Sitashtami Mahatmyam (Telugu)

Sitashtami Mahatmyam is explained in Telugu here. Sita Ashtami is the birthday of Goddess Sita Mata..

సీతాష్ఠమి-నాగలి చాలులో జనకమహారాజునకు సీతమ్మ వారు కనిపించిన రోజు

జనకుడు యజ్ఞం కొరకు క్షేత్రాన్ని దున్నటం ప్రారంభించాడు. యజ్ఞం మొదలు పెట్టిన వెంటనే నాగలి చాలులో ఒక పాప లభించింది. నాగలి చాలుని సీత అని అంటారు. ఆ భూదేవి సంతానమైన ఆ పాపకు సీత అని నామకరణం చేసి, తన కుమార్తెగా పెంచాడు.అలా నాగలి చాలులో జనకమహారాజునకు సీతమ్మ వారు కనిపించిన రోజు ఈ రోజేనని ఉత్తరభారత దేశ పంచంగాదుల వల్ల తెలుస్తుంది.కనుకనే ఈ రోజుని సీతాష్ఠమి అని అంటారు.

రామాయణము సీతాయాశ్చరితం మహత్

శ్రీమద్రామాయణం ఆది కావ్యం. అనాది ఆది యైన పురుషోత్తముని దివ్యగానం. నాన్యతో దర్శనీయమైన అపురూప పాత్రల అపూర్వ సంయోజనం రామాయణం. ఇది రామస్య> అయనం రామాయణం. అయనం అనగా గమనము లేక ప్రయాణము. రాముని యొక్క జీవన గమనాన్ని తెలిపేది కాబట్టి రామాయణం అయ్యింది . దీనిలోనే సీతాయనం కూడా ఉంది. సీతాయా :అయనం సీతాయనం అనవచ్చు కదా!. మరి ఎందుకు పిలవడంలేదు?. వాల్మీకి కూడ సీతాయా: చరితం అనే అన్నాడు కాని సీతాయనం అనలేదు. ఎందుకని?.

చంద్రుడు లేనిదే చంద్రిక అంటే వెన్నెల లేదు. వాక్కు లేనిదే అర్థము లేదు. రాముడు లేనిదే సీత లేదు. రాముడు సీతతో కలిసి నడిచినదే రామాయణం. రామునితో కలిసి తిరిగిన సీతాగమనమే సీతాయా: చరితం అవుతుంది. స్త్రీ పురుష యోగమే శక్తి. స్త్రీ శక్తి విరహిత పురుషుడు పరిపూర్ణుడు కాలేడు. నిస్తేజు డౌతాడు. నిర్వీర్యుడౌతాడు. పురుష యోగము లేని స్త్రీ మూర్తి పరిపూర్ణత పొంద లేదు. విరాగిని గా ఉండి పోతుంది లేదా క్షుద్ర రూపిణి గా మారిపోతుంది. అందు కే మాతృత్వము పరిపూర్ణత కు ప్రతీక. అంబ,అమ్మ తల్లి, జనని, మాతా ఇవన్నీ పర దేవత ను మనం ఆర్తి గా ఆరా థించే పేర్లు . ప్రేమ గా పిలుచుకునే పేర్లు. అందుకే మహాకవి కాళిదాసు —-
“ వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ: ప్రతిపత్తయే
జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !! “

వాక్కు, అర్థముల వలే కలసిన ఆది దంపతులు ఈ లోకానికే తల్లి దండ్రులు అన్నాడు. దంపతులకున్న గౌరవం మనసంస్కృతిలో ఒంటరి జీవికి లేదు. మన భారతీయసంస్కృతి దంపతీపూజ కు ఉన్నత స్థానాన్ని కల్పించింది. భర్త చాటు భార్య అనడం తప్పు. భర్త కు తగ్గ భార్య గా ఉండాలి .ప్రకృతి పురుషుల కలయికయే శక్తి. అష్టాదశ పురాణాల్లోను వ్యాసభగవానుడు స్థాపించింది అదే వాల్మీకి చెప్పింది . భార్యలేని భర్తకు పరిపూర్ణతలేదు. భర్త లేని భార్యకు చరిత లేదు. “ శ్రీ శ్రీశ యో స్తు సంబంధశ్చంద్ర చంద్రికయో రివ “అన్నారు పౌరాణికులు. లక్ష్మీ నారాణుల సంబంధం చంద్ర చంద్రికల వంటిదని అంటారు పౌరాణికులు. శివపార్వతులు, సీతారాములు. గౌరీశంకరులు, లక్ష్మీనారాయణులు, ఉమా శంకరులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు గా చెప్పుకుంటాము. స్త్రీ పురుషుల ఎక్కువ తక్కువ ల ప్రసక్తే లేదు . స్త్రీ పురుషుల కలయికే జీవితం . జీవితాలు చెప్పేదే చరిత్ర. కలసి జీవించడమే మన కావ్యాలు మనకిచ్చే సందేశం. కావుననే సీతాయనం కాదు సీతాయాశ్చరితం మహత్.

