తీర్దాలు-మిగిలిన గుడులు త్రిపురాంతకం అష్ట భైరవ పరి వేష్టితం. కుమార గిరికి దక్షణాన భైరవ గిరి సిద్ధులకు సిద్ధి క్షేత్రం. పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది. తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు. పడమరలో శ్రీ రామ నాదేశ్వరుడు మిక్కిలి పూజ నీయుడు. ఉత్తరాన ఉన్న కొండడను పూల కొండ అంటారు. ఇక్కడే తారకాసురుడు పూజించిన శివ లింగం ఉంది. ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట. దక్షిణాన కొండమీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది. దీనికి దిగువన ఓషధీ సమన్విత సోమ తీర్ధం ఉంది. ఇది సర్వ రోగ నివారిణి. తూర్పున పంచ బ్రాహ్మలు ప్రతిష్టించిన పంచ లింగాలున్నాయి. వాయవ్యం లో లింగాల కొండ ఉంది. ఇక్కడ వెయ్యి నూట ఒక్క లింగాలు ఉన్నాయట. ఇక్కడ అజ్ఞాతం గా మునులు తపస్సు చేస్తూ ఉంటారట. ఇకడే దివ్యౌ షది’’సంజీవిని ‘’ఉన్నాడని జ్ఞానులు చెబుతారు.
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం చిదగ్ని కుండ సంభూత కుమార గిరికి దగ్గరలోఒకప్పటి చెరువు లో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం లో ప్రతిదీ విశేషమైనదే. ఆలయ గోపుర గర్భ గుడిపై నిర్మాణ శైలి వైవిధ్యం తో ఉంటుంది. గర్భ గుడిమీద రాజ గోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత. ’’త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరీ’’ అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే. అమ్మవారు నిర్గుణ శిలా కారం గా ఆవిర్భవించింది. ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసున్దరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం. దీన్ని స్థానికులు ‘’నడబావి ‘’అంటారు. అమ్మవారు ఉత్తరాభి ముఖం గా దర్శన మిస్తుంది. చిదగ్నిగుండం లోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి. ఒక్కో మెట్టూ ఒక్కో ఆవరణ. అదే నవావరణం లో బాలాత్రిపురసుందరి ఉంటుందన్న మాట. ఈ మెట్లకు అధిదేవతా ప్రత్యది దేవతలుంటారు. తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండం లో నిర్గుణ శిలకార రూపం లో అమ్మవారు కనిపిస్తుంది. దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్ష మాలా వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది. సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహానికి వెనక ఉన్న శిలమధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్టితమై ఉంది. విగ్రహానికి వేనక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు. అమ్మవారిపై శ్రీ గాడేపల్లి రాఘవ శాస్త్రి గారు – ‘’నూటోక్క శక్తు లెప్పుడు –నాటక మటు లాడు చుండ,నాయక మణియై కూటంబు నేర్పు త్రిపురక –వాటము జొర నంత వాని వశమగు ధాత్రిన్ ‘’అని పద్యం చెప్పారు.
సిద్ధి మండపాలు చిదగ్ని కుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి. వాటినే ‘’సిద్ధి మండపాలు ‘’అంటారు. ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు. శ్రీ వావిలాల మహాదేవయ్య గారు ,శ్రీ గోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుస్టానం చేసేవారట.
శ్రీ చక్ర పాదుకలు మెట్లు దాటి బయటికి వస్తే శ్రీ చక్ర మండపం కనిపిస్తుంది. ఇక్కడే శ్రీ చక్ర పాదుకలున్నాయి. అర్చనలన్నీ వీటీకే చేస్తారు. అందరూ వీటిని పూజించ వచ్చు. ఈ చక్ర పాదుకలకు ,చిదగ్ని కుండ దేవికి తంత్ర సంబంధ అను సంధానం ఉంది. ధనం కా వాలంటే ఎరుపు రంగు విద్య కావాలంటే తెలుపు ,శత్రు జయం కలగాలంటే నల్లని స్వరూపం తో అమ్మవారిని ధ్యానించాలి. ఈ పాదుకల వెనుక సిద్దేశ్వర పాదుకలుంటాయి. వీటిని ‘’గురుపాదాలు ‘’అంటారు. శ్రీ విద్యా సాంప్రదాయం లో వీటి ప్రాధాన్యం ఎక్కువ. గురుపాదుకలకు ప్రక్కనే బ్రాహ్మీ లిపి లో ‘’గురుపాదకా మంత్రం ఉంది’’. చక్ర మండలం నైరుతి భాగం లో శ్రీ దక్షిణా మూర్తి లింగం ఉంది .స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు.
ఛిన్నమస్తా దేవి చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే ‘’చిన్న మస్తా దేవి’’చిన్న మండపం లో కనిపిస్తుంది. ఈమెనే ప్రచండ చండిక అని ,వజ్ర వైరోచని అని అంటారు. ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమె దశ మహా విద్యలలో ఆరవ మహా విద్య. ఈమెను ఉపాశిస్తే కలిగే ఫలితం ‘’యామళం’’అనే గ్రంధం వివరించింది. ఆలయం బయట చతుషష్టియోగినీ మూర్తులు దర్శన మిస్తారు. ఇవి ఇప్పుడు నిజంగా చిన్న మస్తకాలై రూపు చెడి గోడలకు నిలబెట్ట బడి ఉన్నాయి.
రక్త పాత్రలు సాధారణం గా శక్తి ఆలయాలలో సింహ వాహనం ధ్వజస్తంభం ఉండాలి. ఈ రెండు ఇక్కడ లేవు. కనుక అమ్మవారు మానవ ప్రతిష్టితం కాదని , స్వయంభు అని భావిస్తారు. వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత. ’’సవ్యాప సవ్య మార్గస్థా’’. ఒక్కప్పుడు ఈ ఆలయం లో ‘’పంచ మకారార్చన’’జరిగేది. అందుకే గర్భాలయం లో రాతి తో చేయబడిన ‘’రక్త పాత్ర ‘’ఉంది. దీనికి ‘’ఉగ్రపాత్ర ‘’అనే పేరుకూడా ఉంది. ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు ,రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఎన్ని దున్నల్ని బలిచ్చినా ,ఒక్కో పొతూరక్తానికి కడివెడు నీళ్ళు పోసినా ఆ రక్త పాత్ర నిండదు. ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే ఈశాన్యం లో మామూలు భక్తులు వేరొక రక్త పాత్ర ఉన్నది. దానికి రెండు అడుగుల దూరం లో బలిని ఇచ్చే ‘’యూప స్థంభం ‘’కూడా ఉంది. దీనిపై సంస్కృత శాసనం ఉంది. శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు.
దీన్ని ఒక కవి పద్యం లో ‘’మదపు టేనుగు నైన ,కొదమ సింగం బైన –యూప శిలకు దా,సమీప మంద – మెడ యెసంగి నిలుచు మేకపోతులు దున్న –లేమి చెప్ప జూతు నామే మ్రోల ‘’ వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని ‘’దేవతాగ్రణీ’’ అని స్తుతించారు స్కాంద పురాణం శ్రీశైల ఖండం లో- ‘’గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం –త్రైలోక్య జననీ సాక్షాత్ త్రిపురా దేవతాగ్రణీ దృష్ట్వా ప్రయత్నతో దేవీ మర్చయిత్వా సమంత్రకం ‘’