‘తిరుపతి శ్రీవేంకటేశ్వర’, ‘శ్రీవేంకటేశ్వర స్తోత్రవనమాల’, ‘ఉదంకోపాఖ్యానం’, ‘హంసకాకీయోపాఖ్యానం’ ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం సింహ వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ ఆంజనేయులు, ఉప సంపాదకులు డా|| నొస్సం నరసింహాచార్య ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి ఇంగ్లీషులో రచించిన ”తిరుపతి శ్రీవేంకటేశ్వర” గ్రంథాన్ని డా.ఎస్‌.లక్ష్మణమూర్తి, డా.సి.సుబ్బారావ్‌, డా.టి.విశ్వనాథరావ్‌ కలిసి తెలుగులోకి అనువదించారు. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఎందరో చక్రవర్తులు, రాజులు, సామంతులు ఎన్నో విధాలుగా సేవించుకున్నారు. దేవాలయ ప్రారంభ చరిత్రకు సంబంధించి లిఖితపూర్వక ఆధారాలు లభ్యంకాకపోయినా, జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొందిన గాథలు శిలాశాసనాల ద్వారా లభిస్తున్న సాక్ష్యాధారాలు విలువైన సమాచారాన్ని తెలుపుతున్నాయి. దేవస్థాన శాసనాధ్యయన నిపుణుడైన శ్రీ సాధుసుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన ఈ గ్రంథం 1981లో ముద్రితమైంది.

”శ్రీవేంకటేశ్వర స్తోత్రవనమాల” గ్రంథాన్ని డా|| కె.వి.రాఘవాచార్య రచించారు. సప్తగిరీశుడైన శ్రీనివాసుడు ఎంతటి భక్తవత్సలుడో అంతటి స్తోత్ర ప్రియుడు కూడా. ఆ దేవదేవుని మానవమాత్రులే కాక దేవతలు, మునులు, చక్రవర్తులు సైతం స్తుతిస్తూ అనేక స్తోత్రాలను చేశారు. కాగా ఈ స్తోత్రాలన్నీ వివిధ పురాణాలలో ఉండే వేంకటాచల మాహాత్మ్యంలో ఉన్నాయి. వేంకటాచల మాహాత్మ్యంలో వివిధ స్తోత్రాలను వెతుక్కొనే అవసరం లేకుండా అన్నిటినీ ఒకచోట కూర్చి తెలుగు వివరణచేర్చి వేంకటేశ్వర స్తోత్ర వనమాల పేరుతో అందిస్తున్నారు. ఇందులో శ్రీహరి దశావతార మహిమలు, కలియుగంలో శ్రీమన్నారాయణుని అర్చావతారమైన శ్రీనివాసుని దివ్యలీలావైభవం ఉన్నాయి. ఈ స్తోత్ర కర్తలలో బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు, శుక, అగస్త్య, మార్కండేయాది మహర్షులు, తొండమానుడు, దేవశర్మ, కుమ్మరి భీముడు తదితర ఎందరో భక్తులు ఉన్నారు.

”ఉదంకోపాఖ్యానం”(భారత ఉపాఖ్యాన గ్రంథమాల) మహాభారతంలోని ఆదిపర్వంలోనిది. ఈ ఉపాఖ్యానానికి డా||దివాకర్ల వేంకటావధాని వ్యాఖ్యానాన్ని అందించగా డా||ఆశావాది ప్రకాశరావు పీఠికను సంతరించారు. అంతో ఇంతో భాషాజ్ఞానం ఉండి కవితపై ఆసక్తి కలిగి గురుశిష్యుల ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించేవారికి ఈ ఉదంకోపాఖ్యానం చక్కగా ఉపయోగపడుతుంది. పైల మహర్షి శిష్యుడు ఉదంకుడ. అతడు గురు దక్షిణగా గురుపత్నికి పౌష్యుడనే మహారాజు భార్యయొక్క కుండలాలలను తెచ్చివ్వడం ఆ మధ్యలో జరిగే కొన్ని సంఘటనలు ఇందులోని కథాంశం.

మహాభారతంలోని కర్ణపర్వంలోని ”హంసకాకీయోపాఖ్యానం” అనే ఈ ఉపాఖ్యానానికి డా||ఎస్‌.వి.రామారావు వ్యాఖ్యానాన్ని అందించగా డా||కె.జె.కృష్ణమూర్తి పీఠికను సంతరించారు. ఈ ఘట్టంలో హంస, కాకి ఈ రెండు పక్షులు ప్రధానపాత్రలు. వైశ్యశ్రేష్ఠుని ఇంట ఎంగిలి మెతుకులు తిని కొవ్వుపట్టి గర్వించిన కాకి తన శక్తి తెలుసుకోలేక వైష్యుని కుమారుల మాటలకు ఉబ్బిపోయి హంసతో ఆకాశయానంలో పోటీపడి ఓటమిపాలై చివరకు హంసచేతనే రక్షింపబడడం ఇందులోని కథాంశం.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment