శ్రీవిష్ణుహృత్కమలవాసిని, ఐశ్వర్యప్రదాయిని అయిన శ్రీలక్ష్మీదేవి, వైకుంఠంలో మహాలక్ష్మిగా, భూలోకంలో సస్య లక్ష్మిగా, స్వర్గలోకంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యాల్లో రాజ్యలక్ష్మిగా, భక్తుల ఇళ్ళలో గృహలక్ష్మిగా, వివిధ రూపాలను ధరించి, ఈ సృష్ఠిలోని సకలప్రాణుల జీవితాలలో వెలుగులను వెదజల్లుతూ ఉంటుంది. ప్రకాశవంతంగా ఉండే అన్ని వస్తువులలో, శోభాయమానమయిన రూపంలొ విరాజిల్లుతూ ఉంటుంది. అలాగే, పుణ్యం చేసిన వారికి కీర్తిరూపంలో, రాజుల్లో తేజస్సు రూపంలో, వైశ్యులలో వాణిజ్యరూపంలో, పాపాత్ముల ఇళ్ళలో కలహాలు, ద్వేషాల రూపంలొ, పరోపకార పరాయణుల్లో దయాస్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది.
మహాలక్ష్మి క్షణ కాలం కూడా, పతిని విడిచి ఉండదు. ఆయన ఒక అవతార రూపం ధరించగానే, ఆవిడ ఆయనకు అనుగుణమయిన అనురూపాన్ని ధరిస్తుంది. రాముడికి – సీతగా, కృష్ణుడికి – రుక్మిణిగా,ఇలా యెన్నొ రూపాలు ధరించి, పతి వెన్నంటి ఉంటుంది. వీరిరువురీ అభేధ్య స్థితే లక్ష్మీనరాయణ హృదయానికి ఆపాదించబడింది. నారాయణ హృదయంలో 37 శ్లొకాలు ఉండగా, లక్ష్మీ హృదయంలో 108 శ్లొకాలు ఉన్నాయి. ఇహలోక సౌఖ్యాలన్నిటినీ విడిచి, ఆధ్యాత్మిక జీవితం గడపాలని కొందరు అంటుంటారు. కాని, ఇహం కూడా పరంలో భాగమే! మన జీవితాలు ధనము చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ఆధ్యాత్మిక విషయాలలో సమున్నత స్థాయికి చేరుకోవాలంటే, ఐహిక జీవితంలో కోరికలన్నీ, సంపదల ద్వారా తీరి, పరులకోసం కూడా ధనాన్ని సద్వినియోగ పరచి, తమ పనులను ఫలప్రదంగా పూర్తీ చేసుకుని, ఒక పరాకాష్టకు చేరుకుంటేనే, మనిషి ఆధ్యాత్మికత వైపు పయనం సాగించగలుగుతాడు. అందుకే భృగు మహర్షి ఇహ పర దాయిని అయిన ఆ జగన్మాతను, ఇహలోక సౌఖ్యాలను కోరుతూ, అంతర్లీనంగా మోక్షాన్ని ప్రసాదించమన్న సందేశాన్ని ఈ శ్లోకం లో ఇమిడ్చారు. అత్యంత మహిమాన్వితమయిన ఈ ‘లక్ష్మీ నారాయణ హృదయం’ లో మొదటి భాగమయిన ‘నారాయణ హృదయాన్ని’ క్రిందటి సంచికలో అందించాము. ఇష్టకామ్యార్ధ సిద్ధికి మొదట ‘నారాయణ హృదయం ‘చదివి, తరువాత ‘లక్ష్మీ హృదయం’ చదివి, తిరిగి మరలా నారాయణ హృదయం చదవాలి.