జానకి లేని రామచంద్రుడు “చంద్రిక లేని చంద్రుని వలె” కాంతి హీను డయ్యాడు. సీతలేని రాముడు శక్తి ని కోల్పోయి, కష్టాల పాలయ్యాడు. సీత చెంత నుండగా “గడ్డిపరక” సైతం రామబాణమై తుంటరుల పీచమడిస్తే,సీతాపహరణం తరువాత రాముడు సమస్తశక్తుల్ని కోల్పోయినవాడై, బేలయై విలపిస్తూ, కొండల్ని, కోనల్ని కలయ తిరుగుతూ, గ్రద్దల్ని, కోతుల్ని సహాయమడుక్కోవలసివచ్చింది. నలభై వేలమంది ఖర దూషణాది రాక్షసులను ఒక్కడుగా మట్టుపెట్టిన అసహాయ శూరుడైన రామచంద్రుడు సీతాపహరణం జరిగిన తరువాత ఎదుటివాడ్ని నమ్మించడానికి తన బలాన్ని ప్రదర్శించి చూపించవలసిన దుస్థితి కి వచ్చాడంటే అందుకు కారణం రాముడ శ్రీ -రాముడు కాకపోవడమే.” శ్రీ “విరహితుడైన-సీత లేని – రాముడు నిస్తేజుడైపోయాడు.

సర్వసంపత్కరము, సర్వదుఖ హరమునైన శ్రీలేని రాముడు వియోగవ్వధా దుఖితుడై విలపించాడు. క్రోథించాడు .తపించాడు .పోరాడి తుదకు శ్రీకరమైన సీతను పొంది సీతారాముడు గా కీర్తి నందాడు.మైథిలీ పాణిగ్రహణం రాముని శ్రీరాముని చేసి గృహస్థుగా మార్చి పట్టాభి షేకానికి సిద్ధం చేసింది. కాని కైకేయీరూప కాలవాహిని రాముని గమనాన్ని మార్చి, రణంయలోని మునులచెంతకు చేర్చి, రాక్షససంహారం చేయించింది. క్షత్రియవీరుడుగా, యువరాజు గా జైత్రయాత్ర పూర్తి చేసుకొని ,సర్వ శక్తి సంపన్నుడై రాజ్యలక్ష్మి ని పరిగ్రహించి, రామచంద్రుడు లోకారాధ్యుడై ఆదర్శప్రాయుడైనాడు.సీతామహా సాధ్వి సీతామాత యై జగదారాథ్య యైంది.

మైథిలీ దాశరధులు సత్యస్వరూపానికి ప్రతినిధులన్న భావం” రామా” “రామ” శబ్దాలలో మహాకవి వ్యంజితం చేశారు. అశోకవనం లో సీతామాతను చూచిన ఆంజనేయుడు ఆమెలో రాముని పోలికలుండటం చూచి ఆశ్చర్యపోతాడు . తల్లీకూతుళ్ల మధ్య,అక్కాచెల్లెళ్ల మధ్య, రక్తసంబంధీకులమధ్య పోలికలుండవచ్చునేమో గాని భార్యాభర్తలమధ్య ఒకే పోలికలుండటం ఆశ్చర్యం కలిగస్తుంది.-

రామాయణాన్ని రామ అయనం, రామా అయనం అని రెండు విధాలుగా విభజిస్తే – సీతారాములిద్దరికి సమప్రాధాన్యాన్ని చేకూర్చవచ్చు.

ఎన్ని ఇడుముల నెదుర్కొన్నా” భర్తా హి మమదైవతం” {2.16.89} అని ప్రకటించిన నిశ్చల నిర్మల హృదయ యీమె. లోకం కోసం అగ్నిప్రవేశం చేయించినా, అరణ్యంలో వదిలేసినా, ఓర్పుతో సహనంతో భర్తగౌరవాన్ని కాపాడి రామచంద్రుని లోకారాథ్యుని గా నిలిపిన ఉత్తమ ఇల్లాలు. రాముడు లోకం కోసం ప్రవర్తించినా “ నేదానీం త్వదృతే సీతే స్వర్గో 2పి మమరోచతే. “ {2.42.30 ]నీవు లేక స్వర్గమును కూడ అంగీకరించనన్న మధురభావనను భర్తలో కల్పించిన మహాసాథ్వి.

“ సీతాహృదయంలో రామచంద్రుడు ద్విగుణుడై వర్తిస్తున్నాడు. ఆమె హృదయాతర్గతమైన ప్రేమను ఆమె హృదయం అతని హృదయానికి చెప్పుచుండెను.-“– అని వ్రాయడంలోనే సీతారాముల అన్యోన్యతను వర్ణించడం లో వాల్మీకి లేఖిని పరవశించింది. అంతేకాక-—“మనస్వీ తద్గతమనా స్తస్యాహృది సమర్పిత: “ అంటాడు మహర్షి. సీతమ్మకు మహర్షి వాడిన విశేషణం” మనస్వీ “ఎంత తియ్యనిమాటో చూడండి.అమ్మ మనస్వి. నిండైన మనస్సుగలది. ఆమె నిండుమనసులో భర్త కు ఎంత ప్రేమను పంచగలదో బిడ్డలకు అంత ప్రేమను అందించ గలదు. అందుకే మహాకవి లేఖిని ఆ కరుణాలవల్లి సీతమ్మ కు” మనస్వి” పదాన్ని వాడింది. వారిరువురి దాంపత్యం అటువంటిది. అందువల్లనే అశోకవనంలో సీతాదేవి ని చూచిన హనుమంతుడు- –“ యుక్తా రామస్య భవతీ ధర్మపత్నీ గుణాన్వితా” అంటూ మెచ్చుకుంటాడు.

హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం సీత శ్రీమహాలక్ష్మి అవతారం. విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. రామాయణము సీతాయాశ్చరితం మహత్ అని చెప్పబడినది,

Write Your Comment