శివలింగ పుష్పార్చన ఫలితాలు

శివుడికి పలురకాల పుష్పాలతో పూజలు చేయడం కనిపిస్తుంది. ఈ పుష్పాలలో సంపెంగ, మొగలి పువ్వులకు మాత్రం స్థానం లేదు. శివలింగాలకు లక్షపుష్పార్చన చేస్తే వచ్చే ఫలితాలను గురించి కూడా రుద్రసంహిత వివరిస్తోంది. శివారాధనకు పద్మాలు, మారేడు దళాలు, శంఖపుష్పాలు శ్రేష్ఠమైనవిగా చెబుతారు. ఈ పుష్పాలను లక్షవంతున తెచ్చి శివపూజ చేస్తే సంపదలు ప్రాప్తిస్తాయని రుద్రసంహిత చెబుతోంది.

పరపతి రావాలనుకున్నవాడు పశుపతిని యాభైవేల పూలతో పూజించవచ్చు. అకారణంగా నిందలపాలై చెరసాలలో పడ్డవాడు లక్షపుష్పార్చన చేస్తే మేలంటోంది ఈ పురాణం. రోగగ్రస్తుడు ఆరోగ్యం కోసం, వరుడు వధువుకోసం, విద్యార్థి విద్యాభివృద్ధి కోసం, వాక్శుద్ధి కోసం శివుడిని యాభైతొమ్మిదివేల పుష్పాలతో పూజించవచ్చు. పుత్రార్థి ఉమ్మెత్తపూలతోను, కీర్తి కావాలనుకున్నవాడు అవిశె పూలతోను, భుక్తి, ముక్తి కావాలనుకున్నవాడు తులసీదళాలతోను, ప్రతాపం కోరేవాడు జిల్లేడు పూలతోను, చిన్నకలువలతోను, శత్రుసంహారం కోరేవాడు దిరెశన పూలతోను, రోగవిమోచనానికి కరవీర పుష్పాలతోను, ఆభరణాల కోసం మంకెనపూలతోను, వాహనప్రాప్తి కోసం జాజిపూలతోను శివలింగార్చన చేస్తుంటారు.

విష్ణుప్రీతిని కోరేవాడు శివలింగాన్ని లక్ష నల్ల అవిశెపూలతోను, ముక్తిని కోరేవాడు జమ్మి ఆకులతోను, ఉత్తమురాలైన భార్య కావాలనుకున్నవాడు మల్లెపూలతోను అర్చించవచ్చు. గృహశాంతి వర్థిల్లేందుకు అడవిమల్లెలు, పెద్ద గోరింట పువ్వులు, కోరికలు తీరడానికి మారేడు పత్రితోను శివలింగార్చన చేయడం కనిపిస్తుంది. ఉమ్మెత్తపూల విషయంలో ఎర్రటికాడ కలిగిన ఉమ్మెత్త పూవులైతేనే శివపూజకు మంచిది. లక్షబియ్యపు గింజలతో శివలింగాన్ని అర్చిస్తే ఆ వ్యక్తి ఇంట సంపదలు వృద్ధి చెందుతాయి. దీనికోసం ప్రతి బియ్యపు గింజను లెక్కించనవరంలేదు. ఆరున్నర మానికెల మీద ఆరుతులాల బియ్యం అయితే లక్షబియ్యపు గింజలవుతాయి. అయితే… కొలిచే ఆ బియ్యపు గింజలు విరిగిపోయినవి, నూకలు నూకలుగా ఉండేవి మాత్రం కాకూడదు.

లక్ష నువ్వుల పూజ పాపహరమని చెబుతారు. లక్ష యవలతో పూజిస్తే సర్వసుఖప్రాప్తి అంటారు. ఎనిమిదిన్నర మానికెల మీద ఆరుతులాలైతే లక్షయవలవుతాయి. ఎనిమిది మానికెల గోధుమలు లక్షసంఖ్యలో ఉంటాయి. గోధుమలతో చేసే అర్చన సంతానప్రాప్తి ప్రదమని శివపురాణం చెబుతోంది. పెసలు, కందులు, ఆవాలు, మిరియాలు లాంటివాటిని కూడా శివార్చనకు వినియోగిస్తారు. ఈ పూలు, ధాన్యాలు అన్నీ కథాపరంగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలాన్ని ఇచ్చేవిధంగా కనిపిస్తున్నా వీటివెనుక ఉన్న సామాజిక నేపథ్యం మాత్రం తనకు దేవుడు ప్రసాదించినదాన్ని మళ్ళీ భక్తితో ఆయనకు నివేదించి కృతజ్ఞతలు తెలుపుకోవడమేనని పెద్దలు చెబుతారు.

Write Your Comment