక్ చిహ్నమే శుభాన్ని, లాభాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తారు.

కార్తిక మాసంలో విష్ణువును దామోదర అనే పేరుతొ ఆరాధిస్తారు. మార్గశీర్ష మాసంలోని ఏకాదశి, ద్వాదశిలలో కేశవా నామంతో మొదలు పెడితే చక్రం తీసినట్లయితే సరిగ్గా కార్తిక మాసం వచ్చేసరికి పన్నెండు నామాలు పూర్తి అవుతాయి. పన్నెండవ నామం దామోదర నామం. దామోదర అన్న మాటకి సర్వ భూతములూ తనలో కలిగినవాడు అని అర్థం. అలాంటి దామోదర మాసమిది. అందుకు కార్తిక దామోదర ప్రీత్యర్థం అని ఏ కర్మనైనా చేస్తారు. అలాంటి ఆ దామోదరుడు కృష్ణావతారంతో ధన్యులైన గోపికలతో కలిసి రాసలీల చేసినటువంటిది.

రాసలీల అంటేనే ఒక పూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవం. జీవాత్మలు పరమాత్మతో లీనమైనటువంటి అవస్థని ఇక్కడ రాసలీల అంటారు. ఆ రాసలీలావస్థ ఒక పూర్ణావస్థ. ఆ పూర్ణావస్థే ఇక్కడ శరత్పూర్ణిమ అని చెప్పబడుతున్నది.

ముఖ్యంగా యోగాపరంగా సహస్రారాన్ని చేరుకోవడమే శరత్పూర్ణిమ. ఆ పూర్ణావస్థలో కలిగే దివ్యానందమే రాసలీలానుభవం. అందుకు ఈ రాసలీల జరిగినటువంటి రోజు కూడా ఇది.

అంతేకాదు ఈ రోజు ఏ దేవతను ఆరాధించినా విశేషమే. ఎందుకంటే దేవసేనాని అయినటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క నక్షత్రం కృత్తిక; ఏ దేవతను ఆరాధించాలన్నా “అగ్నిముఖావై దేవాః” అన్నారు గనుక ఈ అగ్ని నక్షత్రమైన కృత్తిక నాడు ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత సంపూర్ణమైన తృప్తిని పొందుతుంది.

అంతేకాదు ఆదివారం సూర్యుని, శివుని; సోమవారం గౌరీదేవిని; మంగళవారం సుబ్రహ్మణ్యుని, గణపతిని; బుద్ధవారం విష్ణువును, గురువారం బ్రహ్మ దేవుని, దక్షిణామూర్తి, హయగ్రీవ వంటి గురుస్వరూపాలను; శుక్ర వారం ఇంద్రుని, ఇంద్రుడు ఆరాధించిన మహాలక్ష్మిని; అలాగే శనివారం శనైశ్చరుని, యముని, రుద్రుని ఆరాధించాలి అని మనకు శాస్త్రములు చెప్తున్నాయి. ఇవి ఏ మాసంలో చేసినా విశేషమే. కానీ అన్ని మాసాలలో ఏడు రోజుల వ్రతం మనం చేయలేం. కానీ కార్తికంలో మాత్రం ఈ వార యజనం చేస్తే సంవత్సరం అంతా వారయజనం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. అందుకే కార్తికంలో ఏది చేసినా సంవత్సరమంతా ఆ యజ్ఞము చేసిన ఫలితం వస్తుంది. అందులో ప్రత్యేకించి ఈ పూర్ణిమ నాడు పైన చెప్పిన నియమాలతో పరమేశ్వరుని, విష్ణువుని ఆరాధించాలి. శాస్త్రబద్ధమైన నియమ పాలనతో మహాకార్తికి సాధన చేసి కార్తిక దీప జ్యోతిలో ఆ పరమేశ్వర ప్రకాశాన్ని దర్శించి ధన్యులమౌదాం.

