తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు 2018

టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అక్టోబరు 9 నుండి 11వ తేదీ, 2018 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 8వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 9న పవిత్రప్రతిష్ఠ, స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రెండో రోజు అక్టోబరు 10న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు అక్టోబరు 11న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, స్నపనతిరుమంజనంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. అదేరోజు సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment