Telugu – Ksheerabdhi Dwadashi Vratha Mahatmyam

Ksheerabdhi Dwadashi Vratha Mahatmyam explains the story and significance of Ksheerabdhi Dwadashi Vratham in Telugu…

క్షీరాబ్ది ద్వాదశీ మాహాత్మ్యాన్ని భాగవత గాధ అయిన అంబరీషుని కథ సుధామయంగా తేటతెల్లం చేస్తుంది. సప్తద్వీపాల భూభారాన్ని అత్యంత భక్తి సామర్ధ్యాలతో పాలిస్తూ, దానివల్ల ప్రాప్తించిన సిరిసంపదలకు ఏమాత్రం పొంగిపోక, కేవలం విష్ణు పాదాచర్చనమే శాశ్వతమని భావించే చక్రవర్తి అంబరీషుడు. ద్వాదశీ వ్రతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో ఆచరించిన అంబరీషుడు, వ్రతాంతాన కాళిందీ నదీజలంలో పుణ్యస్నానం చేసి, మధువనంలో మహాభిషేకవిధాన శ్రీహరికి అభిషేకాన్ని మహిమాన్వితంగా నిర్వహించాడు. తరువాత లోకోపకరమైన సాలవర్ష ప్రవాహాలను కురిపించే మహిమాన్వితమైన ఆరువేల కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడు. అనేక బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం పెట్టించి, తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతూ ఉండగా చతుర్వేదాలను విశ్లేషించగల ధీశాలి, అమిత తపస్సంపన్నుడూ అయిన దూర్వాస మహాముని ఆ ప్రాంతానికి విచ్చేశాడు.

దివ్యమైన ఆ సమయంలో దూర్వాసుని రాకను అతి పవిత్రంగా, ఆనందకరంగా భావించిన అంబరీషుడు ఆ మహామునిని భోజనం చేయమని అర్థించాడు. మహర్షి కాళిందిలో స్నానం చేసి వస్తానని అంబరీషుడికి చెప్పి శిష్యబృందంతో స్నానానికి వెళాడు. నదిలో స్నానం చేస్తూ పరవశంతో పరధ్యానంలో మునిగాడు దూర్వాసుడు. ద్వాదశి ఘడియలలో భుజిస్తే గాని వ్రత ఫలం దక్కదు కాబట్టి విచ్చేసిన బ్రాహ్మణులతో, పండితులతో అంబరీషుడు మంచిచెడులను సమాలోచించాడు. “విబుధులారా! దూర్వాసుడు నా అతిథి. అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం. మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి, శాపానికి గురి అవుతాను. అయితే, ద్వాదశ ఘడియలలో నేను పారణం చేయకపోతే, వ్రతఫలం దక్కదు, విష్ణుదేవుని కృపావృష్టి నాపై వర్షించదు. బ్రాహ్మణ శాపం కంటే విష్ణుదేవుని కృప ముఖ్యం కాబట్టి నేను ద్వాదశ ఘడియలలో నేను శుద్ధ జలాన్ని సేవిస్తే ఉపవాస దీక్ష ముగించినట్లవుతుంది. భోజనం చేయకుండా వేచి ఉంటాను కాబట్టి పూజ్యనీయుడైన అతిథినీ గౌరవించినట్లవుతుంది. ఒకవేళ, అప్పటికీ ఆగ్రహించి మహర్షి శపిస్తే, అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తాను” అని వారితో చెప్పి తన మనస్సులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి, కేవలం జలాన్ని సేవించి, దూర్వాస మహాముని రాకకోసం ఎదురు చూస్తున్నాడు.

దూర్వాసుని శాపం
ఇంతలో నదీస్నానం ముగించి వచ్చిన దూర్వాసుడు జరిగింది దివ్యదృష్టితో గ్రహించి రాజు చేసిన కార్యం మహాపరాధంగా, తనకు జరిగిన ఘోరమైన అవమానంగా భావించి కోపోద్రిక్తుడై, తన కళ్ల నుంచి నిప్పులు రాల్చే విధంగా అంబరీషుని చూస్తూ, తన జటాజూటం నుంచి ఒక కృత్య(దుష్టశక్తి)ని సృష్టించి అతనిపై ప్రయోగించాడు. ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును ప్రార్ధించగా భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువు దుష్టరాక్షసులకు మృత్యుసూచకమైన ధూమకేతువు, ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు. వక్రమైన రాక్షసులను వక్కళించే ఆ సుదర్శన చక్రం ప్రళయకాల అగ్నిహోత్రంలా ఆవిర్భవించి క్షణాలలో దూర్వాసుడు సృష్టించిన కృత్యను దహించివేసి, దురహంకారియైన దూర్వాసుని వెంబడించింది. ముల్లోకాలలోనూ దూర్వాసుని వెంబడించిన సుదర్శన చక్ర ప్రతాప జ్వాలల నుంచి దూర్వాసుని రక్షించటం ఎవరి తరం కాలేదు. ఆ మహర్షి తనకు రక్షనిమ్మని విధాతయైన బ్రహ్మను ప్రార్ధించగా అతనితో బ్రహ్మ “మునివర్యా! నీవు దుర్దాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం జగద్రక్షకుడైన విష్ణుమూర్తికే అది సాధ్యం.

అతనినే శరణువేడటం శ్రేయస్కరం” అని చెప్పగా శ్రీ మహావిష్ణువు చెంతకు చేరి దూర్వాసుడు ‘ఓ భక్తవరదా! దయాసింధూ! నీ యొక్క చక్రాగ్ని జ్వాలల నుండి నన్ను రక్షించు ప్రభూ” అని వేడగా అతనితో కేశవుడు ” ఓ మునిసత్తమా! నేను భక్తులకు సదా దాసుడను. తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు తమ హృదయాలలో బంధించి ఉంచుతారు. భక్తుల నిష్ఠలు చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. నిన్ను ఈ సమయాన రక్షించగలిగిన వ్యక్తి భక్త శ్రేష్ఠుడైన అంబరీషుడు మాత్రమే” అనగా తిరిగి అంబరీషుని చెంతకు వెళ్లాడు దూర్వాసుడు. “ఓ రాజా! ప్రశస్తమైన క్షీరాబ్ధి ద్వాదశి దీక్షలో ఉన్న నిఉన్న అమితంగా బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నన్ను మన్నించు రాజేంద్రా” అనగానే వినయ సంపన్నుడైన అంబరీషుడు “తపోధనా! ఈ రోజు జరిగినవన్నీ భగవత్సంకల్ప యుతాలు, ఆ జగన్నాటక సూత్రధారుని కల్పితాలు”అని సుదర్శన చక్రమును స్తుతించగా, తిరిగి చక్రము తన ఆగ్రహ జ్వాలను తగ్గించుకొని శ్రీహరి సన్నిధికి చేరింది. అంబరీషుడు పెట్టిన మృష్టాన్న భోజనాన్ని ఆరగించిన దూర్వాసముని సంతుష్టుడై “ఓ రాజా! ఈ రోజు లోకాలన్నిటికీ నీ భక్తి యొక్క గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి పుణ్య తిధి నాడు నీ కథా శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుజ్యాన్ని పొందెదరు గాక” అని అనుగ్రహించినట్లు మహాభాగవతంలో చెప్పబడింది.

ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పరమ పవిత్రమైన తిధియై భూలోకంలో జనులను పునీతులను చేస్తోంది. కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితాన్ని సమకూరుస్తుంది. ఆ కార్తీక పౌర్ణమి కంటే బహుళ ఏకాదశి కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తుందనేది ఆర్యోక్తి. బహుళ ఏకాదశి కంటే క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన ఫలాన్ని, పుణ్యాన్ని ఇస్తుందనేది భాగవత వచనం. మాసాలలో అగ్రగణ్యమైన కార్తీక మాసం అతులిత మహిమల వారాశి! కార్తీక మాసాన వచ్చే పవిత్ర తిధులలో అగణిత పుణ్యరాశి క్షీరాబ్ది ద్వాదశి!

Write Your Comment