కార్తీక పూర్ణిమ నాడు శంకరుని గురించి ” భక్తేశ్వరవ్రతం” అనే వ్రతాన్ని కొన్ని ప్రాంతాలలో చేస్తారు. పూర్వం మధురప్రాంతరాజైన పాండ్యుడికి సంతానం లేకపోవడంతో, శివుడిని ప్రార్థించాడు. చివరకు శివుడు వారి మొరను ఆలకించి ప్రత్యక్షమై ” మీకు అతిమేధావి అయిన అల్పాయుష్షు కల కుమారుడు కావలెనో! చిరంజీవే కాని విధవరాలు అయ్యే కూతురు కావలనో? కోరుకో” అనగా , చంద్రపాండ్యుడు, కుముద్వతి దంపతలు కొడుకునే కోరుకున్నారు. వారికి పుత్రుడు కలిగి , పెరిగి పదహారు సంవత్సారాల వయస్సు కావడం వల్ల చింతకు లోనైన వారు తమ కుమారుడిని మృత్యువునుంచి కాపాడేందుకు అనేక ఆలోచనలు చేసి, చివరకు అలకాపురి రాకుమార్తే నిచ్చి వివాహం చేశారు. ఆ యువరాణి మహా శివభక్తురాలు. భర్త అల్పాయుష్షును గురించి తెల్సుకుని శివుడిని ప్రార్థించి , వ్రతం చేసింది. ఆయుష్షు ముగిసి యమభటులు వచ్చిన సమయంలో ఆమే తన భర్తను కాపాడమని శివుడిని ప్రార్థించడంతో, శివుడు ప్రత్యక్షమై యమభటులను తరిమివేసి ఆ యువకుని ప్రాణాలు కాపాడాడు. భక్తురాలికోరికను తీర్చిన వ్రతం ” భక్తేశ్వరవ్రతం” .

కార్తిక పూర్ణిమ నాడు చేయవలసిన ప్రక్రియలలో దేవీభాగవతం చెప్తున్న అంశం ఏమిటంటే రాదాదేవిని ఆరాధించమని చెప్తున్నారు. రాధాదేవి అమ్మవారి అయిదు శక్తులలో ఒకటి. అమ్మవారి పరిపూర్ణ రూపములు అయిదు అని దేవీ భాగవతం వర్ణిస్తుంది.

దుర్గా లక్ష్మీ సరస్వతీ గాయత్రి రాధ అని అయిదు శక్తులు. మొదటి నాలుగు లోక వ్యవహారానికి సంబంధించినటువంటివి.
దుర్గాదేవి ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన జ్ఞాన శక్తి.
లక్ష్మి ఐశ్వర్య శక్తి
సరస్వతి వాక్బుద్ధిజ్ఞానముల, విద్యా శక్తి.
గాయత్రీ దేవి సూర్య మండలాంతర్వర్తి యైన ప్రాణ శక్తి.

