Significance of Sundarakanda (Telugu)

Significance of Sundarakanda is explained here..

సుందరకాండ గొప్పతనం

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

శ్లో|| త్రివర్గ ఫలకామేన విపదుద్ధరణేచ్ఛునా!
శ్రీమత్సుందరకాండస్య పాఠః కార్యో విజానతా!!

అని సుందరకాండ మహత్మ్యం తెలుపుతోంది. నాకు తెలిసిన ఒక స్నేహితుడి ఇంటిలో ఇలాంటి ఒక ఉదంతం జరిగింది. వాళ్ళ ఇంటిలో ఒకనాడు ఒక ఇత్తడి బిందె దొంగతనం జరిగింది. నీ భక్తి పిచ్చితో ఇల్లు పట్టించుకోలేదు. అందుకే ఇలా జరిగింది అన్నారు తోటివాళ్ళు. అతనికి తెలిసిందల్లా కష్టం వస్తే ఆ స్వామికి చెప్పుకోవడమే. అందరూ ఇలా అనేసరికి బాధేసింది. ఆ స్వామినే అడగాలనుకున్నాడు. సుందరకాండ సంపుటీకరణ మంత్రాలలో ఒక మంత్రం ఉంది. “తదున్నసం పాండురదంతమవ్రణం, శుచిస్మితం పద్మ ఫలాశలోచనం…..” అని. పోయిన వస్తువులు లాభ పూర్వకంగా తిరిగి లభించడానికి, ఆ సిద్ధమంత్రంతో సంపుటీకరణం చేసి సుందరకాండ నవాహ్న పారాయణ చేసాడు. అతను కొత్త ఉద్యోగంలో చేరి అప్పటికి నాలుగు నెలలయ్యింది. జీతంలో 80% పెరుగుదలతో కొత్త ఉద్యోగంలో చేరాడు. నాలుగు నెలలకి అతనికి సహజంగా అయితే జీతం పెంచరు. కానీ విచిత్రంగా ఈ సుందరకాండ పారాయణ చేసే సమయంలో మరో లక్ష పెంచారు, తర్వాత నెలకి మరో ముప్పై వేలు పెంచారు. మొత్తంగా చేరిన నాలుగు నెలలకి లక్షా ముప్పైవేలు పెంచడం జరిగింది. ఇదంతా అయ్యిన తర్వాత అతను నాతో ఆ విషయం చెబుతూ “మొదట్లో పంతానికి బిందె కోసం పారాయణ మొదలుపెట్టాను, కానీ తర్వాత నాకే సిగ్గేసింది. అంతటి స్వామిని ఒక బిందె కోసం అడగడమా ? అని. అందుకే తర్వాత స్వామికోసం పారాయణ చేసాను. సంపుటీకరణం చేసాను కానీ బిందె కోసం కాకుండా పారాయణ చెయ్యాలని చేసాను. కానీ సుందరకాండ మహిమా, స్వామి అనుగ్రహం ఊరికే పోతుందా ? చూడు ఎన్ని బిందెలు కొంటావో కొనుక్కో అన్నట్టుగా లక్ష రూపాయలు ఇచ్చాడు. ” అని అన్నాడు.

ఒక విషయం అర్ధమయ్యింది నాకు. శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామివారు సీతాపహరణం చెప్తూ అన్న ఒక మాట గుర్తొచ్చింది. “బంగారు జింకని అడిగినందుకు సీతమ్మ కష్టాలు పడలేదు. ఎందుకంటే ఆ అడగడం రాముణ్ణే అడిగింది. కోరకూడనిదైనా భగవంతున్నే కోరిననాడు అది తప్పులేదు. మరెందుకు సీతమ్మ కష్టాల్లో పడింది? తన రక్షణ తాను చూసుకోగలననీ, భగవంతుడిచ్చిన రక్షణ అక్కరలేదనీ అన్నది కాబట్టి బంధంలో పడ్డది. కాబట్టి ఏదైనా భగవంతుడిని అడగడంలో తప్పులేదు. అడిగితే తననైనా ఇచ్చేసుకుంటా నన్నాడు ఆ స్వామి.” అంతేగా మరి ! ఆ స్వామి మనం ఏం అడిగితే అదే ఇస్తాడు, ఏం అడగాలి అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి తాడేపల్లి గారు అన్నారు. సాయి దర్శనం అయినప్పుడు పరిస్థితుల ప్రభావంచేత సంపద కోరుకోవాల్సి వచ్చింది, ఆయన అదే అనుగ్రహించారు అని. అందుకే ఒక సంవత్సరం పాటు ఏమీ ఆశించకుండా నెలకు ఒకసారి చొప్పున ఏకాదశికి మొదలుపెట్టి పంచమికి పూర్తయ్యేలా పన్నెండు సార్లు సుందరకాండ పారాయణ చెయ్యాలని సంకల్పం కలిగింది. ప్రస్తుతం చేస్తున్న త్రిజటా స్వప్న పారాయణ పూర్తయ్యాక భాద్రపదంలో కానీ ఆశ్వయుజంలో కానీ మొదలుపెడదాం అనుకుంటున్నాను. సుందరకాండ పారాయణ చెయ్యగలగడమే గొప్ప ఫలం
నా దృష్టిలో! ఎందుకంటే మనం చెయ్యాలి అనుకున్నంత మాత్రాన కొన్ని పనులు చెయ్యలేము. అలాంటివాటిలో సుందరకాండ పారాయణ ఒకటి. స్వామి అనుగ్రహం, పెద్దల ఆశీస్సులు ఉంటే తప్ప సాధ్యం కాదు. అలాంటి సకలార్ధ సాధక సమర్ధకమైన కల్పవృక్షమైన సుందరకాండ నీడలో చేరి ఆధ్యాత్మిక సౌరభాలని ఆఘ్రాణిద్దాం. స్వామిని ప్రసన్నం చేసుకుని రామసామ్రాజ్యం లో అడుగుపెడదాం. “రామద్వారే తుమ రఖవారె, హో తన ఆజ్ఞా బిను పైటారే” అని మహానుభావులు శ్రీ తులసీదాసస్వాములవారు చెప్పి
ఉన్నారు కదా. సర్వం శ్రీ సీతారామచంద్ర పరదేవతా పరబ్రహ్మార్పణమస్తు.

Write Your Comment