అష్టలక్ష్మీ స్వరూపాలు

భక్తాభీష్ట ప్రదాయిని, ధర్మసంవర్ధిని అయిన జగన్మాత శ్రీమహాలక్ష్మి అష్టలక్ష్మీ రూపాల్లో ఈ జగత్తుని పరిపాలిస్తోంది. విష్ణుమూర్తి ధరించిన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్క్యావతారాలు ఏ రకంగా జగత్కల్యాణానికి ఉద్దేశింపబడ్డాయో, అలాగే విష్ణువు పత్నియైన లక్ష్మీదేవి అవతారాలు కూడా జగత్కల్యాణ కారకాలే. స్థితి కార్య నిర్వహణలో లక్ష్మీనారాయణులు ఇరువురూ సమాన బాధ్యతలని వహిస్తారు. ధర్మ సంరక్షణ, సమాజ సంక్షేమం కోసం దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేశాడు నారాయణుడు. సమాజం వ్యక్తుల సమూహం కాబట్టి ఆయా వ్యక్తుల సంరక్షణకోసం, అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపధారణ చేసింది.
ఒక మాతృమూర్తి తన కన్నా బిడ్డలని సరైనమార్గంలో పెంచటం కోసం రోజూ ఎన్నో రకాల అవతారాలను ఎత్తుతుంది. వాత్సల్యపూరితంగా అనునయిస్తునే తప్పు చేస్తే దండిస్తుంది. మనకి విద్యాబుద్ధులు నేర్పిన ప్రథమగురువు అయిన ఆ తల్లే అవసరమైప్పుడు ధైర్యాన్ని నూరిపోసి వీరత్వాన్ని వృద్ధి చేస్తుంది. ముఖ్యంగా ధర్మచింతన, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం, కరుణ, జాలి, వివేకం ఇవన్నీ ఆ అమ్మ పెట్టిన భిక్షలే. ఒక సాధారణ మాతృమూర్తే తన పిల్లల కోసం ఇంత కష్టపడుతూవుంటే, ఆ జగన్మాత లక్ష్మీదేవి సంగతి చెప్పాలా, అనేక కోట్ల జీవరాశులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ ఆ తల్లినే తలుచుకుంటారు. అందరికీ అన్ని రకాల శక్తులను అందించటం కోసం ఈ అష్టలక్ష్మీ రూపాలను ఎంచుకుంది ఆ తల్లి. అన్ని శక్తులను ఒకే రూపంలో యివ్వొచ్చుకదా.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలగటమే మన సంస్కృతి ప్రత్యేకత. నిజానికి పరబ్రహ్మతత్వం నిర్గుణమైనది, నిరాకారమైనది, ఆదిమధ్యంతాలు లేనిది. వాచామగోచరమైనది అని వేదాలు ఘోషిస్తున్నాయి. కాని సాధకుని మనఃస్థితిని దృష్టిలో వుంచుకుని అతని మనస్సంతుష్టి కోసం, ఆ పరబ్రహ్మ తత్వానికి రూపాన్ని అందించటం జరిగింది. నిరాకార పరబ్రహ్మ పైన దృష్టిని నిలిపి ధ్యానం చేయడంకంటే సాకార రూపంపై దృష్టిని నిలిపి ధ్యానం చేయడం సులువు కాబట్టి ప్రాథమిక స్థితిలో సాధకుడికి సాకారరూపం అవసరమవుతుంది. ఆ విధంగా వచ్చినవే త్రిమూర్తులు, ముగ్గురమ్మలూ, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, మొదలైనవి ఒక్కొక్కదేవతామూర్తి ఒక్కో రకమైన శక్తికి ఆదిదేవతగా పురాణాల్లో చెప్పబడింది. శరన్నవరాత్రులలో అమ్మవారిని కొలుస్తాం. శివరాత్రికి పరమేశ్వరుడిని, వైకుంఠ ఏకాదశికి శ్రీమన్నారాయణుని పూజిస్తాం.
గీతాచార్యుడి నుంచి సాయినాథుడి వరకూ దేవుడొక్కడే అని ఎన్నిరకాలు బోధించినా ఈ రకమైన బహు దేవతారాధన సమాజంలో నెలకొని వుండడానికి కారణం అనాది నుంచీ మనలో నెలకొని వున్న ప్రగాఢ భక్తి విశ్వాసాలే. ఎక్కడ విశ్వాసం వుందో అక్కడే ఫలితం కన్పిస్తుంది. ఆధునిక సమాజంలో కూడా వేరువేరు పనులకి వేరువేరు వ్యక్తుల వద్దకి వెళ్ళి సలహా పొందుతూ వుంటాం. ఏ రంగానికి సంబంధించిన విషయాల్ని ఆ రంగానికి సంబంధించిన నిపుణుల్ని అడిగి తెలుసుకుంటాం.. బహు దేవతారాధన కూడా ఇలాంటిదే. సరైన చిరునామా రాస్తేనే మన అర్జీ సరైన చోటికి వెళ్ళి సమాధానం వస్తుంది. లేదంటే ఎప్పటికో రావొచ్చు. లేక రాకపోనూవచ్చు. దేవతల విషయంలో ఈ సామ్యం వర్తిస్తుంది. ఇంతకుమించిన ఎన్నో వేదాంత విజ్ఞాన రహస్యాలు ఈ దేవతారూపాలలో నిబిడీకృతమై వున్నాయి.
శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాల్లో జగత్తుకి సమస్త రకాలయిన శక్తుల్ని, పరిపుష్టిని ప్రసాదిస్తోంది. ప్రాణులకు మూలాధారమైన శక్తిప్రాణశక్తి. ఆ శక్తిని ప్రసాదించే తల్లి ఆదిలక్ష్మీదేవి. శారీరక, మానసిక ఆరోగ్యాలు పరిపూర్ణంగా వుండాలంటే ఆదిలక్ష్మీదేవి అనుగ్రహం వుండాలి. పుట్టిన బిడ్డకి స్తన్యాన్ని అందించి ఆకలి తీర్చి తన పొత్తిళ్ళలో పెట్టుకుని కాపాడేది మన మాతృమూర్తి. అలాగే మనకి అవసరమైన ఆహారాన్ని సమకూర్చేది ధాన్యలక్ష్మీదేవి. సమస్త రకాలైన ధాన్య సంపదని, పాడిపంటలనీ ప్రసాదించే ఈ తల్లి అనుగ్రహం వల్ల శరీరానికి ధారుఢ్యం, బలం చేకూరుతాయి. శరీర వృద్ధికి ఈ తల్లి అనుగ్రహం అవసరం. కార్యం సాధించాలంటే కేవలం శారీరక బలం చాలదు. దైర్యసాహసాలు, మనోబలం కావలి. వీటిని ప్రసాదించే ధైర్యలక్ష్మీదేవి. అవసరమైన సామయమ్లో ధైర్యం ప్రసాదించి మనల్ని కార్యసాధకులని చేస్తుంది ఆ తల్లి. సకల శుభకారిణి గజలక్ష్మీదేవి. మనం సాధించిన విజయం శుభకారిణి అయ్యేలా అనుగ్రహిస్తుంది. శుభం అంటే మనకి మాత్రమే మంచిదని కాదు. సమాజహితానికి కారణభూతమయ్యేది, మన విజయం వల్ల అందరూ సుఖపడాలి అదే నిజమైన శుభం.
ముత్తయిదువలు వైభవ లక్ష్మీ రూపంలో గజలక్ష్మిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. జీవితంలో మనం అభివృద్ధి సాధిస్తే సరిపోదు. మన ఆనందంలో పాలు పంచుకోవడానికి పిల్లలు కావాలి. వాళ్ళు మంచి విద్యాబుద్ధులు కలిగి వుండాలి. మన జ్ఞానవిజ్ఞాన ఆచార సంస్కృతీ వైభవాలని ముందు తరానికి తీసుకెళ్ళాలి. అటువంటి సత్సంతనాన్ని ప్రసాదించేది సంతానలక్ష్మీ. సర్వేసర్వత్రా మనకి విజయాన్ని ప్రసాదించేది విజయలక్ష్మీ మాత. మనం ఏ ఉద్దేశ్యంతో ఒక కార్యాన్ని చేస్తామో ఆ లక్ష్యం నెరవేరేలా ఈ తల్లి అనుగ్రహిస్తుంది. ఈ రకంగా ఆరువిధాల శక్తులను అనుగ్రహించిన ఆ జగన్మాత మనకి సద్ వివేచన, విద్యాబుద్ధులకి తగిన గుర్తింపు కలిగి సంఘంలో గౌరవం, భోగభాగ్యాలు కలుగుతాయి. అష్టమ అవతారమైన ధనలక్ష్మీ రూపంలో ఆ తల్లి మనకు సకలైశ్వర్యాలను అనుగ్రహిస్తోంది. అంతేకాక శాశ్వతమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ముక్తినీ కూడా ప్రసాదిస్తుంది. జీవితంలో అందరికీ ఏదో ఒక దశలో సమస్యలు వస్తాయి. ఆయా సమస్యల పరిష్కారం కోసం అశాశ్వతమైన వ్యక్తులను, వ్యవస్థలను నమ్ముకోవడం కంటే ఆ లక్ష్మీమాతనే నమ్ముకోవడం అత్యంత ఉత్తమం. మన మనస్సు నడవడిక మంచిదయితే ఆ తల్లి తప్పక కరుణిస్తుంది.

Write Your Comment