ఈ నాలుగూ ఈ విశ్వాన్ని నడుపుతాయి. ఇక అయిదవది అయిన రాధాదేవి పరమాత్మయొక్క ఆనంద స్వరూపము, ప్రేమ స్వరూపము. పరమాత్మ ప్రేమవల్లనే ఈ జగమంతా నడుస్తున్నది. ఆ ప్రేమ, ఆనందము – ఈ రెండింటి యొక్క సాకార రూపమే రాధాదేవి. రాధాదేవి ఒక పాత్ర కాదు. రాధాదేవి ఎక్కడుంది? భాగవతంలో ఉందా? లేక పురాణాలలో ఉన్నదా? అని వెతకడం కాదు. ఆమె విశ్వమంతా ఉన్నది. రాధాదేవి పరమాత్మయొక్క ప్రేమానంద శక్తి. అందుకు రాధాదేవి ఉపాసన అత్యంత శుద్ధము. పైగా శుద్ధమైన మనస్సు గల వారు మాత్రమే రాదాదేవిని అర్థం చేసుకోగలరు. ఈ రాధాదేవి అమ్మవారియొక్క పూర్ణ రూపంగా చెప్పబడుతున్నది. లలితా సహస్రంలో కూడా “ఆబాల గోప విదితా”, “ప్రేమ రూపా ప్రియంకరీ” అని చెప్పబడుతున్న నామములు రాధాదేవి నామములే అని విజ్ఞులు వ్యాఖ్యానిస్తారు. ఈ రాధాదేవి గోలోకంలో కృష్ణ పరమాత్మతో ఉంటుంది. గోలోకం అనే శాశ్వత లోకం ఒకటి ఉంది. అక్కడ శ్రీకృష్ణుడు విబుదుడై వేణునాద లోలుడై ఉంటాడు. అది కేవలం ఆనంద ధామం, పరమానంద ధామం. అక్కడ ఆయన శక్తి ప్రేమానంద రూపిణియైన హ్లాదినీ శక్తి రాధాదేవి. హ్లాదము అంటేనే ఆనందము అని అర్థం. హ్లాదినీ, సంధినీ ఇత్యాది శక్తులతో పరమాత్మ లోకాన్ని నడుపుతూ ఉంటాడు. వీటిలో హ్లాదిని ఆనంద శక్తి. సంధినీ ఇత్యాది శక్తులు లోక వ్యవహారాన్ని నడిపే శక్తులు. ఇటువంటి ఆనంద శక్తి అయిన రాదాదేవిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి పరమాత్మ యందు ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ వల్ల పరమాత్మ ఆనందం లభిస్తుంది. ఆ ఆనందమే సచ్చిదానందము, బ్రహ్మానందము. ఆ బ్రహ్మానంద స్వరూపిణి రాధాదేవి.
ఈ రాధాదేవి దర్శనం కోసం బ్రహ్మదేవుడు ఆరువేల సంవత్సరములు తపస్సు చేస్తే రాధాదేవి కాలి కొనగోరును చూడగలిగాడట. అంటే అర్థం రాధాదేవి దర్శనం అంత తేలిక కాదు అని చెప్పడం దీనిలోని విశేషం. పైగా అమ్మవారి దర్శనం కాలేదు అని దుఃఖపడితే అప్పుడు కృష్ణ పరమాత్మ బృందావనంలో నేను అవతరిస్తాను, అప్పుడు రాధాదేవి కూడా అవతరిస్తుంది అప్పుడు నీవు చూడవచ్చులే అని చెప్తాడు. ఆవిధంగా స్వామి కృష్ణుడై భూమియందు అవతరించినప్పుడు బృందావన సీమను ఎంచుకున్నాడు. నిజానికి బృందావనంలో సూక్ష్మమైన తేజోరూపంగా కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడుట. కానీ ద్వాపర యుగాంతంలో అవతార మూర్తిగా ప్రకటింపబడ్డాడు. అప్పుడు అమ్మవారు రాధాదేవి కూడా అవతరించింది. కృష్ణ పరమాత్మ యశోదానందుల పుత్రుడిగా ఆయన ఉంటే ఈ రాధాదేవి ఒక అయోనిజగా అవతరించింది.

