నవదుర్గలు | నవదుర్గ ధ్యానం | నవదుర్గల మహాత్మ్యం | నవదుర్గా పూజ

Navadurga

Navadurga

హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

నవదుర్గ ధ్యానం

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ | తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ || పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ | సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ || నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః | ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||

సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచంలోనవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది. ప్రథమం శైల పుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్తా నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని ఉంది. అయితే, సప్తశతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు.

శైలపుత్రి దేవి

సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి. https://www.youtube.com/watch?v=xBNglHAbX4g

బ్రహ్మచారిణి దేవి

‘బ్రహ్మచారిణి’ యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును. https://www.youtube.com/watch?v=Vz_1vROT-S4

చంద్రఘంట దేవి

ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు ‘చంద్రఘంట’ యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు గడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును. ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు. https://www.youtube.com/watch?v=X3ep45UlE7A

కూష్మాండ దేవి

దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి ‘కూష్మాండ’ అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే. ‘అష్టభుజాదేవి’ అని కూడా అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద – అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే. భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును. https://www.youtube.com/watch?v=5hw_WTFLNdE

దేవి స్కందమాత

కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని ‘స్కందమాత’పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, ‘పద్మాసన’ యనబడు ఈమెయు సింహవాహనయే. స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు. https://www.youtube.com/watch?v=PvoP4L_eyFM

కాత్యాయని దేవి

“కాత్యాయనీ మాత” బాధ్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను. కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులములోని గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన. ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును. https://www.youtube.com/watch?v=aR5zYEQg5Sg

కాళరాత్రి దేవి

“కాళరాత్రి” శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును. కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము – కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను “శుభంకరి” అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు. కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు. https://www.youtube.com/watch?v=_C1koLjifZY

మహాగౌరి దేవి

అష్టవర్షా భవేద్గౌరీ – “మహాగౌరి” అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును.ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము. పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు “మహాగౌరి” యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును. https://www.youtube.com/watch?v=omJzQZ2x4ys

సిద్ధిధాత్రి దేవి

సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము. ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును. https://www.youtube.com/watch?v=heA2OgqczfA

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading