శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగమును వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్లీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగ శ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది.
పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు.
సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.
రాజు – చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.
మంత్రి – సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.
సేనాధిపతి – సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
సస్యాధిపతి – సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
ఉగాదినాడు పంచాంగ శ్రవణం లో బోలెడంత పరమార్థముంది. ఇది మన ఖగోళ శాస్త్రీయ దృక్కోణానికి అద్దంపట్టే సంప్రదాయం. ఎందుకంటే ఖగోళ స్థితిగతులను అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారు. ఇందులో ఐదు అంగాలుంటాయి.
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంలను పంచాంగం అంటారు. చంద్రుని నడకకు సంబంధించినది తిథి.
వారంలోని ప్రతిరోజునీ ఒక గ్రహానికి అధిదేవతగా భావించి ఆరోజును ఆ గ్రహం పేరుతో పిలుస్తారు.
రాశిచక్రంలోని 27 నక్షత్రాల్లో ఏ రోజున ఏ నక్షత్రం దగ్గరకు చంద్రుడు వస్తే ఆ రోజు ఆ నక్షత్రం ఉన్నట్లు చెబుతారు.
నక్షత్రరాశిలో సూర్యచంద్రులు ఉన్నట్లు భావించి యోగం లెక్కగడతారు. ఇక తిథిలో అర్ధభాగం కరణం. ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టే భవిష్యత్తు గురించి ముందే తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ఈ ఏడాది వాతావరణం ఎలా ఉండబోతుందీ ఏయే పంటలు వేస్తే మంచిదీ వంటి విషయాలన్నీ రైతులు తెలుసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో సాగుపనులనూ ఈరోజే లాంఛనంగా మొదలుపెడతారు.