Ponnakalva Utsavam in Govindaraja Swamy Temple, Tirupati.. On 12 May 2025, Ponnakalva Utsavam is celebrated in Govindaraja Swamy Temple in Tirupati.
మే 12న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం
మే 12వ తేదీ చిత్రా పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజ స్వామి పొన్నకాల్వ ఉత్సవం వైభవంగా జరుగనుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, చక్రత్తాళ్వార్ తదితర తొమ్మిది మంది దేవేరులు ఉదయం 6 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి చేరుకుంటారు.
అనంతరం అక్కడ ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. అనంతరం స్వామి, అమ్మవారు వాహన మండపానికి వేంచేస్తారు. అక్కడ సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు.
గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడినుండి గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 8.30 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.