వృషభానుడు అనే గోపరాజుకి అనేక జన్మల తపస్సుకు ఫలితంగా అమ్మవారు ఒక పద్మమునందు ఆవిర్భవించి గోచరించారు. వృషభానుడు పరసానుపురమునకు రాజు. ఆ పరసానుపురమే నేటికీ బృందావనంలో బర్సానాధాం అని చెప్పబడుతున్నది. బ్రహ్మగిరి అని పర్వతమది. ఆ పర్వతాన్ని ఆధారం చేసుకొని ఈ పరసానుపురం ఉన్నది. దానికి గోపరాజుగా ఉన్నటువంటి వాడు వృష భానుడు. ఆయన కుమార్తెగా ఈవిడ లభించింది. ఎలాగైతే సీతాదేవి అయోనిజగా జనక మహీపతికి లభించిందో అదేవిధంగా రాధాదేవి లభించింది. అలా లభించిన రాధాదేవి కృష్ణ పరమాత్మను ఉపాసన చేస్తున్న ప్రేమానంద శక్తి. రాధాకృష్ణుల దివ్యమైన అనుబంధం లౌకికమైనది కాదు. లౌకికమైన ధర్మము కానీ, అధర్మము కానీ రెండూ అక్కడ కనిపించవు. లౌకికమైన ద్వంద్వములేవీ లేవక్కడ. అదొక పరమ పావనమైన నిర్మలమైన అత్యంత శుద్ధమైన సచ్చిదానంద స్థితి. రాధాదేవి, కృష్ణుడు అవిభాజ్య తత్త్వము. అందుకే కృష్ణ రాధా తత్త్వములు ఎటువంటివి అంటే “చంద్ర చంద్రికయోరివా” అని వర్ణిస్తున్నది బ్రహ్మ వైవర్త పురాణం, పద్మపురాణం మొదలైనవి. రాధాదేవి తత్త్వం సామవేదం, ఋగ్వేదంలో కూడా చెప్పబడుతున్నది. “దేవం-దేవం రాధసే చోదయన్త్య్” అని. ఈ రాధాదేవి చంద్ర చంద్రికయోరివా అంటే చంద్రునికీ, వెన్నెలకీ ఎలాంటి అనుబంధమో కృష్ణునికీ రాధకీ అలాంటి అనుబంధం అని చెప్పారు. దీని భావం వారిద్దరూ అవిభాజ్య తత్త్వము. కృష్ణుని ప్రేమశక్తి, ఆనందశక్తి యే రాధ. కృష్ణుని యొక్క ప్రేమ అంటే మనపై అది కరుణగా వర్షిస్తుంది. కృష్ణుడికి మనపై ఉన్న ప్రేమ, మనకి కృష్ణుడి పై ఉన్న ప్రేమే రాదాశక్తి. జీవుడికి కృష్ణుడి పై ప్రేమ ఉంటే దానికి భక్తి అని పేరు. కృష్ణుడికి జీవుడిపై ప్రేమ ఉంటే దానికి దయ అని పేరు. అందుకు కృష్ణుడిలో దయగానూ, భక్తుడిలో భక్తిగానూ ఉన్నది రాధాదేవి. రాధాదేవి దయలేకపోతే కృష్ణుడి దయ దొరకదు అన్నారు. అంటే భక్తి అనేది ఉంటేగానీ భగవంతుడు దొరకడు. ఆ భక్తి అనే ప్రేమ అందరికీ లభించదు. “ప్రకాశ్యతే క్వాపి పాత్రే” అని నారదుల వారు చెప్తారు. భక్తి, శుద్ధమైన భగవత్ప్రేమ అంత తేలికగా దొరకదు. ఆ ప్రేమ స్వరూపిణి రాధాదేవి. ఆ రాదాదేవిని కార్తిక పూర్ణిమ నాడు కృష్ణ పరమాత్మ ఆరాధించాడు. కృష్ణ పరమాత్మను ఆమె ఆరాధిస్తుంది. అందుకే ఆరాధనా శక్తియే రాధ. ఈ రాధాదేవి ఉపాసన చేస్తే “రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తితా” అని దేవీభాగవతం చెప్తోంది. కార్తిక పూర్ణిమనాడు రాదాదేవిని ప్రత్యేకించి ఆరాధించాలి. దీనికి అనేక తంత్ర శాస్త్రాలలో ఉపాసనా పధ్ధతి ఉన్నది. రాధాదేవి సహస్రం ఉన్నది, రాధాదేవి మంత్రమున్నది, రాధాదేవి స్తోత్రమున్నది.
కార్తిక పూర్ణిమ నాడు సుయజ్ఞుడు అనే మహానుభావుడు రాధాకృష్ణుల ఉపాసన చేసాడు అని శాస్త్రం చెప్తున్నది. రాధాదేవి ఉపాసన చేస్తే సర్వమైన వాంఛలూ తీరుతాయిట. అంటే అన్ని అభీష్టములూ నెరవేరుతాయి అన్నారు. అన్ని అభీష్టములు నెరవేరడం అంటే అర్థం అసలు ఏకోరికా లేని పరిపూర్ణ స్థితి వస్తుందని దీనియొక్క భావం. అలాంటి రాదాదేవిని కార్తిక పూర్ణిమ నాడు ఆరాధన చేయాలి.

