What is the importance of Thirunaamam in Tirumala Tirupati?
తిరునామం !
తిరుమలలో నామధారణకు ఎక్కడా లేనటువంటి వైశిష్ట్యం ఉంది. సాధారణంగా వైష్ణవుల్లో వడగలై, తెంగలై అని రెండు రకాల వారున్నారు. వడగలై వారు ఇంగ్లీషు వర్ణమాలలోని ‘యు’ ఆకారంలో ఊర్ద్వపుండ్రాలు దిద్దుకుంటే.. తెంగలై వారు ‘వై’ ఆకారంలో తిరునామాలు ధరిస్తారు. వైష్ణవ తెగల మధ్య విపరీతమైన భేదభావం ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు వారి నామాన్ని చూసి ఇట్టే గుర్తించే వీలుండేది. వాటికి భిన్నంగా ఓ కొత్త ఒరవడి సృష్టిస్తూ శ్రీవారి నుదుటన దిద్దే నామం ‘యు’,- ‘వై’ ఆకారాలకు మధ్యస్థంగా ఉంటుంది. స్వామివారి ఈ నామాన్ని తిరుమణికావు అంటారు. సాంప్రదాయంగా మూలవిరాట్టుకు వారానికి ఒకసారి మాత్రమే చందనపు పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. అదీ ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత, గురువారం సడలింపు సమయంలో మాత్రం స్వామి కన్నులు కనిపించేలా నామాన్ని కొంతమేర తగ్గిస్తారు.
కస్తూరి తిలకం
శ్రీవారి నామధారణకు 16 తులాల పచ్చకర్పూరం, ఒకటిన్నర తులాల కస్తూరి వాడతారు. బ్రహ్మోత్సవాల సమయంలోనూ అంతకు ముందూ తర్వాతా వచ్చే శుక్రవారాల్లో 32 తులాల పచ్చకర్పూరం, మూడు తులాల కస్తూరిని వాడతారు.