శ్రీ లక్ష్మీ హృదయం
హరిః ఓం || అస్య శ్రీ ఆద్యాది శ్రీమహాలక్ష్మీ హృదయ స్తొత్ర మహామంత్రస్య భార్గవ ఋషిః, అనుష్టుబాది నానాఛందాంసి, ఆద్యాసి శ్రీమహాలక్ష్మీ సహిత నారాయణో దేవతా||
శ్రీం బీజం, హ్రీం శక్తిః ,ఐం కీలకం| ఆద్యాది శ్రీమహాలక్ష్మీ ప్రసాదసిద్ధ్యర్ధే జపే వినియోగః||
ఓం|| ఆద్యాది శ్రీమహాలక్ష్మీ దేవతాయై నమః హృదయే, శ్రీం బీజాయై నమః గుహ్యే, హ్రీం శక్త్యైః నమః పాదయోః,ఐం బలాయైః నమః మూర్ధాదిపాదపర్యంతం విన్యసేత్||
ఓం||శ్రీం, హ్రీం, ఐం, కరతలకరపార్స్వయోః, శ్రీం అంగుష్ఠాభ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, ఐం మధ్యమాభ్యాం నమః, శ్రీం అనామికాభ్యాం నమః, హ్రీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః||
శ్రీం హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహా, ఐల్ శిఖాయై వౌషట్, శ్రీం కవచాయ హుం, హ్రీం నేత్రాభ్యాం వౌషట్, ఐం అస్త్రాయ ఫట్, భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః ||
అధ ధ్యానం
హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా!
హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్ ||
భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని స్మరిస్తున్నాను.
కౌశేయ పీతవసనామరవిందనేత్రాం పద్మాద్వయాభయవరోద్యతపద్మహస్తాం |
ఉద్యఛ్ఛతార్క సదృశాం పరమాంకసంస్థాం ధ్యాయేద్ విధీశనత పాదయుగాం జనిత్రీం ||
భావం: పద్మ దళముల వంటి కన్నులు కలది, పద్మముల వంటి కోమల హస్తాలతో అభయాన్ని ఇచ్చేది, ఉదయ భానుడి వంటి ప్రకాశవంతమయిన దేహము కలది, ఎరుపు-పసుపు మేళవించిన వస్త్రాలు ధరించినది, పరమార్ధ ప్రదాయిని, లోకమాత అయిన మహాలక్ష్మీదేవి పాదపద్మములను స్మరించుచున్నాను.
శ్రీ లక్ష్మీ కమలధారిణ్యై సింహవాహిన్యై స్వాహా ||
భావం: సింహవాహిని, కమల ధారిణి అయిన శ్రీలక్ష్మీదేవిని స్మరించుచున్నాను.
( ఈ శ్లోకాన్ని 10, 16,32, 56, లేక 108 సార్లు జపించాలి.)
పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తద్వయాన్వితాం|
లక్ష్మీం ధ్యాత్వేతి మంత్రేణ స భవేత్ పృధివీపతిః||
భావం: బంగారు మేనిఛాయతో , పీతవస్త్రాలను (పసుపు రంగు) వస్త్రాలను , ఇరు హస్తాలలో పద్మాలు ధరించిన లక్ష్మీదేవిని పై విధంగా ధ్యానించిన వారికి మహారాజయోగం పడుతుంది.
మాతులుంగ గదాఖేటే పాణౌ పాత్రంచ బిభ్రతీ|
వాగలింగంచ మానంచ బిభ్రతీ నృపమూర్ధని||
భావం: తన చేతులలో గద, డాలు,నిమ్మ పళ్ళతో నిండిన పాత్ర ధరించి, వాగలింగాన్ని గౌరవించే రాజుల నుదిటిపై వెలుగొందే లక్ష్మిని ధ్యానించుచున్నాను.
ఓం, శ్రీం, హ్రీం, ఐం||
వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధజంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్జ్వలాంగీం|
బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం
ఆద్యాం శక్తిం సకలజననీం సర్వమాంగళ్య యుక్తాం|| 1 ||
భావం: దైవత్వానికి ప్రతిరూపమయినది, స్వచ్చమయిన బంగారం వలె దివ్యతేజస్సు కలది, కనక వస్త్ర ధారిణి , సకల ఆభరణాలతో మెరిసే దేహము కలది, దానిమ్మగింజలతో నిండిన కనక కలశాన్ని,పద్మాలను చేత ధరించినది, ఆదిశక్తి , లోకమాత అయిన లక్ష్మికి ప్రణామములు.
శ్రీమత్సౌభాగ్యజననీం స్తౌమి లక్ష్మీం సనాతనీం |
సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం || 2 ||
భావం: తన ఉపాసనతో సకలసౌభాగ్యాలను కలిగించేది, అన్ని కోరికలనూ తీర్చేది, అదృష్టదాయిని,సనాతని అయిన లక్ష్మిని నుతించుచున్నాను.