దీనితో పాటు ఇతరములైన వ్రతములు చేసేవారు కార్తిక పూర్ణిమ నాడు ముఖ్యంగా చేయవలసినడి బ్రాహ్మీముహూర్తంలో స్నానం, – నదీ స్నానం కానీ, సముద్రస్నానం కానీ శ్రేష్థము.

రెండవది జపము. మూడవది దానము, నాల్గవది దీపోత్సవము, అయిదవది ఉపవాసము. ఈ అయిదూ చేయవచ్చు . లేదా ఏది సాధ్యమైతే అది. కార్తిక దీపం అంటాం కనుక కార్తిక పూర్ణిమ నాడు వీలైనన్ని ఎక్కువ దీపాలు వెలిగించాలి. నిజానికి దీపావళి అని చెప్పబడే ఆశ్వయుజ అమావాస్య పితృ దీపావళి. ఈ కార్తిక పూర్ణిమ దేవ దీపావళి. ఈరోజునే జగడంబయైన లలితా దేవిని కూడా చంద్రమండలంలో భావన చేస్తూ క్షీరము నివేదన చేసి లలితా సహస్ర పారాయణం చేసిన అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెప్తున్నది. ఈ కార్తిక పూర్ణిమ శివునకు, విష్ణువునకు, శక్తికీ కూడా ప్రీతిపాత్రమైనది. వారి వారి దేవతారాధనలను పరిపూర్ణం చేసుకోగలిగిన ఈ కార్తిక పూర్ణిమ నాడు ఆ దామోదరుడైన రాదా సమేతుడైన కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ సర్వమ్ కార్తిక దామోదరార్పణమస్తు.

శరత్పూర్ణిమ ఆధ్యాత్మిక, యోగ సాధనాలకు విశేషమైనది. ధ్యానం, అర్చన మొదలైనవి ఈరోజున అద్భుత ఫలాలనిస్తాయి. ఈ పూర్ణిమనాడు విశేషంగా దీపాలు వెలిగించడం ప్రత్యేకత. దీనిని ‘దేవ దీపావళి’ అంటారు. ఆశ్వయుజ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ – ఈ రెండూ శరత్పూర్ణిమలు. ఈ పూర్ణిమనాడే రాసలీలా మహోత్సవం జరిగింది.

యోగ శుద్ధులైన జీవులు గోపికలు. వారిని పరమాత్ముడు అనుగ్రహించిన మోక్షప్రదాన లీల రాసలీల. ఈ పూర్ణిమ నాడు దేవీ ఆరాధన కూడా ముఖ్యమైనది. సహస్రార చంద్ర కళా స్వరూపిణి అయిన లలితా మహా త్రిపుర సుందరిని ఈ పర్వాన ఆరాధించాలి. కృత్తికా నక్షత్రం నాడు పూర్ణిమ ఏర్పడే మాసం కార్తీకం.
కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్నియందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆరాధించడమే యజ్ఞం. అందుకే వేదాలలో ‘నక్షత్రేష్టి’ అనేది -కృత్తికా నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. ఆ యజ్న తత్త్వానికి సంకేతంగానే ‘దీపారాధన’ అనేది కార్తికంలో ప్రదానమయ్యింది.
కృత్తికా నక్షత్ర జాతకుడైన యజ్ఞాగ్ని స్వరూపుడు సుబ్రహ్మణ్యుని ఆరాధనకు కూడా ఈ మాసం ప్రత్యేకం. ‘కుమారదర్శనం’ పేరుతొ కార్తిక పూర్ణిమను వ్యవహరిస్తారు.

Write Your Comment