Dronacharya Katha in Telugu

Dronacharya Katha in Telugu…. (Dronacharya of Mahabharatha)..

ద్రోణుడు ధర్మ తత్వజ్ఞుడు. భరద్వాజముని కుమారుడు. శుక్రవంశమున పుట్టిన పుణ్యమూర్తి. సకల శస్త్రాస్త్ర కోవిదుడు. ద్రుపదుని బాల్యమిత్రుడు.

ద్రోణ ద్రుపదులు ఇరువురు కలిసి వేదాధ్యయనము చేశారు. కొంత కాలమనంతరము ద్రుపదుడు పాంచాల దేశమునకు రాజయ్యెను. ఒక నాడు ద్రోణుడు ద్రుపదుని వద్దకు ధనార్థియై వెళ్ళి “నేను నీ బాల్య సఖుడను. ద్రోణుడను. సహాధ్యాయుడనైన నన్ను నీ వెరగవా?” అని ప్రణామపూర్వకముగ పలికెను. రాజ్యమదాంధుడైన ద్రుపదుడు ఆ పలుకులు సహింపలేక “దరిద్ర బ్రహ్మణులకు ధారుణీశులకు సఖ్య మెక్క డ? నెయ్యము కయ్యము వియ్యము సమానమైనవారికి మాత్రమే సంభవించును. కటిక దరిద్రుడవైన నీ వెక్కడ? మహారాజునైన నేనెక్కడ?” అని పలికెను.

ఐశ్వర్య గర్వముతో పలికిన ద్రుపదుని పలుకులకు ద్రోణుడు మిగుల అవమానమును చెంది, భార్యా పుత్రులతో శిష్యగణములతో హస్తినాపురమున కరిగెను. హస్తినాపురమున భీష్మునితో తన అవమాన వృత్తాంతము చెప్పగా, అతడు కురు పాండు కుమారులను చూపి వారిని శిష్యులుగా సమర్పించెను. వారిని ద్రోణుడు “నా ఇష్టమైన కార్యమును మీలో నెవరు కావింతు” రని అడిగెను. కౌరవులు మిన్నకుండిరి. పాండవులలో ఇంద్రసుతుడైన అర్జునుడు అతని ఇష్టకార్యమును ఒనర్చెదనని పలికెను.్ ఆచార్యుడు అతి స్నేహముతో అర్జునుని కౌగలించుకుని, రాజకుమారులకు విలువిద్యా రహస్యములన్నియు నేర్చెను.

ఒకనాడు ద్రోణుడు శిష్యులను రావించి, “నాకు గురుదక్షిణ ఇం” డనగా అందరూ మ్రొక్కి నిలిచి “మే కేది ఇష్టమైన కార్య” మని అడిగిరి. అవివేకి, ఐశ్వర్య మదాంధుడైన ద్రుపదుని పట్టి తెండని ద్రోణుడు వారిని ఆజ్ఞాపించెను. “ఈ క్షణమే ఆ ద్రుపదుని పట్టితెత్తు” మని పలికి కౌరవులు రథము లెక్కి వివిధ ఆయుధములతో దిక్కులు పిక్కటిల్లునట్లు భేరీ నినాదములు కావించుచు వెళ్ళిరి.

అర్జునుడు ద్రోణుని సమీపించి “ఆచార్యోత్తమా! కౌరవులు ద్రుపదుని పట్టి తెచ్చుటకై వెళ్ళిరి. కాని ద్రుపదుని ముందు వీరి గర్వము నశించక తప్పదు. ఆతడు ధనుర్విద్యా విశారదుడు. మీ సఖుడను విషయము వీరికి గుర్తు లేదు కాబోలు.” అని పలికెను.

దుర్యోధనాదులు పాంచాలుని పురమున కరిగిరి. నానావిధ శరములతో ద్రుపదుడు కురువీరులపై విజృంభించెను. ఆతని పరాక్రమమునకు భయపడి, వాని ముందు నిలువజాలక వెనుదిరిగి వచ్చిరి. అర్జునుడు గురువునకు నమస్కరించి భీమసేనుడు సేనాగ్రచరుడుగా, నకుల సహదేవులు రథచక్ర రక్షకులుగా, ద్రుపదుని సేనాసముద్రముపై విరుచుకుపడెను. భీమసేనుని ఘాతములకు ద్రుపద సైన్యము నుగ్గు నూచయయ్యెను. అర్జునుడు ప్రళయకాలము నందలి యమునివలె పాంచాలురను ఎదుర్కొని, ద్రుపదుని రథము మీదకి లంఘించి వానిని బట్టి తెచ్చి ద్రోణునకు గురుదక్షిణగా సమర్పించెను.

ద్రోణాచార్యుడు అర్జునుని పరాక్రమమునకు పరమ సంతుష్ట హృదయుడై చూచి నవ్వుచూ “ఓహో ద్రుపద మహారాజులు పాపము – వీరికెట్టి దశపట్టినది! యిప్పటికైనా రాజ్యమదాంధకారము వీడిపోయినదా రాజా! ఇకనైన మేమెవరమో గుర్తుంచుకొనుము” అని పలికి వానిని బంధవిముక్తుని కావించి పంపెను. ద్రుపదుడు ద్రోణుని చేత పాశవిముక్తుడై ఆ పరాభవమునకు దుఃఖించుచు వెడలిపోయెను.

ఐశ్వర్య గర్వముతో కన్నుమిన్నుగానని వానికి తత్ఫలమును అనుభవింపక తప్పదు. అంతేకాక ఎరిగియు వివిధ విద్యావిశారదులను మిత్రులను అవమానించు వారికి ఎట్టి శిక్ష లభించునో ద్రుపదుని చరితము తెలుపును.

Write Your Comment