స్మరామి నిత్యం దేవేశి త్వయా ప్రేరితమానసః |
త్వదాజ్ఞాం శిరసా ధృత్వా భజామి పరమేశ్వరీం|| 3 ||
భావం: నీ వలన ప్రేరితమయిన మనస్సుతో, నీ ఆజ్ఞను శిరసావహించి, పరమేశ్వరివయిన నిన్ను నిత్యం తలచుకుంటాను దేవీ !
సమస్తసంపత్సుఖదాం మహాశ్రియం
సమస్తకల్యాణకరీం మహాశ్రియం |
సమస్తసౌభాగ్యకరీం మహాశ్రియం
భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియం || 4 ||
భావం: సమస్త సంపదలను ప్రసాదించేది, సమస్త మంగళాలను కలిగించేది, సౌభాగ్యదాయిని, జ్ఞానప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవిని భజిస్తున్నాను.
విజ్ఞాన సంపత్సుఖదాం మహాశ్రియం
విచిత్రవాగ్భూతికరీం మనోరమాం |
అనంతసౌభాగ్యసుఖప్రదాయినీం
నమామ్యహం భూతికరీం హరిప్రియాం || 5 ||
భావం: మానసిక ఉల్లాసాన్ని కలిగించేది, హరిప్రియ, వాగ్దాయిని, సర్వసంపదలను ప్రసాదించేది, విజ్ఞాన సంపద ద్వారా శాశ్వత ఆనందాన్ని ప్రసాదించేది అయిన మహాలక్ష్మికి వందనములు.
సమస్తభూతాంతరసంస్థితా త్వం
సమస్తభక్తేశ్వరి విశ్వరూపే |
తన్నాస్తి యత్త్వద్వ్యతిరిక్తవస్తు
త్వత్పాదపద్మం ప్రణమామ్యహం శ్రీః || 6 ||
భావం: తల్లీ! నువ్వు సర్వంతర్యామినివి. భక్తులందరికీ ఆరాధ్యదేవతవు. విశ్వరూపిణివి. నువ్వు కానిది ఏదీ ఈ లోకంలో లేదు. అట్టి నీ పాదపద్మములకు నమస్కారములు.
దారిద్ర్య దుఃఖౌఘ తమోనిహంత్రి
త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ |
దీనార్తివిచ్ఛేదన హేతుభూతైః
కృపాకటాక్షైరభిషించ మాం శ్రీః || 7 ||
భావం: దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని హరించే, నీ పాదపద్మముల సన్నిధిని నాకు ప్రసాదించు. నా లోని ఆర్తిని, దీనత్వాన్ని తొలగించే నీ కృపాద్రుష్టిని నాపై వర్షింపచెయ్యి తల్లీ !
విష్ణుస్తుతిపరాం లక్ష్మీం స్వర్ణవర్ణ స్తుతిప్రియాం |
వరదాభయదాం దేవీం వందే త్వాం కమలేక్షణే || 8 ||
భావం: ఓ కమలేక్షణా! విష్ణు స్తుతిని వినుటకు ఇష్టపడే దానివి, బంగారు మేనిఛాయ కలదానివి అగు నీవు నీ వరద హస్తంతో నాకు అభయం ఇవ్వు తల్లీ!
అంబ ప్రసీద కరుణాపరిపూర్ణదృష్ట్యా
మాం త్వత్కృపాద్రవిణగేహమియం కురుష్వ |
ఆలోకయ ప్రణతహృద్గతశోకహంత్రి
త్వత్పాదపద్మయుగళం ప్రణమామ్యహం శ్రీః || 9 ||
భావం: అమ్మా! నీ పరిపూర్ణమయిన కృపాదృష్టితో, నా ఇంటిని దయాధనంతో నింపు. నా కలతలను తొలగించు. ఓ మహాలక్ష్మీ, నీ పాదపద్మములకు ప్రణామములు.
