Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మృగశిర కార్తె

మృగశిరా నక్షత్ర కూటాన్ని కొందరు మృగం యొక్క శిరస్సు అని, మృగమే అని, మృగరూపం ధరించిన ప్రజాపతి అని, యఙ్ఞోపవీతాన్ని ధరించిన పురుషుడు అని కొందరి అభిప్రాయం. మృగశిరా నక్షత్రానికి అధిదేవత సోముడు అనగా చంద్రుడు. తైత్తిరీయ సంహితలో దీన్ని మృగశీర్ష అన్నారు.

“మూషకాశన పదాకృతౌ విధౌ, వ్యోమ మధ్య మిళితే త్రితారకే ” పిల్లి అడుగుల వంటి మూడు చుక్కలు మృగశిర అని గరుడ పురాణం చెబుతుంది. వేదంలో చాలా చోట్ల మృగశిర వృతశిరమే అని చాలా మంది అభిప్రాయం. వృత్రుని సంహరించి, లోకానికి వర్ష ప్రదానం చేసినవాడు ఇంద్రుడు. జ్యేష్ఠా నక్షత్రం ఇంద్ర దైవత్వం. ఇంద్ర, వ్రుత్రులు ప్రతి స్పర్ధులు. జ్యేష్ఠా, మృగశిర నక్షత్రాలు కూడా ఆకాశంలో ప్రతిస్పర్తులే. తూర్పున జ్యేష్థ ఉదయించగానే పడమర మృగశిర అస్తమిస్తుంది. అంటె అప్పుడు సూర్యుడు మృగశిరతో కూడి ఉంటాడు. అదే మృగశిర కార్తె ప్రవేశం. మృగశిర ప్రవేశంతో వర్షాలు ఆరంభమై గ్రీష్మతాపం తగ్గి లోకం చల్లబడుతుంది.

మృగ‌శిర‌ కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచన గా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగ‌శిర‌ కార్తె ను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక‌ అంటే నాగటి చాలు. ఈ కాలంలో తొల‌క‌రి జ‌ల్లులు ప‌డ‌గానే పొలాలు దున్ని పంటలు వేయటం మొదలుపెడతారు.

వర్షకాలం మృగశిర కార్తెతో ప్రారంభమవుతుంది. మృగశిర కార్తె పూనిననాడు ఆకాశంలో మృగం తలరూపంలో మూడు నక్షత్రాలు ఒక ఆకారంగా ఏర్పడటం కుతూహలం కలిగిస్తుంది. తొలకరితో ప్రారంభమయ్యే వర్షకాలంలో పొలం పనులు నిర్వహించుకోవడానికి అవసరమయ్యే పశు(మృగ) సంపదను సమాయత్తం చేసుకోవడానికి- ఆకాశంలో మృగశిరస్సు రూపంలో దైవం సంకేతాన్ని అందిస్తాడంటారు.

మృగ‌శిర‌ కార్తె జరుపుకునే విధానం / ఆచారాలు

మృగ‌శిర‌ కార్తె మొదటి రోజుని ప్రజలు వివిధ ప్రాంతాల్లో మృగ‌శిర‌, మృగం,మిరుగు, మిర్గం పేర్లతో పండగలా జరుపుకుంటారు. వర్షకాలంలో ఎడతెరిపి లేని వానలవల్ల మనిషికి కొన్ని రుగ్మతలు కలిగే అవకాశం ఉంది. నేటికీ పల్లెప్రాంతాల్లో నాన్నమ్మలు, అమ్మమ్మలూ పిల్లలకు ఇంగువ బెల్లం కలిపి మృగశిర కార్తె పూనిన రోజు తినిపించడం ఆచారంగా కొన్ని ప్రాంతాల్లో గమనించవచ్చు. ఇంగువ శరీరంలో వేడిని అధికం చేసి వర్షకాలంలో సోకే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుందని భావిస్తారు. మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు / ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దూరమవుతాయని ప్రజలలో నమ్మకం కూడా వుంది.

ఉబ్బసం (ఆస్తమా) రోగులకు ఏటా మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తారు.

అసలు కార్తె అంటే

సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. సూర్యుడు ఏ నక్షత్రానికి సమీపంలో ఉంటే ఆ కాలానికి (కార్తెకు) ఆ నక్షత్రం పేరు పెట్టారు.ఈ కార్తెలు సౌరమానం ప్రకారం గణించబడటం తో ఈ కార్తెలు ఆంగ్ల (గ్రెగొరియన్) క్యాలెండరు ప్రకారం దాదాపు ప్రతీ సంవత్సరం ఒకే తేదీల్లో వస్తాయి.

మొత్తం మనకు అశ్వినితో ప్రారంభమై రేవతీతో ముగిసే కార్తెలు ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో ఇరవై ఏడు ఉన్నాయి. అవి 1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జేష్ట్య 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రవణం 23.ధనిష్ట 24.శతభిషం 25.పుర్వాబాధ్ర 26. ఉత్తరాబాధ్ర 27.రేవతి

మృగశిర కార్తె ప్రాముఖ్యత

మృగ‌శిర‌ న‌క్ష‌త్రం దేవ‌గ‌ణానికి చెందిన‌ది. దీనికి అధిప‌తి కుజుడు. ఈ న‌క్ష‌త్రంలో జ‌న్మించిన‌వారు మంచి అదృష్టం క‌లిగివుంటారని భావిస్తారు. పూర్వం వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తు బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది.

అటు పరమాత్మకూ, ఇటు లౌకిక వ్యవహారాలకు మధ్య మృగశిర కార్తె ను సంధానకర్తగా భావిస్తారు. తొలకరి జల్లుల సమయం లో భూమి పైనుంచి వచ్చే పరిమళం జీవరాశులన్నింటికీ ఆనందం కలిగిస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వర్షపు జల్లుల అనంతరం ధరణి నుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తాడు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మానవునిలో ఓజస్సు, తేజస్సు మృగశిరకార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడనే పూర్వకాలం నాటి వైద్యుడు గ్రంథస్థం చేశాడు.

Write Your Comment