శాంత్యై నమోస్తు శరణాగతరక్షణాయై
కాంత్యై నమోస్తు కమనీయగుణాశ్రయాయై |
క్షాంత్యై నమోస్తు దురితక్షయకారణాయై
ధాత్ర్యై నమోస్తు ధనధాన్య సమృద్ధిదాయై || 10 ||
భావం: నిన్ను ఆశ్రయించిన వారిని రక్షించే శాంతమూర్తివి. అనేక సుగుణాలతో ప్రకాశించే దివ్యకాంతివి. అన్ని బాధలను క్షణాలలో నిర్మూలించే సహనశీలివి. ధనధాన్యాలతో అందరినీ కరుణించే భూమాతవు. నీకు అనేక నమస్కారములు.
శక్త్యై నమోస్తు శశిశేఖర సంస్థితాయై
రత్యై నమోస్తు రజనీకరసోదరాయై
భక్త్యై నమోస్తు భవసాగరతారకాయై
మత్యై నమోస్తు మధుసూదనవల్లభాయై || 11 ||
భావం : చంద్రుడిని అలంకారంగా చేసుకున్న శక్తివి, చంద్ర సహోదరివయిన రతివి, భక్తితో ఆశ్రయించిన వారిని సంసారసాగరం దాతించె భక్తివి, మధుసూదనుడి పత్నివయిన మతివి అయిన నీకు నమస్కారములు.
లక్ష్మ్యై నమోస్తు శుభలక్షణలక్షితాయై
సిద్ధ్యై నమోస్తు సురసిద్ధసుపూజితాయై |
ధృత్యై నమోస్తు మమ దుర్గతిభంజనాయై
గత్యై నమోస్తు వరసద్గతిదాయకాయై || 12 ||
భావం: అనేక శుభ లక్షణాలకు నెలవయిన లక్ష్మివి.దేవతలు, మునులు కొలిచే సిద్ధివి, దుర్గతులను నాశనం చెసే ధ్రుతివి, సద్గతిని చూపే మార్గదర్శివి అయిన నీకు నమస్కారములు.
దేవ్యై నమోస్తు దివి దేవగణార్చితాయై
భూత్యై నమోస్తు భువనార్తివినాశకాయై |
శాంత్యై నమోస్తు ధరణీధరవల్లభాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవత్సలాయై || 13 ||
భావం: దివిలో దేవగణాలచే పూజింపబడే దేవివి,భువిలో ఆర్తి హరించే భూతివి, ధరణిని ధరించే విష్ణువుకు సతివి, శాంతమూర్తివి, పురుషోత్తముడి వాత్సల్యాన్ని పొందిన పుష్టివి అయిన నీకు నమస్కారములు.
సుతీవ్ర దారిద్ర్య తమోపహంత్ర్యై
నమోస్తు తే సర్వ భయాపహంత్ర్యై |
శ్రీవిష్ణువక్షస్థల సంస్థితాయై
నమోనమః సర్వవిభూతిదాయై || 14 ||
భావం: అతి భయంకరమయిన దరిద్ర్యాన్ని కూదా హరించేదానివి, అన్ని భయాలను తొలగించే దానివి, అన్ని శుభాలను కలిగించే విష్ణు వక్షస్థల వాసినివి, అయిన నీకు నమస్కారములు.
జయతు జయతు లక్ష్మీర్లక్షణాలంకృతాంగీ
జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్యా |
జయతు జయతు విద్యా విష్ణువామాంకసంస్థా
జయతు జయతు సమ్యక్సర్వసంపత్కరా శ్రీః ||15||
భావం: చక్కటి ఆభరణాలను ధరించిన లక్ష్మివి, బ్రహ్మాది దేవతలచే కొలువబడే పద్మవు, విష్ణువుకు యెడమ తొడపై కూర్చునే విద్యవు, అన్ని సంపదలను ప్రసాదించె శ్రీలక్ష్మివి అయిన నీకు జయమగుగాక !
జయతు జయతు దేవీ దేవసంఘాభిపూజ్యా
జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా |
జయతు జయతు నిత్యా నిర్మలజ్ఞానవేద్యా
జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా || 16 ||
భావం: దేవతలచే పూజింపబడే దేవివి, భృగు మహర్షి కుమార్తె అయిన భద్రవు, భాగ్య స్వరూపానివి, శుద్ధ జ్ఞానాన్ని ప్రసాదించే నిత్యవు, అన్ని ప్రాణులలో నివసించే సత్యవు అయిన నీకు జయమగుగాక !
జయతు జయతు రమ్యా రత్నగర్భాంతరస్థా
జయతు జయతు శుద్ధా శుద్ధజాంబూనదాభా |
జయతు జయతు కాంతా కాంతిమద్భాసితాంగీ
జయతు జయతు శంతా శీఘ్రమాగచ్ఛసౌమ్యే || 17 ||
భావం: వెలలేని రత్నముల గర్భాంతరాలలో ఉండే రమ్యవు, స్వచ్చమయిన బంగారంలాగా వెలిగే శుద్ధవు, ప్రకాశవంతమయిన అంగాలతో వెలిగే కాంతివి, శాంతవు, సౌమ్యవు అయిన నీకు జయమగుగాక. నువ్వు త్వరగా రా తల్లీ.
యస్యాః కలాయాః కమలోద్భవాద్యా
రుద్రాశ్చ శక్రప్రముఖాశ్చ దేవాః |
జీవంతి సర్వేపి సశక్తయస్తే
ప్రభుత్వమాప్తాః పరమాయుషస్తే || 18 ||
భావం: శివుడు, ఇంద్రుడు, మొదలయిన దేవతలు నీ శక్తి వల్లనే మనగలుగుతున్నారు. నీ వల్లనే తరగని ఆయుష్షును , ఆధిపత్యాన్ని పొందుతున్నారు. నీ కళళతో కమలం నుండి ఉధ్భవించిన నీకు నమస్కారములు.
||ముఖబీజం||
ఓం – హ్రాం – హ్రీం – అం – ఆం – యం – దుం – లం – వం ||
లిలేఖ నిటిలే విధిర్మమ లిపిం విసృజ్యాంతరం
త్వయా విలిఖితవ్యమేతదితి తత్ఫలప్రాప్తయే |
తదంతికఫలస్ఫుటం కమలవాసిని శ్రీరిమాం
సమర్పయ సముద్రికాం సకలభాగ్యసంసూచికాం || 19 ||
భావం: బ్రహ్మ నా నుదుట వ్రాసిన తలరాతను , నీ రాతతో తిరగరాసి, నాకు శుభం కలిగేలా దీవించు తల్లీ. ఆ శుభాలనుండి మంచి ఫలితాలు కలిగేలా, నీ అదృష్ట ముద్రికను కూడా వాటి వద్ద వ్రాయి తల్లీ.
||పాదబీజం||
ఓం – అం – ఆం – ఈం – ఏం – ఐం – కం – లం – రం
కలయా తే యథా దేవి జీవంతి సచరాచరాః
తథా సంపత్కరీ లక్ష్మి సర్వదా సంప్రసీద మే || 20 ||
భావం: సకల చరాచర జగత్తు, ఉనికికి కారణం నువ్వే! సంపదలను ప్రసాదించే లక్ష్మివయిన నీవు, సదా నాపై ప్రసన్నురాలిగా ఉండు దేవీ !
యథా విష్ణుర్దృవం నిత్యం స్వకలాం సన్న్యవేశయత్ |
తథైవ స్వకలాం లక్ష్మి మయి సమ్యక్సమర్పయ || 21 ||
భావం : విష్ణువు అనునిత్యం తన కళల నుంచీ కొంత భాగం దేవతలకు ఎలా అందిస్తాడో, ఓ లక్ష్మీ, అదే విధంగా నీవు కూడా నీ కళలలో కొంత భాగాన్ని నాకు అనుగ్రహించు.
సత్వసౌఖ్యప్రదే దేవి భక్తానామభయప్రదే |
అచలాం కురు యత్నేన కలాం మయి నివేశితాం || 22 ||
భావం:భక్తులకు అన్ని శుభాలను కలిగిస్తూ అభయమిచ్చే ఓ దేవీ! నీ కళలతో నాయందు నివసిస్తూ స్థిరంగా ఉండు.
ముదాస్తాం మత్ఫాలే పరమపదలక్ష్మీః స్ఫుటకలా
సదా వైకుంఠశ్రీర్నివసతు కలా మే నయనమోః |
వసేత్సత్యే లోకే మమ వచసి లక్ష్మీర్వరకలా
శ్రియశ్శ్వేత ద్వీపే నివసతు కలా మే స్వకరమోః || 23 ||